త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. అమెరికా-ఇరాన్ చ‌ర్చ‌ల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చేనా..?

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం భారీ లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో వచ్చిన ర్యాలీతోపాటు అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయ‌ని పెట్టుబడిదారులు విశ్వ‌సించ‌డంతో మార్కెట్ల‌లో భారీ ర్యాలీ కొన‌సాగింది.

S

Business | Published On Apr 15, 2026, 4.13 pm IST

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. అమెరికా-ఇరాన్ చ‌ర్చ‌ల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చేనా..?
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం భారీ లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో వచ్చిన ర్యాలీతోపాటు అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయ‌ని పెట్టుబడిదారులు విశ్వ‌సించ‌డంతో మార్కెట్ల‌లో భారీ ర్యాలీ కొన‌సాగింది. సెన్సెక్స్ 1,263.67 పాయింట్లు (1.64 శాతం) పెరిగి 78,111.24 వ‌ద్ద ముగియ‌గా, నిఫ్టీ 50 సూచీ 388.65 పాయింట్లు (1.63 శాతం) ఎగబాకి 24,231.30 వద్ద స్థిరపడింది. ఫ్రంట్‌లైన్ సూచీల కన్నా విస్తృత మార్కెట్లు మెరుగైన ప్రదర్శన చూపించాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ రెండూ 2 శాతం క‌న్నా ఎక్కువ లాభాలతో ముగిశాయి. సెక్టోరల్ సూచీలు అన్నీ గ్రీన్‌లో ముగిశాయి. ముఖ్యంగా నిఫ్టీ ఐటీ 2.8 శాతం భారీ పెరుగుదలతో అత్యుత్తమ ప్రదర్శన చూపింది. నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియాల్టీ సూచీలు కూడా 2 శాతానికి పైగా లాభాలను నమోదు చేశాయి.

పెట్టుబ‌డిదారుల ఆశావ‌హ దృక్ప‌థం..

అమెరికా-ఇరాన్ యుద్ధం ఉద్రిక్తతలు తగ్గే సంకేతాలు పెట్టుబడిదారుల రిస్క్ తీసుకునే ఆసక్తిని పెంచాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు వచ్చే రెండు రోజుల్లో పాకిస్తాన్‌లో మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని న్యూయార్క్ పోస్ట్‌కు వెల్లడించడంతో మార్కెట్‌ల‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించింది. మార్కెట్‌ను ప్రభావితం చేసిన అంశాలపై జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ అమెరికా-ఇరాన్ చర్చలపై ఉన్న ఆశావాదం మార్కెట్‌లో విస్తృత స్థాయిలో సానుకూల భావనను సృష్టించిందని తెలిపారు. చర్చలపై ఆశలు పెరగడంతో సరఫరా అంతరాయం భయాలు తగ్గి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాల‌ర్ల క‌న్నా దిగువకు రావడం కూడా దీనికి దోహ‌దం చేసింద‌న్నారు. నాల్గవ త్రైమాసిక ఫలితాలపై అంచనాలు మితంగా ఉన్నప్పటికీ, ఆకర్షణీయమైన విలువలు, 2027 ఆర్థిక సంవత్సరానికి మెరుగైన ఆదాయ అంచనాలు పెట్టుబడిదారులను ఉత్సాహపరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల సమీప కాలంలో మార్కెట్ ర్యాలీ కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు, బ‌ల‌ప‌డ్డ రూపాయి..

స్టాక్ మార్కెట్లు భారీగా లాభాల‌తో ముగియ‌డంతో ఒక్క రోజులోనే పెట్టుబ‌డిదారుల సంప‌ద సుమారు రూ.9 ల‌క్ష‌ల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈ లో లిస్ట్ అయి ఉన్న కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ క్రితం సెష‌న్ ముగింపు రూ.449 ల‌క్ష‌ల కోట్ల నుంచి రూ.458 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు త‌గ్గ‌డం కూడా మార్కెట్ల ర్యాలీకి కార‌ణ‌మైంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధ‌ర బ్యారెల్‌కు 93 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 90 వ‌ద్ద ఉంది. ఇక అమెరికా డాల‌ర్ తో పోలిస్తే రూపాయి విలువ స్వ‌ల్పంగా పెరిగింది. బుధ‌వారం సెష‌న్‌లో 12 పైస‌లు లాభ‌ప‌డ్డ రూపాయి డాల‌ర్‌కు 93.23 వ‌ద్ద నిలిచింది. అయితే అమెరికా-ఇరాన్ రెండో ద‌ఫా శాంతి చ‌ర్చ‌ల‌పై మ‌రో 2 లేదా 3 రోజుల్లో స్ప‌ష్ట‌త రాక‌పోతే మార్కెట్ల‌పై నెగెటివ్ ప్రభావం చూపించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Advertisement
Advertisement