త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jio Platforms IPO | ముగిసిన జియో ఐపీఓ ఇష్యూ.. అలాట్ అయితే అమ్మాలా..? ఇంకా కొనాలా..?

Jio Platforms IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. రూ.30,213 కోట్ల విలువైన ఈ ఐపీఓ మొత్తం 12.45 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) గణాంకాల ప్రకారం, సంస్థ ఆఫర్ చేసిన 19,75,25,934 షేర్లకు గాను మొత్తం 2,45,98,85,544 షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి.

S

Business | Published On Oct 24, 2026, 10.51 am IST

Jio Platforms IPO | ముగిసిన జియో ఐపీఓ ఇష్యూ.. అలాట్ అయితే అమ్మాలా..? ఇంకా కొనాలా..?
Advertisement

Jio Platforms IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. రూ.30,213 కోట్ల విలువైన ఈ ఐపీఓ మొత్తం 12.45 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) గణాంకాల ప్రకారం, సంస్థ ఆఫర్ చేసిన 19,75,25,934 షేర్లకు గాను మొత్తం 2,45,98,85,544 షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. ఈ ఐపీఓలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్‌ (క్యూఐబీలు) విభాగం నుంచి అత్యధిక స్పందన నమోదైంది. తాజా సబ్‌స్క్రిప్షన్ గణాంకాల ప్రకారం, క్యూఐబీల విభాగం 37.22 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్‌ (ఎన్‌ఐఐలు) విభాగం 9.91 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ నమోదు చేసింది. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 1.71 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. అర్హత కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల విభాగం 5.37 రెట్లు, ఉద్యోగుల విభాగం 1.87 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ సాధించాయి.

కేటగిరీల వారీగా జియో ఐపీఓ వివరాలు..

క్యూఐబీల విభాగానికి కేటాయించిన 4,90,07,827 షేర్లకు గాను 1,82,41,48,944 షేర్ల కోసం బిడ్లు వచ్చాయి. దీంతో ఈ విభాగం 37.22 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. ఇందులో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీలు వంటి దేశీయ ఆర్థిక సంస్థలు 85,27,48,680 షేర్ల కోసం బిడ్లు దాఖలు చేశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 66,06,54,804 షేర్ల కోసం బిడ్లు వేశారు. ఎన్‌ఐఐల విభాగంలో ఆఫర్ చేసిన 3,64,44,569 షేర్లకు గాను 36,12,42,948 షేర్ల కోసం బిడ్లు వచ్చాయి. రూ.10 లక్షలకు మించిన పెట్టుబడులకు సంబంధించిన విభాగం 11.31 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. రూ.2 లక్షలకు మించి రూ.10 లక్షల వరకు బిడ్లు దాఖలు చేసిన విభాగం 7.12 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ నమోదు చేసింది. రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్న 8,50,37,327 షేర్లకు గాను 14,56,53,528 షేర్ల కోసం బిడ్లు వచ్చాయి. దీంతో ఈ విభాగం 1.71 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. ఉద్యోగుల విభాగంలో కేటాయించిన 46,94,835 షేర్లకు గాను 87,95,640 షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన అర్హత కలిగిన వాటాదారుల కోసం కేటాయించిన 2,23,41,376 షేర్లకు గాను 12,00,44,484 షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. దీంతో ఈ విభాగం 5.37 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ నమోదు చేసింది.

ప్రపంచ రికార్డు సృష్టించిన జియో ఐపీఓ దరఖాస్తులు..

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓకు సంబంధించి మరో కీలక విషయం వెల్లడైంది. ఈ పబ్లిక్ ఇష్యూకు 1.38 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఐపీఓల చరిత్రలో అత్యధిక దరఖాస్తులు అందుకున్న ఇష్యూగా ఇది రికార్డు సృష్టించినట్లు సంబంధిత వివరాలు పేర్కొన్నాయి. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన డిమాండ్‌తో కలిపి మొత్తం బిడ్ల విలువ సుమారు రూ.7.40 లక్షల కోట్లుగా నమోదైనట్లు సమాచారం.

జియో ఐపీఓ అలాట్‌మెంట్‌, లిస్టింగ్ తేదీలు ఇవే..

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓ షేర్ల కేటాయింపు ప్రక్రియ అక్టోబర్ 26న జరగనుంది. షేర్లు కేటాయించిన పెట్టుబడిదారుల డీమ్యాట్ ఖాతాల్లో అక్టోబర్ 27న జమ చేయనున్నారు. అనంతరం అక్టోబర్ 28న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో జియో ప్లాట్‌ఫామ్స్‌ షేర్లు లిస్ట్ కానున్నాయి.

అమ్మాలా.. కొనాలా..

అయితే ప్ర‌స్తుతం ఈ షేర్‌కు గ్రే మార్కెట్ ప్రీమియం 23 శాతం వ‌ర‌కు ఉంది. అంటే బిడ్డింగ్ గ‌రిష్ట ధ‌ర క‌న్నా ఈ షేర్ 23 శాతం ఎక్కువ లాభంతో లిస్ట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో షేర్ ల‌క్ష్య ధ‌ర‌ను రూ.1364 నుంచి రూ.1379గా చెప్పారు. ఈ క్ర‌మంలో లిస్టింగ్ అనంత‌రం భారీ ఎత్తున లాభాల స్వీక‌ర‌ణ జ‌రిగే చాన్స్ ఉంటుందని, దీంతో గ‌రిష్ట బిడ్డింగ్ ధ‌ర రూ.1,119కు కాస్త ఎగువకు షేర్ స్వ‌ల్ప కాలంలో దిగి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆ స‌మ‌యంలో షేర్ల‌ను మ‌ళ్లీ కొనాలంటే వేచి చూడాల‌ని, ఆరంభంలో వ‌చ్చిన లాభాల‌ను నిలుపుకుంటేనే షేర్ ధ‌ర మ‌ళ్లీ పెరిగే అవ‌కాశాలు ఉంటాయ‌ని తెలిపారు. ఇక షేర్లు అలాట్ అయిన వారు వెంట‌నే లాభాల స్వీక‌ర‌ణ‌కు దిగ‌కూడ‌ద‌ని, కొంత కాలం పాటు వేచి చూడాల‌ని, కానీ షేర్లు అలాట్ కాని వారు కొనాలంటే స్వ‌ల్ప కాలంలో క‌నిష్టాల వ‌ద్ద కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని సూచించారు.

గ‌మ‌నిక‌: స‌్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేవారు సొంత విశ్లేష‌ణ‌, ప‌రిజ్ఞానంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అవ‌స‌రం అయితే నిపుణుల స‌ల‌హా తీసుకోవాలి. ఈ క‌థ‌నంలో ఇచ్చిన పెట్టుబ‌డుల వివ‌రాలు కేవ‌లం అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే. పెట్టుబ‌డుల‌కు లేదా విక్ర‌యాల‌కు సూచ‌న‌లు కావు.

Advertisement
Advertisement