త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | శాంతి చ‌ర్చ‌ల ఎఫెక్ట్‌.. భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | గత వారం సుమారు 6 శాతం లాభాలను నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్ల‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 ఈ వారం ప్రారంభంలోనే భారీగా పతన‌మ‌య్యాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో ఈ సూచీలు దాదాపు 2 శాతం మేర ప‌డిపోయి భారీ న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి.

S

Business | Published On Apr 13, 2026, 9.56 am IST

Stock Markets | శాంతి చ‌ర్చ‌ల ఎఫెక్ట్‌.. భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | గత వారం సుమారు 6 శాతం లాభాలను నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్ల‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 ఈ వారం ప్రారంభంలోనే భారీగా పతన‌మ‌య్యాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో ఈ సూచీలు దాదాపు 2 శాతం మేర ప‌డిపోయి భారీ న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 1,700 పాయింట్లు ( 1.94 శాతం) తనంతో ఇంట్రాడే కనిష్ట స్థాయి 75,868కి చేరుకుంది. అలాగే నిఫ్టీ 50 కూడా 500 పాయింట్లు (1.91 శాతం) క్షీణించి 23,556 వద్ద రోజులో కనిష్ట స్థాయిని తాకింది. ఈ అమ్మకాల ఒత్తిడి మార్కెట్ మొత్తం విభాగాలను ప్రభావితం చేసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు కూడా 2 కంటే ఎక్కువగా పడిపోయాయి.

రూ.8 ల‌క్ష‌ల కోట్లు న‌ష్టం..

ఉదయం 9:20 గంటల సమయానికి బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.451 లక్షల కోట్ల నుంచి రూ.443 లక్షల కోట్లకు పడిపోవడంతో, పెట్టుబడిదారులు కేవలం కొన్ని నిమిషాల్లోనే సుమారు రూ.8 లక్షల కోట్లు నష్టపోయారు. దేశీయ స్టాక్ మార్కెట్ల ప‌త‌నానికి తాజాగా చోటు చేసుకున్న శాంతి చ‌ర్చ‌ల ఫ‌లిత‌మే కార‌ణ‌మ‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎలాంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వకపోవడం ప్రధాన కారణంగా నిలిచింది. ఈ చర్చలు విఫలమవడంతో ప్రపంచ మార్కెట్లలో కీలక సమస్యగా ఉన్న అమెరికా-ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుందనే ఆశలు దెబ్బతిన్నాయి. దీనికి తోడు హోర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధనం చేయాలనే ప్రణాళిక గ్లోబల్ ఎనర్జీ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుందనే భయాలను పెంచింది.

మ‌ళ్లీ పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

పశ్చిమ ఆసియాలో పరిస్థితులు ఎలా మారుతాయనే విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. దీని ప్రభావం 2026లో మార్కెట్ పనితీరుపై ప్రతికూలంగా ఉండవచ్చని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మళ్లీ టారిఫ్ బెదిరింపులు చేయడం కూడా మార్కెట్‌ను ప్రభావితం చేసింది. చైనా ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తే 50 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇక క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ బ్యారెల్‌కు 100 డాల‌ర్ల‌కు పైగా చేరడం కూడా మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణ‌మైంది. బ్రెంట్ క్రూడ్ ధరలు 8 శాతం కంటే ఎక్కువగా పెరిగి బ్యారెల్‌కు 103 డాల‌ర్ల‌ వద్ద ట్రేడ్ అవుతుండగా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ కూడా బ్యారెల్‌కు 105 డాల‌ర్ల‌ వరకు పెరిగింది. శాంతి చర్చలు విఫలమవడం, హోర్ముజ్ జలసంధిపై అమెరికా చర్యల కారణంగా ఈ పెరుగుదల చోటుచేసుకుంది.

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు క‌ష్ట‌మే..

క్రూడ్ ధరలు రెండు నెలలకుపైగా గ‌రిష్ట స్థాయిలో కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపి ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇది మార్కెట్‌కు మరో పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంద‌ని అంటున్నారు. గ్లోబల్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు రావడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణ‌మైంది. జపాన్ నిక్కీ, కొరియా కోస్పీ వంటి ప్రధాన ఆసియా సూచీలు 1 శాతం కంటే ఎక్కువగా పడిపోగా, చైనా షాంఘై కంపోజిట్ సూచీ కూడా సుమారు అర శాతం క్షీణించింది. అమెరికా-ఇరాన్ యుద్ధంపై కొనసాగుతున్న ఆందోళనలు మార్కెట్ భావజాలాన్ని బలహీనపరిచాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భౌగోళిక రాజకీయ పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అత్యంత అనిశ్చిత పరిస్థితుల్లో వేచి చూడ‌డ‌మే సరైన వ్యూహమని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement