త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jio Platforms IPO | జియో ఐపీఓకు భారీ స్పందన.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,110 కోట్లు..

Jio Platforms IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓకు ముందే భారీ స్పందన లభించింది. అక్టోబర్ 21న ప్రారంభం కానున్న తొలి పబ్లిక్ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు ముందు అక్టోబర్ 19న 212 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.8,109.85 కోట్లను సమీకరించింది.

S

Business | Published On Oct 20, 2026, 12.10 pm IST

Jio Platforms IPO | జియో ఐపీఓకు భారీ స్పందన.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,110 కోట్లు..
Advertisement

Jio Platforms IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓకు ముందే భారీ స్పందన లభించింది. అక్టోబర్ 21న ప్రారంభం కానున్న తొలి పబ్లిక్ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు ముందు అక్టోబర్ 19న 212 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.8,109.85 కోట్లను సమీకరించింది. స్టాక్ ఎక్స్ఛేంజీకి సమర్పించిన వివరాల ప్రకారం.. యాంకర్ బుక్‌లో సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి వచ్చిన డిమాండ్ రూ.2.5 లక్షల కోట్లను దాటింది. కేటాయింపునకు అందుబాటులో ఉన్న షేర్ల విలువతో పోలిస్తే ఇది 30 రెట్లకు పైగా ఉండడం విశేషం. ఐపీఓ ధరల శ్రేణిలో గరిష్ఠ ధర అయిన ఒక్కో షేరుకు రూ.1,119 చొప్పున యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించారు. మొత్తం 7.24 కోట్ల షేర్లను కేటాయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ పెట్టుబడిదారుల్లో ప్రముఖ దేశీయ మ్యూచువల్ ఫండ్లు, అంతర్జాతీయ ఆస్తుల నిర్వహణ సంస్థలు, సార్వభౌమ సంపద నిధులు, బీమా సంస్థలు, పెన్షన్ ఫండ్లు ఉన్నాయి.

ఎల్ఐసీ అత్య‌ధిక కొనుగోళ్లు..

భారత్‌లో ఇప్పటివరకు అతిపెద్ద ఐపీఓగా నిలుస్తుందని భావిస్తున్న జియో ప్లాట్‌ఫామ్స్‌ పబ్లిక్ ఇష్యూకు ఈ భారీ స్పందన కీలక ఆరంభంగా మారింది. అక్టోబర్ 21న ప్రారంభమయ్యే ఐపీఓ అక్టోబర్ 23న ముగియనుంది. యాంకర్ బుక్‌లో అత్యధిక కేటాయింపులు పొందిన సంస్థగా భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) నిలిచింది. ఈ సంస్థకు రూ.499.98 కోట్ల విలువైన షేర్లు కేటాయించారు. ఇది మొత్తం యాంకర్ కేటాయింపుల్లో 6.17 శాతానికి సమానం. న్యూ వరల్డ్ ఫండ్‌ ఇంక్‌కు రూ.486.27 కోట్ల విలువైన షేర్లు కేటాయించగా, సింగపూర్ ప్రభుత్వం రూ.340.93 కోట్ల విలువైన షేర్లను పొందింది. ఎస్‌బీఐ ఫోకస్డ్ ఫండ్‌కు రూ.315 కోట్ల విలువైన షేర్లు కేటాయించారు. బీఎన్‌పీ పారిబాస్ ఫైనాన్షియల్ మార్కెట్స్‌-ఓడీఐకి రూ.303.25 కోట్ల విలువైన షేర్లు లభించాయి.

అంత‌ర్జాతీయ సంస్థ‌లు ఇవే..

పెట్టుబడులు పెట్టిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థల్లో బ్లాక్‌రాక్, క్యాపిటల్ గ్రూప్, ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, టీ. రో ప్రైస్, ష్రోడర్స్, జేపీమోర్గాన్ అసెట్ మేనేజ్‌మెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్వెస్కో, జానస్ హెండర్సన్ ఉన్నాయి. అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, సింగపూర్ మానిటరీ అథారిటీ, జీఐసీ, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, నార్వే సార్వభౌమ సంపద నిధి వంటి సంస్థలు కూడా ఈ ఇష్యూలో పాల్గొన్నాయి. ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వ్యక్తుల సమాచారం ప్రకారం.. పలు ప్రముఖ విదేశీ, దేశీయ సంస్థలు ఒక్కొక్కటి 750 మిలియన్ డాలర్ల నుంచి ఒక బిలియన్ డాలర్లకు పైగా విలువైన షేర్ల కేటాయింపులను కోరాయి. డ్రాగోనియర్ వంటి అంతర్జాతీయ సాంకేతిక రంగ పెట్టుబడిదారులతోపాటు ప్రముఖ భారతీయ కుటుంబ ఆధారిత పెట్టుబడి సంస్థలు కూడా పాల్గొనడం జియో ఐపీఓపై విస్తృతమైన సంస్థాగత ఆసక్తిని సూచిస్తోంది.

దేశీయ మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు 2,489 కోట్ల షేర్లు..

దేశీయ మ్యూచువల్ ఫండ్లకు 2,489 కోట్ల షేర్లను కేటాయించారు. వీటి విలువ రూ.2,784.96 కోట్లు కాగా, మొత్తం యాంకర్ కేటాయింపుల్లో వీటి వాటా 34.34 శాతంగా ఉంది. 25 ఫండ్ హౌస్‌లకు చెందిన 95 పథకాల ద్వారా ఈ పెట్టుబడులు వచ్చాయి. జీవిత బీమా సంస్థలు, పెన్షన్ ఫండ్లకు 97.4 లక్షల షేర్లను కేటాయించారు. వీటి విలువ రూ.1,089.95 కోట్లు కాగా, యాంకర్ కేటాయింపుల్లో వాటా 13.44 శాతంగా నమోదైంది. అక్టోబర్ 14న విడుదల చేసిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లో నిర్దేశించిన కనీస కేటాయింపుల కంటే ఈ రెండు విభాగాలకు ఎక్కువ వాటా లభించింది. మ్యూచువల్ ఫండ్లకు యాంకర్ కేటాయింపుల్లో 33.33 శాతం, బీమా సంస్థలు, పెన్షన్ ఫండ్లకు 6.67 శాతం కేటాయించాలని ఆ పత్రంలో పేర్కొన్నారు. జియో ఐపీఓలో పెట్టుబడులు పెట్టిన దేశీయ సంస్థల్లో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, బిర్లా మ్యూచువల్ ఫండ్, కోటక్ మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్, యూటీఐ పెన్షన్ ఉన్నాయి. సార్వభౌమ సంపద నిధులు, పెన్షన్ సంస్థలు, పదవీ విరమణ నిధులు వంటి దీర్ఘకాలిక పెట్టుబడిదారులు కూడా ఈ ఇష్యూలో పాల్గొన్నారు.

యాంక‌ర్ బుక్‌లో 200కు పైగా పెట్టుబ‌డిదారుల ఎంట్రీ..

200కు పైగా పెట్టుబడిదారుల ఎంట్రీలతో యాంకర్ బుక్‌లో విస్తృత భాగస్వామ్యం నమోదైంది. అనేక పెట్టుబడి పథకాలు, సంస్థల నుంచి వచ్చిన ఈ ఆసక్తి.. సాధారణ ప్రజల కోసం ఐపీఓ బిడ్డింగ్ ప్రారంభం కాకముందే జియో ప్లాట్‌ఫామ్స్‌ భారీ స్థాయిలో సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించిందని స్పష్టం చేస్తోంది. జియో ప్లాట్‌ఫామ్స్‌ తాజా షేర్ల జారీ ద్వారా సుమారు రూ.30వేల కోట్ల‌ను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం గరిష్ఠంగా 27 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఒక్కో షేరుకు రూ.1,065 నుంచి రూ.1,119 వరకు ధరల శ్రేణిని నిర్ణయించారు. ఆఫర్ పత్రాల ప్రకారం, ఈ ధరల ఆధారంగా కంపెనీ విలువ సుమారు 108 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఈ ఐపీఓలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులకు రూ.2,500 కోట్ల విలువైన షేర్లను, అర్హత కలిగిన ఉద్యోగులకు రూ.500 కోట్ల విలువైన షేర్లను కేటాయించారు. అర్హులైన ఉద్యోగులకు తుది ఆఫర్ ధరపై ఒక్కో షేరుకు రూ.54 తగ్గింపుతో షేర్లు అందించనున్నారు.

నిధుల వినియోగం ఇలా..

ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల్లో కొంత మొత్తాన్ని జియో టెలికాం అనుబంధ సంస్థ రుణాల చెల్లింపునకు వినియోగించనున్నారు. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనున్నారు. బిలియనీర్ ముకేష్‌ అంబానీ నియంత్రణలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. జియో ప్లాట్‌ఫామ్స్‌ లిస్టింగ్ అనంతరం కూడా కంపెనీలో మెజారిటీ వాటాను కొనసాగించనుంది. ఈ ఐపీఓతో ఇప్పటివరకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థగా కొనసాగిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశం స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు లభించనుంది. సుమారు దశాబ్దం క్రితం రిలయన్స్ భారత టెలికాం రంగంలోకి ప్రవేశించినప్పటి నుంచి జియో ప్లాట్‌ఫామ్స్‌ చందాదారుల సంఖ్య ఆధారంగా ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్లలో ఒకటిగా ఎదిగింది. మొబైల్ కనెక్టివిటీతో ప్రారంభమైన వ్యాపారం ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ వినోదం, క్లౌడ్ సేవలు, ఎంటర్‌ప్రైజ్ సేవల వరకు విస్తరించింది.

533.3 మిలియ‌న్ల మంది చందాదారులు..

కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2026 జూన్ నాటికి జియో ప్లాట్‌ఫామ్స్‌కు 533.3 మిలియన్ల మంది చందాదారులు ఉన్నారు. దేశంలోని మొత్తం డేటా ట్రాఫిక్‌లో దాదాపు 60 శాతం ఈ సంస్థ నెట్‌వర్క్ ద్వారానే సాగుతోంది. వివిధ డిజిటల్ సేవల్లో జియోకు ఉన్న విస్తృత స్థాయి కార్యకలాపాలు, మార్కెట్‌లో బలమైన ఉనికి.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని మరింత విస్తరించాలన్న రిలయన్స్ వ్యూహంలో కీలకంగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అనంతరం జియో వృద్ధి అవకాశాలు, లాభదాయకత, భవిష్యత్తులో అవసరమయ్యే మూలధనంపై పెట్టుబడిదారులు మరింత లోతుగా పరిశీలించే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement