త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో డిఫెన్స్ ఎక్స్‌పోకు స‌హ‌క‌రించండి.. ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి

Revanth Reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు (Invest Telangana Global Summit) హాజ‌రుకావాల‌ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆహ్వానించారు.

G

Telangana | Published On Sep 2, 2026, 1.15 pm IST

Revanth Reddy | గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో డిఫెన్స్ ఎక్స్‌పోకు స‌హ‌క‌రించండి.. ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు (Invest Telangana Global Summit) హాజ‌రుకావాల‌ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆహ్వానించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు స‌ద‌స్సు జ‌రుగనుంద‌ని, ఇందులో భాగంగా నిర్వహించే రక్షణ ఎక్స్‌పో-2026ను (Defence Expo) ప్రారంభించాలని కోరారు. ఢిల్లీలో ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో (Rajnath Singh) ముఖ్య‌మంత్రి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రక్షణ ఎక్స్‌పోలో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, స్పేస్‌ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సుతో పాటు ప్రతిష్టాత్మక ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే రక్షణ ఎక్స్‌పోకు ర‌క్ష‌ణ శాఖ మంత్రి హాజరై మార్గనిర్దేశం చేస్తే, వారికి ఎంతో స్ఫూర్తిదాయ‌కంగా ఉంటుంద‌న్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే రక్షణ ఎక్స్‌పో-2026కు స్వాగతం పలికేందుకు త‌మ ప్రభుత్వం ఎదురుచూస్తున్న‌ద‌ని వెల్ల‌డించారు. ఎక్స్‌పోను అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవంతంగా నిర్వహించేందుకు రక్షణ శాఖ సహ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఎయిర్‌షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్‌, సారంగ్‌ ఏరోబాటిక్‌ బృందాలు ప్రదర్శనలో పాల్గొనేలా సహకరించాలని కోరారు. స్టాటిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రదర్శనకు కూడా సహక‌రించాల‌న్నారు.

పారా మిలిట‌రీ, నేవీ, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్ర‌ద‌ర్శ‌న‌లో ఏర్పాటు చేయాల‌ని, త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు భాగ‌స్వాములు కావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, ఎండీఎల్‌ తదితర రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, డీఆర్‌డీవో (DRDO) ప్రయోగశాలలు రక్షణ ఎక్స్‌పోలో విస్తృతంగా పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించాల‌న్నారు. విదేశీ రక్షణ శాఖ ప్రతినిధులు, ద్వైపాక్షిక రక్షణ ప్రతినిధి బృందాలు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకరించాలని విజ్ఞ‌ప్తి చేశారు.

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌..

ఆదిలాబాద్ విమానాశ్ర‌యానికి (Adilabad Airport) సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 750 ఎక‌రాలు భూ సేక‌ర‌ణ చేపట్టింద‌ని కేంద్ర మంత్రికి వివ‌రించారు. ర‌క్ష‌ణ శాఖ మొత్తం 1500 ఎక‌రాలు కోరడంతో మ‌రో 750 ఎక‌రాలు సేక‌రించేందుకు అంగీకారం తెలిపిన‌ట్లు చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర (Devarakadra) మండలంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (DRDL) ఆధ్వర్యంలో చేప‌ట్ట‌నున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఇప్ప‌టికే టీజీఐఐసీ (TGIIC) అంగీక‌రించింద‌ని తెలియ‌జేశారు. ఎకరానికి కాకుండా మొత్తం భూమికి సంవత్సరానికి కేవలం రూ.1 నామమాత్రపు లీజు అద్దెతో 33 సంవత్సరాల కాలానికి భూమిని కేటాయించనున్నట్లు తెలిపారు. అవ‌స‌ర‌మైతే దానిని మ‌రో రెండుసార్లు లీజు పొడిగించుకునే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

Advertisement
Advertisement