త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold | బంగారం ప్రియం.. అయినా త‌గ్గ‌ని కొనుగోళ్లు..

Gold | భారత్‌లో బంగారంపై దిగుమతి సుంకం భారీగా పెరిగినా, ప్రజల కొనుగోళ్లు మాత్రం తగ్గలేదు. నగల దుకాణాల్లో రద్దీ పెరగడంతోపాటు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్ యూనిట్ల కొనుగోళ్లు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, జ్యువెలర్లు, రిఫైనర్ల ద్వారా ప్రజలు బంగారాన్ని భౌతిక రూపంలోనే కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో కూడా కొనుగోలు చేస్తున్నారు.

S

Business | Published On May 27, 2026, 3.37 pm IST

Gold | బంగారం ప్రియం.. అయినా త‌గ్గ‌ని కొనుగోళ్లు..
Advertisement

Gold | భారత్‌లో బంగారంపై దిగుమతి సుంకం భారీగా పెరిగినా, ప్రజల కొనుగోళ్లు మాత్రం తగ్గలేదు. నగల దుకాణాల్లో రద్దీ పెరగడంతోపాటు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్ యూనిట్ల కొనుగోళ్లు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, జ్యువెలర్లు, రిఫైనర్ల ద్వారా ప్రజలు బంగారాన్ని భౌతిక రూపంలోనే కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో కూడా కొనుగోలు చేస్తున్నారు. మే 13 నుంచి బంగారంపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 5 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. అదేవిధంగా అగ్రికల్చర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను 1 శాతం నుంచి 5 శాతానికి పెంచడంతో మొత్తం దిగుమతి సుంకం 15 శాతానికి చేరుకుంది. ఇది 2022లో ఉన్న స్థాయికి సమానంగా నిలిచింది. విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని పిలుపునిచ్చిన కొద్ది రోజులకే కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. భారీ చమురు దిగుమతుల వల్ల ఫారెక్స్ రిజర్వులపై ఒత్తిడి పెరగడం, రూపాయి విలువ క్షీణించడం వంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయి.

ఏడాదికి 800 ట‌న్నుల బంగారం వినియోగం..

అయితే భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ ఏమాత్రం తగ్గలేదని తాజా కొనుగోళ్లు స్పష్టం చేస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్, ధరలపై సున్నితత్వం, పరిమిత లభ్యత వంటి కారణాలతో ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. భారత్‌లో ప్రతి ఏడాది 700-800 టన్నుల బంగారం వినియోగం జరుగుతుండగా, అందులో 90 శాతం దిగుమతుల ద్వారానే వస్తోంది. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ ఖజానాపై 72 బిలియన్ డాలర్ల భారం పడింది. 24 క్యారెట్ బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములకు రూ.1,55,000కు పైన కొనసాగుతుండగా, కిలో వెండి ధర రూ.2,80,000 కు పైన ఉంది. ఆలిండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వైస్ చైర్మన్ అవినాష్ గుప్తా మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ, సంప్రదాయాలు, పొదుపు సంస్కృతితో బంగారం బలంగా అనుసంధానమై ఉంద‌ని తెలిపారు. మే నెలలో పెద్దగా శుభ ముహూర్తాలు లేకపోయినా, దిగుమతి సుంకం పెంపు కారణంగా కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయని చెప్పారు. దిగుమతి సుంకం పెరిగినా, వినియోగదారులు విడిగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. జ్యువెలర్లు బంగారం ధరలోనే ఆ డ్యూటీని కలిపి విక్రయిస్తారు. అయితే గోల్డ్ ఈటీఎఫ్ ధరలు కొంత ఆలస్యంగా ఈ పెరుగుదలను ప్రతిబింబిస్తాయి.

బంగారం ఇంకా ఆక‌ర్ష‌ణీయంగానే..

దిగుమతి సుంకం పెంపుతో మే 13న బంగారం ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,47,160 నుంచి సుమారు 10 శాతం పెరిగి రూ.1,62,120కు చేరింది. ఇది దేశంలో ఇప్పటికే ఉన్న నిల్వల నుంచే అమ్మకాలు జరుగుతున్న సమయంలోనే జరిగింది. పాప్లే గ్రూప్ డైరెక్టర్ రాజీవ్ పాప్లే మాట్లాడుతూ రూపాయి విలువ పడిపోవడం, దిగుమతి సుంకాలు పెరగడం కలిసి దేశీయ బంగారం ధరలను భారీగా పెంచాయ‌న్నారు. అవసరం లేని లగ్జరీ కొనుగోళ్లు కొంత మందగిస్తున్నాయ‌ని అన్నారు. అయితే పెట్టుబడి పరంగా చూస్తే బంగారం ఇంకా ఆకర్షణీయంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. భౌగోళిక‌ అనిశ్చితి, అమెరికా భారీ ఆర్థిక లోటు, డాలర్‌పై కేంద్ర బ్యాంకులు ఆధారపడటం తగ్గడం వంటి కారణాలతో బంగారం డిమాండ్ కొనసాగుతుందని మిరాయ్ అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ హెడ్ హర్దమన్ సింగ్ సేథ్ తెలిపారు. ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు ఇప్పుడు తక్కువ వెయిటేజీ ఉన్న నగలవైపు మొగ్గుచూపుతున్నార‌ని, అయితే అలాంటి నగల కొనుగోళ్లలో హాల్‌మార్క్, సర్టిఫికేషన్ తప్పనిసరిగా చెక్ చేయాలని ఆలిండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే సూచించారు.

బ‌రువు త‌క్కువ ఉన్నా క్వాలిటీ మ‌రువొద్దు..

జెన్ డైమండ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నీల్ సోనావాలా మాట్లాడుతూ తక్కువ బరువు ఉన్న నగలు అయినా బలంగా ఉండాల‌ని, క్లాస్ప్స్, లింక్స్, ప్రాంగ్స్ వంటి భాగాలు మన్నికగా ఉన్నాయో లేదో చూడాల‌న్నారు. పాత బంగారాన్ని మార్చుకుని కొత్త నగలు కొనుగోలు చేసే ట్రెండ్ కూడా వేగంగా పెరుగుతోంద‌న్నారు. అయితే పాత బంగారం అమ్మేటప్పుడు బిల్లులు, సర్టిఫికెట్లు, కొనుగోలు ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని జ్యువెలర్లు హెచ్చరిస్తున్నారు. లేదంటే బైబ్యాక్ విలువ తగ్గే అవకాశం ఉందంటున్నారు. డైమండ్ జ్యువెలరీపై భారీ డిస్కౌంట్లు కనిపిస్తున్నప్పటికీ, వాటి ఎక్స్చేంజ్ విలువ బంగారంతో సమానంగా ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ల్యాబ్ గ్రోన్ డైమండ్లు కలిసిన నగలకు సాధారణ బైబ్యాక్ వర్తించద‌ని చెబుతున్నారు. పన్నుల విషయంలో కూడా జాగ్రత్త అవసరమ‌ని సూచిస్తున్నారు. ఒక సంవత్సరం లోపు బంగారం విక్రయిస్తే వచ్చిన లాభం మొత్తం ఆదాయంగా పరిగణించి స్లాబ్ రేటు ప్రకారం పన్ను వేస్తారు. రెండు సంవత్సరాలకు మించి ఉంచిన బంగారంపై మాత్రం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 12.5 శాతం వర్తిస్తుంది.

బిల్స్ భ‌ద్రంగా పెట్టుకోవాలి..

కేపీబీ అండ్ అసోసియేట్స్ పార్టనర్ పరాస్ సావ్లా మాట్లాడుతూ బిల్లులు, వాల్యుయేషన్ రిపోర్టులు, వారసత్వ ఆధారాలు లేకపోతే మొత్తం అమ్మకపు మొత్తాన్నే ఆదాయంగా పరిగణించే ప్రమాదం ఉంద‌ని హెచ్చరించారు. అయితే బంగారం అమ్మకాల ద్వారా వచ్చిన లాభాన్ని కొత్త ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణంలో పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రూ.10 కోట్ల వరకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ల ద్వారా పెట్టుబడి పెట్టిన వారికి వేర్వేరు పన్ను నిబంధనలు ఉంటాయి. స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్ట్ అయిన గోల్డ్ ఈటీఎఫ్‌లకు 12 నెలల తర్వాత లాంగ్ టర్మ్ గెయిన్స్ వర్తిస్తే, ఫండ్ ఆఫ్ ఫండ్స్‌లకు 24 నెలల హోల్డింగ్ అవసరం ఉంటుంది. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, దేశంలో బంగారం ప్రాధాన్యం మాత్రం తగ్గలేదని జ్యువెలర్లు చెబుతున్నారు. సంప్రదాయం, లిక్విడిటీ, పెట్టుబడి భద్రత కారణంగా బంగారం డిమాండ్ దీర్ఘకాలంలో బలంగానే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement