త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీగా కుప్ప‌కూలినా.. రిక‌వ‌ర్ అయి లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో సోమ‌వారం తీవ్ర స్థాయిలో అస్థిర‌త చోటు చేసుకుంది. సూచీలు ప్రారంభంలో క‌నిష్ట స్థాయితో మొద‌లై త‌రువాత భారీ ఎత్తున రిక‌వ‌ర్ అయ్యాయి. ఈ క్ర‌మంలో గ‌త సెష‌న్ ముగింపుతో పోలిస్తే సూచీలు ఫ్లాట్‌గా స్థిర‌ప‌డ్డాయి. అంత‌ర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలే ప్ర‌స్తుతం మార్కెట్ల‌ను శాసిస్తున్నాయి.

S

Business | Published On May 18, 2026, 4.12 pm IST

Stock Markets | భారీగా కుప్ప‌కూలినా.. రిక‌వ‌ర్ అయి లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో సోమ‌వారం తీవ్ర స్థాయిలో అస్థిర‌త చోటు చేసుకుంది. సూచీలు ప్రారంభంలో క‌నిష్ట స్థాయితో మొద‌లై త‌రువాత భారీ ఎత్తున రిక‌వ‌ర్ అయ్యాయి. ఈ క్ర‌మంలో గ‌త సెష‌న్ ముగింపుతో పోలిస్తే సూచీలు ఫ్లాట్‌గా స్థిర‌ప‌డ్డాయి. అంత‌ర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలే ప్ర‌స్తుతం మార్కెట్ల‌ను శాసిస్తున్నాయి. భౌగోళిక ఉద్రిక్త‌త‌లు పెర‌గ‌డంతో మార్కెట్ల‌లో మ‌ళ్లీ అస్థిర‌త చోటు చేసుకుంది. పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న మొద‌లైంది. దీంతో ప్రారంభంలో భారీ అమ్మకాల ఒత్తిడితో కుప్పకూలిన మార్కెట్లు చివరికి రికవరీ సాధించి గ్రీన్‌లో ముగిశాయి. విస్తృత మార్కెట్ల‌లో భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపదకు భారీగా న‌ష్టం వాటిల్లింది. ఫ్రంట్‌లైన్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్‌, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. రోజులో ఒక దశలో సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా పడిపోయినా, అక్కడి నుంచి బలమైన రికవరీతో 1,100 పాయింట్లకుపైగా ఎగబాకింది.

అయినా రూ.3 ల‌క్ష‌ల కోట్లు న‌ష్ట‌మే..

30 షేర్ల సెన్సెక్స్ సూచీ 77 పాయింట్లు (0.10 శాతం) లాభంతో 75,315.04 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ50 సూచీ రోజులో 23,317 కనిష్ఠ స్థాయిని తాకినా, అక్కడి నుంచి కోలుకుని 6 పాయింట్లు (0.03 శాతం) లాభంతో 23,649.95 వద్ద స్థిరపడింది. అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు తీవ్రంగా నష్టపోయాయి. బీఎస్‌ఈ 150 మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.43 శాతం పడిపోయింది. బీఎస్‌ఈ 250 స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.71 శాతం కుప్పకూలింది. విస్తృత‌ మార్కెట్‌ల‌లో ఈ పతనం కారణంగా బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.461 లక్షల కోట్ల నుంచి రూ.458 లక్షల కోట్లకు పడిపోయింది. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.3 లక్షల కోట్ల మేర ఆవిరైంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై కొనసాగుతున్న అనిశ్చితి, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, రూపాయి బలహీనత మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 110 డాలర్లకు పైగా ట్రేడ్ అయింది. మరోవైపు భారత రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 96.33 రికార్డు కనిష్ఠ స్థాయిలో ముగిసింది.

పెరిగిన భౌగోళిక ఉద్రిక్త‌త‌లే కార‌ణం..

సెన్సెక్స్‌లో టెక్ మ‌హీంద్రా, ఇన్ఫోసిస్‌, భార‌తి ఎయిర్‌టెల్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు టాటా స్టీల్‌, ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా, ఎన్‌టీపీసీ టాప్ లూజర్లుగా నిలిచాయి. సెక్టోరల్ సూచీల్లో నిఫ్టీ మీడియా ఇండెక్స్ 2.24 శాతం కుప్పకూలింది. ఆ తర్వాత నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.92 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 1.80 శాతం, ఆటో ఇండెక్స్ 1.71 శాతం నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్ 0.32 శాతం పడిపోయింది. మరోవైపు నిఫ్టీ ఐటీ 2.43 శాతం పెరిగింది. ఫార్మా సూచీ కూడా 0.5 శాతం మేర లాభపడింది. అయితే భౌగోళిక ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో పెట్టుబ‌డిదారులు చాలా అప్ర‌మ‌త్తంగా ఉంటున్నార‌ని మార్కెట్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ట్రంప్ మ‌రోమారు ఇరాన్‌కు తాజా హెచ్చ‌రిక‌లు చేయ‌డం, ర‌ష్యాపై ఉక్రెయిన్ మ‌ళ్లీ దాడులు చేప‌ట్ట‌డంతో ఉద్రిక్త‌త‌లు కాస్త పెరిగాయి. ఈ క్ర‌మంలో మార్కెట్లు ఇప్ప‌ట్లో కోలుకుంటాయా అని సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement