త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India | భారత్ క్రెడిట్ రేటింగ్ పెంపు.. జ‌పాన్ ఏజెన్సీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..

India | భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయంగా మరోసారి విశ్వాసం వ్యక్తమైంది. జపాన్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ లిమిటెడ్‌ (జేసీఆర్‌) భారత గణతంత్రానికి సంబంధించిన దీర్ఘకాలిక విదేశీ కరెన్సీ, స్థానిక కరెన్సీ ఇష్యూర్‌ రేటింగ్‌ను బీబీబీ ప్లస్‌ నుంచి ఎ మైనస్ కు పెంచింది. రెండు రేటింగ్‌ల అవుట్‌లుక్‌ను స్థిరంగా కొనసాగించింది. ఈ మేరకు జేసీఆర్ బుధ‌వారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించింది.

S

Business | Published On Sep 2, 2026, 2.29 pm IST

India | భారత్ క్రెడిట్ రేటింగ్ పెంపు.. జ‌పాన్ ఏజెన్సీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..
Advertisement

India | భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయంగా మరోసారి విశ్వాసం వ్యక్తమైంది. జపాన్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ లిమిటెడ్‌ (జేసీఆర్‌) భారత గణతంత్రానికి సంబంధించిన దీర్ఘకాలిక విదేశీ కరెన్సీ, స్థానిక కరెన్సీ ఇష్యూర్‌ రేటింగ్‌ను బీబీబీ ప్లస్‌ నుంచి ఎ మైనస్ కు పెంచింది. రెండు రేటింగ్‌ల అవుట్‌లుక్‌ను స్థిరంగా కొనసాగించింది. ఈ మేరకు జేసీఆర్ బుధ‌వారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 7 శాతం అధిక వృద్ధిని కొనసాగిస్తోందని జేసీఆర్‌ పేర్కొంది. బలమైన ప్రైవేట్‌ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి ప్రధాన మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపింది. ఉత్పాదకత, ఆర్థికాభివృద్ధిని పెంచే విధానాలను భారత ప్రభుత్వం క్రమంగా అమలు చేస్తోందని, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విస్తరణ, వస్తు సేవల పన్ను అమలు, దేశీయ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేశాయని పేర్కొంది.

త‌గ్గిన మొండి బ‌కాయిల నిష్ప‌త్తి..

గతంతో పోలిస్తే బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిల నిష్పత్తి గణనీయంగా తగ్గిందని జేసీఆర్‌ తెలిపింది. బ్యాంకింగ్‌ నియంత్రణను బలోపేతం చేయడంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న చర్యలు, దివాలా, బ్యాంక్రప్సీ కోడ్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సెక్టార్‌కు సంబంధించిన నియంత్రణ చర్యలు ఆర్థిక రంగాన్ని మరింత పటిష్ఠం చేశాయని వివరించింది. దీంతో ఆర్థిక వ్యవస్థలోని ఆర్థిక స్థిరత్వం మెరుగుపడిందని, దేశీయ ఆర్థిక వృద్ధి, ఆర్థిక విధానాల సమర్థత భారత ఆర్థిక వ్యవస్థను బలపరిచాయని జేసీఆర్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే భారత విదేశీ, స్థానిక కరెన్సీ దీర్ఘకాలిక ఇష్యూర్‌ రేటింగ్‌లను బీబీబీ ప్లస్‌ నుంచి ఎ మైనస్ కు పెంచినట్లు తెలిపింది. భారత తలసరి నామమాత్ర స్థూల దేశీయోత్పత్తి ఈ ఏడాదిలో సుమారు 1.4 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని జేసీఆర్‌ అంచనా వేసింది. బలమైన ప్రైవేట్‌ వినియోగం కారణంగా వాస్తవ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 7 శాతంగా ఉంటుందని పేర్కొంది. అయితే 2027లో వృద్ధి రేటు 6 శాతానికి తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఆర్‌బీఐ ల‌క్ష్య ప‌రిధిలోనే ద్ర‌వ్యోల్బ‌ణం..

ద్రవ్యోల్బణం ఈ ఏడాది ప్రారంభం నుంచి పెరుగుతున్నప్పటికీ ఆహారం, ఇంధన ధరల పెరుగుదల కారణంగా వచ్చే ఒత్తిళ్ల మధ్య కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్దేశించిన లక్ష్య పరిధిలోనే కొనసాగుతోందని తెలిపింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు కూడా ప్రమాదకర అంశంగా ఉన్నాయని జేసీఆర్‌ పేర్కొంది. భారత్‌ సమాఖ్య ప్రజాస్వామ్య దేశం కావడం వల్ల ప్రభుత్వ ఆర్థిక లోటు విషయంలో కొన్ని నిర్మాణాత్మక సవాళ్లు ఉన్నాయని జేసీఆర్‌ తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంక్లిష్ట ఆర్థిక సంబంధాలు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల బదిలీ విధానాలు, రాజకీయ నిర్వహణ వంటి అంశాలు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని వివరించింది. అయితే ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రస్తుత వ్యయాలను నియంత్రించడంతోపాటు మౌలిక సదుపాయాలపై పెట్టుబడులకు ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొంది. మౌలిక సదుపాయాల పెట్టుబడులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడంలో కీలకంగా మారిందని తెలిపింది. ప్రభుత్వ వ్యయ నాణ్యత కూడా మెరుగుపడిందని పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక లోటును స్థూల దేశీయోత్పత్తిలో 4.7 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గించిందని వెల్లడించింది. అదే సమయంలో అధిక స్థాయిలో మూలధన వ్యయాన్ని కొనసాగించినట్లు తెలిపింది.

ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం అవ‌స‌రం..

2026 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేంద్ర ప్రభుత్వ రుణం-స్థూల దేశీయోత్పత్తి నిష్పత్తి 56.1 శాతంగా ఉంటుందని జేసీఆర్‌ అంచనా వేసింది. ఆర్థిక లోటు క్రమంగా తగ్గుతుండటం, ప్రభుత్వ రుణ నిర్వహణ మెరుగుపడటం వంటి అంశాలు రేటింగ్‌ పెంపునకు మద్దతుగా నిలిచాయని పేర్కొంది. అయితే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, అధిక రుణ భారం వంటి అంశాలు ఇంకా సవాళ్లుగానే ఉన్నాయని తెలిపింది. భారత ప్రభుత్వం మూలధన వ్యయాన్ని పెంచడం ద్వారా ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహించగలుగుతుందని జేసీఆర్‌ అభిప్రాయపడింది. అదే సమయంలో స్థిరమైన ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ ప్రభుత్వ వ్యయాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించింది. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి, మెరుగైన ఆర్థిక రంగ స్థిరత్వం, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో పురోగతి వంటి అంశాల కారణంగా రేటింగ్‌ పెంపునకు అర్హత సాధించినట్లు స్పష్టం చేసింది.

Advertisement
Advertisement