త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రూ.10 ల‌క్ష‌ల కోట్లు పెరిగిన సంప‌ద‌..

Stock Markets | రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ దేశీయ‌ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లలో కనిపించిన సానుకూల ధోరణి దేశీయ మార్కెట్ల‌పై కూడా ప్రభావం చూపించింది. సెన్సెక్స్ 1,186.77 పాయింట్లు (1.65 శాతం) పెరిగి 73,134.32 వద్ద ముగిసింది.

S

Business | Published On Apr 1, 2026, 3.58 pm IST

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రూ.10 ల‌క్ష‌ల కోట్లు పెరిగిన సంప‌ద‌..
Advertisement

Stock Markets | రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ దేశీయ‌ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లలో కనిపించిన సానుకూల ధోరణి దేశీయ మార్కెట్ల‌పై కూడా ప్రభావం చూపించింది. సెన్సెక్స్ 1,186.77 పాయింట్లు (1.65 శాతం) పెరిగి 73,134.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 348 పాయింట్లు (1.56 శాతం) పెరిగి 22,679.40 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 3 శాతం చొప్పున పెరిగాయి. ఈ పెరుగుదలతో ఒక్కరోజులోనే పెట్టుబడిదారులు సుమారు రూ.10 లక్షల కోట్లు సంపాదించారు. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.412 లక్షల కోట్ల నుంచి రూ.422 లక్షల కోట్లకు పెరిగింది.

ప్ర‌పంచ మార్కెట్లు సైతం లాభాల్లోనే..

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు మార్కెట్‌కు ప్రధానంగా ఊతం ఇచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో రెండు నుంచి మూడు వారాల్లో ఇరాన్‌పై సైనిక చర్యలు ముగిసే అవకాశం ఉందని వెల్లడించారు. యుద్ధం ముగియడానికి ఇరాన్‌తో ఒప్పందం అవసరం లేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం క్రూడ్ ఆయిల్ ధరలను పెంచి, గ్లోబల్ వృద్ధి, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించింది. ఇప్పుడు యుద్ధం ముగిసే సంకేతాలు పెట్టుబడిదారుల్లో న‌మ్మ‌కాన్ని పెంచాయి. ప్రపంచ మార్కెట్లలో వచ్చిన పాజిటివ్ ట్రెండ్ దేశీయ మార్కెట్ల‌ను ప్రభావితం చేసింది. దక్షిణ కొరియా కోస్పి సూచీ దాదాపు 8 శాతం పెరిగింది. జపాన్ నిక్కీ 4.61 శాతం మేర లాభ‌ప‌డింది. యూరప్‌లో యూకే ఎఫ్టీఎస్ఈ, జర్మనీ డీఏఎక్స్‌, ఫ్రాన్స్ సీఏసీ40 సూచీలు కూడా 2 శాతం చొప్పున లాభపడ్డాయి. అమెరికాలో క్రితం సెష‌న్ ముగింపులో నాస్ డాక్ 4 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 3 శాతం పెరగడం మార్కెట్‌కు మరింత జోష్‌ను ఇచ్చింది.

త‌క్కువ ధ‌ర‌ల‌కే బ్లూచిప్ స్టాక్స్‌..

అమెరికా డాలర్ ఇండెక్స్ సుమారు 0.50 శాతం మేర తగ్గింది. 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ కూడా 4.27 శాతానికి పడిపోయింది. ఇది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల‌ మార్కెట్లకు అనుకూలం, దీని వ‌ల్ల విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉంటాయి. మార్చిలో నిఫ్టీ 50 దాదాపు 11.3 శాతం మేర ప‌త‌న‌మైంది. వరుసగా 4 నెలల నష్టాల తర్వాత అనేక బ్లూచిప్ స్టాక్స్ తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మార్కెట్‌లో మెరుగైన భావనతో పెట్టుబడిదారులు విలువ ఆధారిత కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో మార్కెట్ పెరుగుదల నుంచి వారు లాభాల‌ను ఆశిస్తున్నారు.

చ‌మురు ధ‌ర‌లు ప‌త‌నం, బ‌ల‌ప‌డ్డ రూపాయి..

అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు ప‌త‌నం అయ్యాయి. ఇది కూడా ఈక్విటీ మార్కెట్ల పెరుగుద‌ల‌కు కార‌ణ‌మైంది. బ్రెంట్ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 1 శాతం మేర త‌గ్గి 102 డాల‌ర్ల వ‌ద్ద కొన‌సాగింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 1.3 శాతం మేర ప‌త‌నం అయి 95 డాల‌ర్ల వ‌ద్ద కొన‌సాగింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి విలువ కాస్త పెరిగింది. బుధ‌వారం నాటి సెష‌న్‌లో 11 పైస‌లు లాభ‌ప‌డ్డ రూపాయి డాల‌ర్‌కు 93.3 వ‌ద్ద కొన‌సాగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల‌లో నిఫ్టీ ఫార్మా, హెల్త్ కేర్ సూచీలు త‌ప్ప అన్ని ఇత‌ర ఇండెక్స్‌లు లాభ‌ప‌డ్డాయి. ట్రెంట్‌, ఇండిగో, అదానీ పోర్ట్స్‌, భార‌త్ ఎల‌క్ట్రానిక్స్‌, అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ షేర్లు భారీగా ఎగ‌సి టాప్ 5 గెయిన‌ర్ల జాబితాలో చోటు సాధించాయి. అలాగే టాప్ 5 లూజ‌ర్ల జాబితాలో డాక్ట‌ర్ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, సిప్లా, అపోలో హాస్పిట‌ల్స్‌, స‌న్ ఫార్మా నిలిచాయి.

Advertisement
Advertisement