త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీగా ప‌త‌న‌మైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబ‌డిదారులపై తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల‌ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ చివరి దశలో అకస్మాత్తుగా విక్రయాల ఒత్తిడి పెరగడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. అమెరికా-ఇరాన్ ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో ఎక్కువ భాగం సెషన్‌లో బెంచ్‌మార్క్ సూచీలు పరిమిత శ్రేణిలోనే కదిలాయి.

S

Business | Published On May 29, 2026, 4.02 pm IST

Stock Markets | భారీగా ప‌త‌న‌మైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబ‌డిదారులపై తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల‌ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ చివరి దశలో అకస్మాత్తుగా విక్రయాల ఒత్తిడి పెరగడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. అమెరికా-ఇరాన్ ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో ఎక్కువ భాగం సెషన్‌లో బెంచ్‌మార్క్ సూచీలు పరిమిత శ్రేణిలోనే కదిలాయి. అయితే ట్రేడింగ్ ముగింపు సమయానికి మార్కెట్‌లో భారీ అమ్మకాల వెల్లువ కనిపించింది. దీంతో సెన్సెక్స్ దాదాపు 1,300 పాయింట్లు కుప్పకూలగా, నిఫ్టీ 50 సూచీ 23,485 స్థాయికి ప‌డిపోయింది. చివరకు 30 షేర్ల సెన్సెక్స్ 1,092 పాయింట్లు (1.44 శాతం) నష్టపోయి 74,775.74 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 359 పాయింట్లు (1.50 శాతం) పడిపోయి 23,547.75 వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్‌ల‌లో కూడా లాభాల స్వీకరణ కనిపించింది. బీఎస్‌ఈ 150 మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.25 శాతం క్షీణించగా, 250 స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.61 శాతం నష్టపోయింది. ఒక్క ట్రేడింగ్ సెషన్‌లోనే పెట్టుబడిదారులు సుమారు రూ.6 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లోని దాదాపు రూ.471 లక్షల కోట్ల నుంచి రూ.465 లక్షల కోట్లకు పడిపోయింది.

కార‌ణాలు ఇవే..

మార్కెట్‌లో అకస్మాత్తుగా నమోదైన ఈ క్షీణతకు ప్రధాన కారణం వీకెండ్‌కు ముందు జరిగిన దూకుడు లాభాల స్వీకరణగా భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ ఒప్పందం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం కోసం ఎదురుచూస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం ఇరు దేశాలు గురువారం కాల్పుల విరమణను పొడిగించడం, అలాగే కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా నౌకాయానాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మాన్సూన్ అంచనాలను తగ్గించడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిన మరో కీలక అంశంగా నిలిచింది. ఐఎండీ తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో భారత్ దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ) వర్షపాతంలో 90 శాతం మాత్రమే నమోదు చేసే అవకాశం ఉన్న‌ట్లు తేలింది.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు, రూపాయి విలువ ప‌త‌నం..

ఐఎండీ మాన్సూన్ అంచనాలను దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ)లో 90 శాతానికి తగ్గించడంతో మార్కెట్‌లో విస్తృత స్థాయిలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. తక్కువ వర్షపాతం అవకాశాలతోపాటు ఎల్ నినో వాతావరణ పరిస్థితులు బలపడే అవకాశాలు పెరగడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాబోయే నెలల్లో ఆహార ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదంపై భయాలు అధికమయ్యాయ‌ని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. కాగా శుక్ర‌వారం నాటి సెష‌న్‌లో చ‌మురు ధ‌ర‌లు కూడా త‌గ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.25 శాతం మేర త‌గ్గి బ్యారెల్‌కు 93.7 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.81 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 86.7 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ మ‌రోమారు ప‌త‌న‌మైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి విలువ 67 పైస‌లు త‌గ్గి 95 వ‌ద్ద నిలిచింది.

Advertisement
Advertisement