త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Stock Markets | యుద్ధం ఎఫెక్ట్‌.. స్టాక్ మార్కెట్ల‌లో రూ.7.80 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి..

Indian Stock Markets | ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీగా ప‌త‌నం అయ్యాయి. దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల ఒత్తిడి భారీగా పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభంలోనే 2,743 పాయింట్లు కుప్పకూలి, రోజులో కనిష్ట స్థాయి 78,543.73 ని తాకింది.

S

Business | Published On Mar 2, 2026, 12.10 pm IST

Indian Stock Markets | యుద్ధం ఎఫెక్ట్‌.. స్టాక్ మార్కెట్ల‌లో రూ.7.80 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి..
Advertisement

Indian Stock Markets | ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీగా ప‌త‌నం అయ్యాయి. దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల ఒత్తిడి భారీగా పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభంలోనే 2,743 పాయింట్లు కుప్పకూలి, రోజులో కనిష్ట స్థాయి 78,543.73 ని తాకింది. నిఫ్టీ 50 కూడా 519 పాయింట్లు పడిపోయి 24,659.25 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం వరకు కొంత కోలుకున్నప్పటికీ సెన్సెక్స్ ఇంకా 1,087.65 పాయింట్లు (1.34 శాతం) నష్టంతో 80,199.54 వద్ద, నిఫ్టీ 323.60 పాయింట్లు (1.29 శాతం) తగ్గి 24,855.05 వద్ద కొనసాగుతోంది. ఈ భారీ గ్యాప్‌డౌన్‌తో పెట్టుబడిదారుల సంపదలో సుమారు రూ.7.80 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.463.50 లక్షల కోట్ల నుంచి రూ.455.70 లక్షల కోట్లకు పడిపోయింది.

ఆసియా మార్కెట్ల‌పైనా ప్ర‌భావం..

లార్సెన్ అండ్ టుబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎటర్నల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి కంపెనీల షేర్లు సూచీలను భారీగా కిందకు లాగాయి. ఇక బీఎస్ఈలో 677 షేర్లు 52 వారాల కనిష్టాన్ని తాకగా, కేవలం 48 షేర్లు మాత్రమే కొత్త గరిష్టాలను సాధించాయి. 3,765 ట్రేడింగ్ షేర్లలో 3,014 నష్టాల్లో ఉన్నాయి. 596 మాత్రమే లాభాల్లో ఉండ‌గా, 155 షేర్లు మార్పు లేకుండా కొన‌సాగుతున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) గత సెషన్‌లో నికరంగా రూ.7,536.36 కోట్లు విక్రయించగా, దేశీయ సంస్థలు రూ.12,292.81 కోట్ల నికర కొనుగోళ్లు చేశాయి. కాగా యుద్ధ ప్ర‌భావం ఆసియా మార్కెట్ల‌పై కూడా ప‌డింది. కొరియా కోస్పి 1% పడిపోయింది. హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ 1.69% తగ్గింది. జపాన్ నిక్కీ 1.53% క్షీణించగా, చైనా షాంఘై కంపోజిట్ తేలికపాటి మార్పుతో నిలిచింది.

ఈ రంగాల‌పై ప్ర‌భావం..

ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషణ ప్రకారం పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు ఒకటి నుంచి రెండు వారాలకు మించి కొనసాగితే నిఫ్టీ 24,500-25,000 స్థాయిని మళ్లీ టెస్ట్ చేసే అవకాశం ఉంది. భారత్ భారీగా ఇంధన దిగుమతులపై ఆధారపడటం, అధిక విలువల వద్ద ట్రేడింగ్ జరగడం వల్ల విదేశీ అమ్మకాల ఒత్తిడి, కరెన్సీ అస్థిరత పెరిగే ప్రమాదం ఉంది. ఈ క్ర‌మంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs), ఎయిర్‌లైన్స్, ఇన్‌ఫ్రా కంపెనీల‌పై ప్ర‌భావం ప‌డ‌నుంది. అలాగే మెటల్స్ పెరిగితే క్యాపిటల్ గూడ్స్, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్‌పై ప్రభావం చూపించే అవ‌కాశం ఉంది.

ఈ రంగాల్లో పెట్టుబ‌డుల‌కు అనుకూలం..

అప్‌స్ట్రీమ్ ఎనర్జీ కంపెనీలు (ONGC, ఆయిల్ ఇండియా), ఎంపిక చేసిన మెటల్స్ (హిందాల్కో), ఐటీ సర్వీసులు (ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్), ఫార్మాసూటికల్స్, తక్కువ విలువల వద్ద ఉన్న ప్రైవేట్ బ్యాంకులు లాభ ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ రంగాలు అధిక క్రూడ్ ధరల నుంచి లాభపడే అవకాశం లేదా కరెన్సీ క్షీణ‌త‌ వల్ల మేలు పొందే అవ‌కాశం ఉంది. అయితే విండ్ఫాల్ టాక్సులు, ఏఐ సంబంధిత ఆందోళనలు టెక్ రంగంలో లాభాలను పరిమితం చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 90-100 డాలర్ల దిశగా పరిగెడితే భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. గత భౌగోళిక ఉద్రిక్తతల సమయంలో కూడా ప్రారంభ పతనం తర్వాత మార్కెట్లు తిరిగి కోలుకున్న ఉదాహరణలు ఉన్నాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అయితే ఈసారి ఉద్రిక్తతల కాలవ్యవధి, చమురు సరఫరా అంతరాయం తీవ్రత మార్కెట్ దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మార‌నున్నాయి.

Advertisement
Advertisement