త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold | బంగారం పెట్టుబ‌డుల‌పైనే ప్ర‌జ‌ల ఆస‌క్తి.. జ్యువెల‌రీ డిమాండ్‌ను అధిగ‌మించిన ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్‌..

Gold | భార‌తీయులు సాధార‌ణంగా బంగారం కొనుగోలు అంటే ఎంతో ఆస‌క్తిని చూపిస్తారు. ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేసి డ‌బ్బులు పొదుపు చేయ‌డం లేదా శుభ‌కార్యాల‌కు ఉప‌యోగించ‌డం చేస్తుంటారు. అయితే చాలా మంది భౌతిక బంగారాన్ని కొనేందుకే ఆస‌క్తి చూపిస్తున్న‌ప్ప‌టికీ, ప్ర‌స్తుతం ఆ ధోర‌ణిలో కాస్త మార్పు వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

S

Business | Published On Apr 29, 2026, 5.56 pm IST

Gold | బంగారం పెట్టుబ‌డుల‌పైనే ప్ర‌జ‌ల ఆస‌క్తి.. జ్యువెల‌రీ డిమాండ్‌ను అధిగ‌మించిన ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్‌..
Advertisement

Gold | భార‌తీయులు సాధార‌ణంగా బంగారం కొనుగోలు అంటే ఎంతో ఆస‌క్తిని చూపిస్తారు. ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేసి డ‌బ్బులు పొదుపు చేయ‌డం లేదా శుభ‌కార్యాల‌కు ఉప‌యోగించ‌డం చేస్తుంటారు. అయితే చాలా మంది భౌతిక బంగారాన్ని కొనేందుకే ఆస‌క్తి చూపిస్తున్న‌ప్ప‌టికీ, ప్ర‌స్తుతం ఆ ధోర‌ణిలో కాస్త మార్పు వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో మొద‌టిసారిగా జ్యువెలరీ డిమాండ్‌ను ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ అధిగ‌మించింది. అంటే.. చాలా మంది భార‌తీయులు భౌతిక బంగారానికి బ‌దులుగా బంగారంపై డిజిట‌ల్ రూపంలో పెట్టుబ‌డుల‌ను పెట్టేందుకు ఎక్కువ ఆస‌క్తిని చూపిస్తున్నార‌ని స్ప‌ష్ట‌మైంది. అయితే గ‌తంలో ఎన్నడూ లేని విధంగా వ‌చ్చిన ఈ అనూహ్య మార్పుకు నిపుణులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో బంగారం ధ‌ర భారీగా పెరిగిన నేప‌థ్యంలోనే ఈ మార్పు చోటు చేసుకుని ఉంటుంద‌ని భావిస్తున్నారు.

బంగారంపై పెట్టుబ‌డుల‌కే మొగ్గు..

వ‌ర‌ల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం 2026 మార్చి త్రైమాసికంలో బంగారం ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ 52 శాతం పెరిగి 82 మెట్రిక్ ట‌న్నుల‌కు చేరుకుంది. మొత్తం వినియోగంలో దీని వాటా 54.3 శాతానికి పెరిగింది. జ్యువెల‌రీ డిమాండ్ 19.5 శాతం మేర త‌గ్గింది. 66 మెట్రిక్ ట‌న్నుల‌కు ప‌డిపోయింది. మొత్తం బంగారం వినియోగం 10.2 శాతం పెరిగి 151 మెట్రిక్ ట‌న్నుల‌కు చేరింది. విలువ ప‌రంగా చూస్తే ఇది 99 శాతం పెరుగుద‌ల‌ను న‌మోదు చేయ‌గా, రికార్డు స్థాయిలో రూ.2,275 కోట్లుగా న‌మోదైంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల‌లోకి ఇన్‌ఫ్లోలు 186 శాతం పెరిగి రికార్డు సృష్టించాయి. దీంతో ఈ నిల్వ‌లు 20 మెట్రిక్ ట‌న్నుల‌కు చేరుకున్నాయి. పెట్టుబ‌డిదారులు, రిటెయిల్ ఇన్వెస్ట‌ర్లు బంగారం వైపు మొగ్గు చూపిస్తున్న‌ట్లు ఈ గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

ఇదే ట్రెండ్ కొన‌సాగుతుంది: WGC

2025 ప్రారంభం నుంచి దేశీయ మార్కెట్‌ల‌లో బంగారం ధ‌ర‌లు దాదాపు రెట్టింపు అయ్యాయి. అదే స‌మ‌యంలో దేశీయ బెంచ్ మార్క్ నిఫ్టీ50 సూచీ కేవ‌లం 2.4 శాతం మాత్ర‌మే పెరుగుద‌లను న‌మోదు చేసింది. ఈక్విటీ మార్కెట్ల‌లో హెచ్చు త‌గ్గులు, స్టాక్ మార్కెట్ల నుంచి బ‌ల‌హీన‌మైన రాబ‌డులు వ‌స్తుండ‌డంతో ఇన్వెస్ట‌ర్లు బంగారం వైపు మ‌ళ్లారు. బంగారం ఇప్పుడు ఓ ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్ర‌త్యామ్నాయ ఆస్తిగా మారింది. WGC ఇండియా సీఈవో సచిన్ జైన్ ఇదే విష‌య‌మై మాట్లాడుతూ మొద‌టిసారిగా భార‌త్‌లో ఇలా జ్యువెలరీ డిమాండ్‌ను ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ అధిగ‌మించడం శుభ ప‌రిణామ‌మ‌న్నారు. ప్ర‌జ‌లు సంప్ర‌దాయ ఆభ‌ర‌ణాల వైపు కాకుండా డిజిట‌ల్ మార్గాల్లో పెట్టుబ‌డుల వైపు మ‌ళ్లుతున్నార‌ని ఈ గ‌ణాంకాలు సూచిస్తున్నాయ‌ని తెలిపారు. రాబోయే త్రైమాసికాల్లో ఈ పెట్టుబ‌డుల డిమాండ్ మ‌రింత పెర‌గ‌నుంద‌ని అంచ‌నా వేశారు. ఆర్థిక‌, రిటెయిల్ ఇన్వెస్ట‌ర్లు ప్ర‌స్తుతం బంగారంపై పెట్టుబ‌డుల‌కు ఎక్కువ ఆస‌క్తిని చూపిస్తున్నార‌ని పేర్కొన్నారు.

పెట్టుబ‌డిదారులు ధ‌ర‌ల‌ను గ‌మ‌నించాలి..

నిపుణులు చెబుతున్న ప్ర‌కారం బంగారంపై డిజిట‌ల్ మార్గాల్లో పెట్టుబ‌డులు పెట్టే ట్రెండ్ ఇంకా కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. బంగారం ధ‌ర‌ల్లో హెచ్చు త‌గ్గులు స్వ‌ల్ప‌కాలంలో సాధార‌ణ‌మేన‌ని, అయిన‌ప్ప‌టికీ ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ బ‌లంగా ఉంద‌ని అంటున్నారు. జ్యువెల‌రీ డిమాండ్ మాత్రం ధ‌ర‌ల ఒత్తిడి వ‌ల్లే బ‌ల‌హీనంగా ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. బంగారం బార్స్‌, కాయిన్స్‌, ఈటీఎఫ్‌ల ద్వారా భార‌తీయులు అధిక శాతం బంగారంలో పెట్టుబ‌డులు పెడుతున్నార‌ని, అయితే రాబోయే కాలంలో బంగారం ధ‌ర‌లు ఎలా ఉంటాయో పెట్టుబ‌డిదారులు గ‌మ‌నిస్తూ ఉండాల‌ని సూచించారు.

Advertisement
Advertisement