త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | తీవ్ర ఒడిదుడుకుల‌తో.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం తీవ్ర అస్థిర‌త‌తో ట్రేడింగ్‌ను కొన‌సాగించాయి. ఉద‌యం ప్రారంభ సెష‌న్‌లో మార్కెట్లు గ్యాప్ అప్ అయి బుల్ ర్యాలీతో కొన‌సాగినా, మ‌ధ్యాహ్నం త‌రువాత పెట్టుబ‌డిదారులు లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గు చూపారు. దీంతో ఇంట్రా డే గ‌రిష్ట స్థాయిల నుంచి సూచీలు దిగువ‌కు వ‌చ్చి స్థిర‌ప‌డ్డాయి.

S

Business | Published On Apr 29, 2026, 4.08 pm IST

Stock Markets | తీవ్ర ఒడిదుడుకుల‌తో.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం తీవ్ర అస్థిర‌త‌తో ట్రేడింగ్‌ను కొన‌సాగించాయి. ఉద‌యం ప్రారంభ సెష‌న్‌లో మార్కెట్లు గ్యాప్ అప్ అయి బుల్ ర్యాలీతో కొన‌సాగినా, మ‌ధ్యాహ్నం త‌రువాత పెట్టుబ‌డిదారులు లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గు చూపారు. దీంతో ఇంట్రా డే గ‌రిష్ట స్థాయిల నుంచి సూచీలు దిగువ‌కు వ‌చ్చి స్థిర‌ప‌డ్డాయి. నిఫ్టీ50 సూచీ 181.95 పాయింట్లు (0.76 శాతం) పెరిగి 24,177.65 వ‌ద్ద ముగియ‌గా, సెన్సెక్స్ 609.45 పాయింట్లు (0.79 శాతం) పెరిగి 77,496.36 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ ఆటో, ఐటీ, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌, బ్యాంకింగ్ రంగాల‌కు చెందిన షేర్లు సూచీల పెరుగుద‌ల‌కు కార‌ణం అయ్యాయి. కాగా ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో మొమెంటం కొన‌సాగినా, మెట‌ల్స్ సూచీ మాత్రం ఫ్లాట్‌గా స్థిర‌ప‌డింది. అయితే మొత్తంగా చూస్తే అన్ని రంగాలు పాజిటివ్‌గానే ఉన్న‌ప్ప‌టికీ మీడియా సూచీ మాత్రం వెనుక‌బ‌డింది. పెట్టుబ‌డిదారులు లాభాల కోసం చూడ‌డంతో ఇంట్రా డే గ‌రిష్టాల ద్వారా వ‌చ్చిన లాభాలు త‌గ్గాయి.

పాజిటివ్‌గానే సంకేతాలు..

విదేశీ మార్కెట్లు సైతం పాజిటివ్‌గానే ముగియ‌డం దేశీయ సూచీల ర్యాలీకి కార‌ణ‌మైంది. క్రితం సెష‌న్‌లో అమెరికా ఎస్ అండ్ పీ500 ఫ్యూచ‌ర్స్‌ సూచీ 0.2 శాతం పెర‌గ్గా, నాస్‌డాక్ 100 ఫ్యూచ‌ర్స్ సూచీ 0.5 శాతం పెరిగింది. అలాగే ఎంఎస్‌సీఐ ఆసియా ప‌సిఫిక్ సూచీ 0.1 శాతం మేర పెరిగింది. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ, ఏఎస్ఎక్స్ 200 ఇండెక్స్ మాత్రం 0.4 శాతం ప‌త‌న‌మైంది. హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్ 1.5 శాతం పెర‌గ్గా, షాంఘై కంపోజిట్ 0.6 శాతం పెరిగింది. అమెరికా, ఆసియా మార్కెట్ల‌లో పాజిటివ్ సంకేతాలు ఏర్ప‌డ‌డంతో ఆ ప్ర‌భావం దేశీయ మార్కెట్ల‌పైనా ప‌డింది. అందువ‌ల్లే ర్యాలీ కొన‌సాగింది.

టాప్ గెయిన‌ర్లు, లూజ‌ర్లు..

ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి మార‌కం విలువ మ‌రోమారు ప‌త‌న‌మైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 0.3 శాతం త‌గ్గిన భార‌త రూపాయి డాల‌ర్‌కు 94.8450 వ‌ద్ద నిలిచింది. నిఫ్టీ50 సూచీలో మొత్తం 50 స్టాక్స్‌లో 15 స్టాక్స్ న‌ష్టాల్లో ముగియ‌గా, 35 స్టాక్స్ లాభాల్లో కొన‌సాగాయి. ఐటీసీ షేర్లు 3.79 శాతం మేర పెరిగి అత్య‌ధికంగా లాభ‌ప‌డ‌గా, ఆ త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా టెక్ మ‌హీంద్రా (3.31 శాతం), రిల‌య‌న్స్ (2.96), కోల్ ఇండియా (2.93 శాతం), మారుతి (2.89 శాతం) నిలిచాయి. అలాగే ఇండిగో షేర్లు భారీగా ప‌త‌నమ‌య్యాయి. 2.31 శాతం ప‌త‌నంతో ఆ సంస్థ టాప్ లూజ‌ర్‌గా నిల‌వ‌గా, త‌రువాత స్థానాల్లో వ‌రుస‌గా డాక్ట‌ర్ రెడ్డీస్ (1.99 శాతం), ఎన్‌టీపీసీ (1.66 శాతం), బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్ (1.02 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (0.97 శాతం) నిలిచాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు పెరిగిన‌ప్ప‌టికీ ఈక్విటీ మార్కెట్లు మాత్రం లాభాల్లోనే కొన‌సాగాయి. అయితే ఇలాంటి అస్థిర స‌మ‌యాల్లోనే పెట్టుబ‌డిదారులు ఇంకా ఎక్కువ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధ‌ర 2.81 శాతం పెరిగి 106 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 3.39 శాతం పెరిగి 100 డాల‌ర్ల వ‌ద్ద ఉంది.

Advertisement
Advertisement