త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPO | ఐపీఓల జోరు మళ్లీ మొదలు.. రూ.60 వేల కోట్ల సమీకరణకు కంపెనీలు సిద్ధం

IPO | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ క్షీణత ప్రభావంతో ఈ ఏడాది తొలి అర్ధభాగంలో భారత ప్రాథమిక మార్కెట్‌ నిస్తేజంగా సాగింది. మార్కెట్లలో అనిశ్చితి పెరగడంతో అనేక కంపెనీలు తమ ఐపీఓ ప్రణాళికలను వాయిదా వేసుకున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతుండటంతో మళ్లీ ఐపీఓల సందడి మొదలుకానుంది.

S

Business | Published On Jun 15, 2026, 12.47 pm IST

IPO | ఐపీఓల జోరు మళ్లీ మొదలు.. రూ.60 వేల కోట్ల సమీకరణకు కంపెనీలు సిద్ధం
Advertisement

IPO | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ క్షీణత ప్రభావంతో ఈ ఏడాది తొలి అర్ధభాగంలో భారత ప్రాథమిక మార్కెట్‌ నిస్తేజంగా సాగింది. మార్కెట్లలో అనిశ్చితి పెరగడంతో అనేక కంపెనీలు తమ ఐపీఓ ప్రణాళికలను వాయిదా వేసుకున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతుండటంతో మళ్లీ ఐపీఓల సందడి మొదలుకానుంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఐపీఓల ద్వారా కంపెనీలు సుమారు 3.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.33,500 కోట్లు) మాత్రమే సమీకరించాయి. గత రెండేళ్లలో మాత్రం రికార్డు స్థాయిలో 20 బిలియన్‌ డాలర్లకు పైగా (సుమారు రూ.1.90 లక్షల కోట్లు) నిధుల‌ను సమీకరించిన సంగతి తెలిసిందే. దీంతో పోలిస్తే 2026లో నిధుల సమీకరణ గణనీయంగా తగ్గింది.

రూ.60 వేల కోట్ల స‌మీక‌ర‌ణ‌..

అయితే రాబోయే రెండు నెలల్లో పరిస్థితి మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఓలు, సంస్థాగత పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక షేర్‌ కేటాయింపులు, ప్రభుత్వ వాటాల విక్రయాల ద్వారా డజనుకు పైగా సంస్థలు కలిపి సుమారు రూ.60వేల కోట్ల నిధులను సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రాథమిక మార్కెట్‌కు కొత్త ఉత్సాహం లభించే అవకాశం ఉంది. రాబోయే ఇష్యూలలో ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ అత్యధికంగా రూ.13వేల కోట్లను సమీకరించే అవకాశముంది. వారీ ఎనర్జీస్‌ మలివిడత వాటా విక్రయం ద్వారా రూ.7వేల కోట్లు, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.7,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఎల్‌ఐసీలో 2 శాతం వాటా విక్రయం ద్వారా సుమారు రూ.10వేల కోట్లు సమీకరించాలని భావిస్తోంది. అలాగే హిందుస్థాన్‌ జింక్‌లో 2 శాతం వాటా విక్రయం ద్వారా మరో రూ.5వేల కోట్లు సమీకరించే యోచనలో ఉంది.

అనుమ‌తుల కోసం ఎదురు చూపులు..

ఇక క్విక్‌ కామర్స్‌ దిగ్గజం జెప్టో దాదాపు రూ.9,500 కోట్ల నిధుల సమీకరణ కోసం సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) కూడా సుమారు 2.5 బిలియన్‌ డాలర్ల భారీ పబ్లిక్‌ ఇష్యూకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రైమ్‌ డేటాబేస్‌ గణాంకాల ప్రకారం, ఇప్పటికే 163 కంపెనీలు ఐపీఓలకు సెబీ అనుమతి పొందాయి. మరో 62 కంపెనీలు ముసాయిదా పత్రాలు దాఖలు చేసి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇది ప్రపంచంలో అత్యంత చురుకైన ప్రాథమిక మార్కెట్లలో భారత్‌ ఒకటిగా కొనసాగుతున్నడానికి నిదర్శనంగా భావిస్తున్నారు.

భారీ ఎత్తున మార్కెట్లోకి షేర్లు..

నువామా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అంచనాల ప్రకారం, రాబోయే రెండు నెలల్లో 50కి పైగా లిస్టెడ్‌ కంపెనీల లాక్‌-ఇన్‌ పీరియడ్‌లు ముగియనున్నాయి. దీంతో వ్యవస్థాపకులు, తొలి పెట్టుబడిదారులు విక్రయించగలిగే సుమారు రూ.80వేల కోట్ల విలువైన షేర్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకేసారి భారీ సంఖ్యలో ఐపీఓలు, వాటాల విక్రయాలు మార్కెట్లోకి వస్తే కొత్త షేర్ల సరఫరాను గ్రహించే సామర్థ్యం పరీక్షకు గురయ్యే ప్రమాదం ఉందని కొందరు పెట్టుబడిదారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు, రిటైల్‌ మదుపర్ల నుంచి బలమైన డిమాండ్‌ కొనసాగుతున్నందున మార్కెట్‌ ఈ ఇష్యూలను సమర్థంగా స్వీకరించగలదని బ్యాంకింగ్‌ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
Advertisement