త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Market | ఐటీ స్టాక్స్ కుదేలు.. భారీగా మార్కెట్లు ప‌త‌నం.. ఒకే రోజు 6.50ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరి..!

Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం భారీ న‌ష్టాల్లో ముగిశాయి. ప్ర‌పంచ మార్కెట్‌లో ప్ర‌తికూల ప‌వ‌నాలు దేశీయ మార్కెట్‌లో భారీ ప్ర‌భావం చూపించాయి. అలాగే, ఐటీ స్టాక్‌లో అమ్మ‌కాల‌తో మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గుర‌య్యాయి. సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల‌కుపైగా, నిఫ్టీ 300 పాయింట్ల‌కుపైగా ప‌త‌న‌మ‌య్యాయి.

P

Business | Published On Feb 13, 2026, 5.24 pm IST

Stock Market | ఐటీ స్టాక్స్ కుదేలు.. భారీగా మార్కెట్లు ప‌త‌నం.. ఒకే రోజు 6.50ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరి..!
Advertisement

Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం భారీ న‌ష్టాల్లో ముగిశాయి. ప్ర‌పంచ మార్కెట్‌లో ప్ర‌తికూల ప‌వ‌నాలు దేశీయ మార్కెట్‌లో భారీ ప్ర‌భావం చూపించాయి. అలాగే, ఐటీ స్టాక్‌లో అమ్మ‌కాల‌తో మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గుర‌య్యాయి. సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల‌కుపైగా, నిఫ్టీ 300 పాయింట్ల‌కుపైగా ప‌త‌న‌మ‌య్యాయి. ఒకే రోజు మార్కెట్లో రూ.6.50ల‌క్ష‌ల కోట్ల మ‌దుప‌రుల సంప‌ద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టెడ్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.472ల‌క్ష‌ల కోట్ల నుంచి రూ.465.50ల‌క్ష‌ల కోట్ల‌కు త‌గ్గింది.

వ‌రుస‌గా మూడో సెష‌న్‌లో ఐటీ స్టాక్స్‌లో భారీగా అమ్మ‌కాలు జ‌రిగాయి. ఆంథ్రోపిక్ ఏఐ టూల్ ఆందోళ‌న మ‌ధ్య నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 9శాతం ప‌త‌న‌మైంది. గ‌తేడాది ఏప్రిల్ త‌ర్వాత తొలిసారిగా భారీగా ఐటీ స్టాక్ న‌ష్ట‌పోయింది. విస్తృత మార్కెట్ల‌లో భారీగా అమ్మ‌కాలు జ‌రిగాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు దాదాపు 2 శాతం తగ్గాయి. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలీవర్, ఎటర్నల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఓఎన్‌జీసీ భారీగా న‌ష్ట‌పోయాయి. మరోవైపు, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిప్లా లాభాల్లో కొన‌సాగాయి. రంగాల వారీగా అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఎనర్జీ, మెటల్, రియాల్టీ సూచీలు ఒక్కొక్కటి 2 నుంచి 3 శాతం క్షీనించాయి. ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, టెలికాం, ఇన్‌ఫ్రా, ఆటో, పవర్, పీఎస్‌యూ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒక్కొక్కటి ఒక‌శాతం ప‌డిపోయాయి.

మార్కెట్ల ప‌త‌నానికి ప్ర‌ధాన కార‌ణంగా ఐటీ స్టాక్ అని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఆంథ్రోపిక్ ఏఐ టూల్ కార‌ణంగా అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్నారు. భార‌త మార్కెట్‌లో ఐటీ స్టాక్స్ దాదాపు 10శాతం వాటా ఉంద‌ని.. ఈ క్ర‌మంలో ఏఐ కార‌ణంగా భారీగా అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని నిపుణులు తెలిపారు. అదే స‌మ‌యంలో అమెరికా ఐపీఐ డేటాకు ముందు సెంటిమెంట్ బ‌ల‌హీన‌ప‌డింది. భార‌త్-అమెరికా వాణిజ్య ఒప్పందం ప్ర‌క‌ట‌న త‌ర్వాత సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది. ఆ త‌ర్వాత లాభాల స్వీక‌ర‌ణ‌కు దిగ‌డం, అలాగే, డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి ప‌త‌నం కావ‌డం మార్కెట్లు ఒత్తిడికి గుర‌వుతున్నాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. భార‌త మార్కెట్ల ప‌తనానికి ప్ర‌ధాన కార‌ణంగా అమెరికా మార్కెట్లు ప‌త‌నం కావ‌డ‌మేన‌ని సెబీ రిజిస్ట‌ర్డ్ ఫండ‌మెంట‌ల్ ఈక్విటీ విశ్లేష‌కుడు అవినాష్ గోర‌క్ష‌క‌ర్ తెలిపారు. యూఎస్ సీపీఐ డేటాకి ముందు యూఎస్ మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయ‌ని.. యూఎస్ ఆర్థిక వ్య‌వ‌స్థ స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో ఈ వారం చివ‌రి సెష‌న్‌లో పెట్టుబ‌డిదారులు ఛాన్స్ తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌ర‌ని ఆయ‌న తెలిపారు. భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందం ప్రకటించిన తర్వాత భారతీయ స్టాక్‌లలో సెంటిమెంట్ బ‌ల‌ప‌డ‌డం.. ఆ త‌ర్వాత లాభాల స్వీక‌ర‌ణ‌కు దిగ‌డం, రూపాయి బ‌ల‌హీన‌ప‌డ‌డం మార్కెట్ పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

Advertisement
Advertisement