త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | రుణ వసూళ్లపై ఆర్‌బీఐ కఠిన నియంత్రణలు.. ఏజెంట్లకు శిక్షణ, కాల్ రికార్డింగ్ తప్పనిసరి..

RBI | రుణ వసూళ్ల వ్యవహారంలో పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నియమించే రికవరీ ఏజెంట్ల పనితీరుపై కట్టుదిట్టమైన ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. రుణగ్రహీతల హక్కులను పరిరక్షించే దిశగా ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

S

Business | Published On Feb 13, 2026, 7.20 am IST

RBI | రుణ వసూళ్లపై ఆర్‌బీఐ కఠిన నియంత్రణలు.. ఏజెంట్లకు శిక్షణ, కాల్ రికార్డింగ్ తప్పనిసరి..
Advertisement

RBI | రుణ వసూళ్ల వ్యవహారంలో పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నియమించే రికవరీ ఏజెంట్ల పనితీరుపై కట్టుదిట్టమైన ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. రుణగ్రహీతల హక్కులను పరిరక్షించే దిశగా ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ముసాయిదా ప్రకారం, రుణ వసూళ్ల కోసం ఏజెంట్లు చేసే ప్రతి ఫోన్ కాల్‌ను తప్పనిసరిగా రికార్డు చేయాలని ఆర్‌బీఐ పేర్కొంది. రుణగ్రహీతతో మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకంగా, గౌరవంగా వ్యవహరించాలనే విషయాన్ని ప్రత్యేకంగా హైలైట్ చేసింది. ఇంటికి వెళ్లి వసూళ్లు చేసే సందర్భాల్లో కూడా ఏజెంట్లు శిష్టాచారాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఏజెంట్ల‌కు త‌గిన శిక్ష‌ణ అవ‌స‌రం..

దుర్భాషలు ఉపయోగించడం, బెదిరింపు సందేశాలు పంపడం, ఒత్తిడి తేవడం వంటి చర్యలను పూర్తిగా నిషేధించాలని ముసాయిదా నిబంధనలు పేర్కొంటున్నాయి. కుటుంబంలో మరణం, వివాహ వేడుకలు, పండుగలు లేదా ఇతర విపత్కర పరిస్థితుల్లో రుణ వసూళ్ల ప్రయత్నాలు చేయకూడదని కూడా స్పష్టమైన సూచనలు జారీ చేసింది. రికవరీ ఏజెంట్లకు తగిన శిక్షణ అవసరమని భావించిన ఆర్‌బీఐ, వారు Indian Institute of Banking and Finance (IIBF) ద్వారా డెట్ రికవరీ శిక్షణ పొందే విధంగా నిబంధనలు తీసుకురావాలని పరిశీలిస్తోంది. ఇది వసూళ్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మార్చే ప్రయత్నంగా భావిస్తున్నారు.

క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు అవ‌స‌రం..

అదనంగా, బ్యాంకులు రికవరీ ఏజెన్సీలను నియమించే ముందు, తరువాత వారి ప్రతినిధుల గత చరిత్రను పరిశీలించాలని సూచించింది. రుణ వివాదాలు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న సందర్భాల్లో వసూళ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆర్‌బీఐ పేర్కొంది. గతంలో బిహార్‌లో రికవరీ ఏజెంట్ సందర్శన సమయంలో జరిగిన విషాద ఘటనల నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల మానిటరీ పాలసీ సమీక్ష సందర్భంగా కూడా రుణ వసూళ్ల వ్యవస్థపై కట్టుదిట్టమైన చర్యలు అవసరమని సంకేతాలు ఇచ్చారు. ఈ ముసాయిదా నిబంధనలు అమల్లోకి వస్తే, రుణగ్రహీతలపై అనుచిత ఒత్తిడికి చెక్ పడటంతో పాటు వసూళ్ల వ్యవస్థలో మరింత పారదర్శకత, బాధ్యత పెరుగుతాయని భావిస్తున్నారు.

Advertisement
Advertisement