త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన‌ స్టాక్ మార్కెట్లు.. 1,109 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్ల జోరు, కంపెనీల ఆదాయాలపై పెరిగిన ఆశావాదం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. దీంతో ప్రధాన సూచీలైన నిఫ్టీ 50, బీఎస్‌ఈ సెన్సెక్స్ గణనీయమైన లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ 50 సూచీ 358.60 పాయింట్లు (1.60 శాతం) పెరిగి 22,721.95 వద్ద ముగిసింది.

S

Business | Published On Oct 13, 2026, 4.15 pm IST

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన‌ స్టాక్ మార్కెట్లు.. 1,109 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
Advertisement

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్ల జోరు, కంపెనీల ఆదాయాలపై పెరిగిన ఆశావాదం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. దీంతో ప్రధాన సూచీలైన నిఫ్టీ 50, బీఎస్‌ఈ సెన్సెక్స్ గణనీయమైన లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ 50 సూచీ 358.60 పాయింట్లు (1.60 శాతం) పెరిగి 22,721.95 వద్ద ముగిసింది. మరోవైపు బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,109.10 పాయింట్లు (1.54 శాతం) లాభపడి 73,033.78 వద్ద స్థిరపడింది. మార్కెట్ ర్యాలీలో ఐటీ షేర్లు కీలక పాత్ర పోషించాయి. నిఫ్టీ ఐటీ సూచీ 5 శాతానికి పైగా దూసుకెళ్లింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆర్థిక ఫలితాలపై నెలకొన్న ఆశావాదం ఐటీ రంగ షేర్ల కొనుగోళ్లకు ఊతమిచ్చింది.

ఐటీ షేర్ల ర్యాలీ..

పీఎల్ క్యాపిటల్ అడ్వైజరీ అండ్ డీలింగ్ విభాగం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ విక్రమ్ కసాత్ మాట్లాడుతూ భారత ఈక్విటీ మార్కెట్లు బలమైన పునరుద్ధరణను నమోదు చేశాయని, ఈ లాభాలకు ఐటీ షేర్లే ప్రధానంగా నాయకత్వం వహించాయని తెలిపారు. నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 4.7 శాతం పెరగడం ద్వారా పెట్టుబడిదారులు మొత్తం మార్కెట్‌లో విచక్షణారహితంగా కొనుగోళ్లు చేయకుండా, కంపెనీల ఆదాయాలపై స్పష్టత ఉన్న రంగాల్లో ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఫార్మా మాత్రమే 0.05 శాతం నష్టపోయింది. నిఫ్టీ రియాల్టీ సూచీ 2.48 శాతం పెరిగింది. నిఫ్టీ ఐటీ సూచీ 5 శాతానికి పైగా లాభపడింది. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 1.40 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 1.46 శాతం, నిఫ్టీ ఆటో 1.23 శాతం, నిఫ్టీ మెటల్ 1.17 శాతం, నిఫ్టీ మీడియా 0.55 శాతం చొప్పున పెరిగాయి.

అనిశ్చితి త‌గ్గుతున్నా..

ఇండియా విక్స్ సూచీ సుమారు 8 శాతం తగ్గడం సమీప కాలంలో మార్కెట్‌పై ఉన్న అనిశ్చితి తగ్గినట్లు సూచిస్తోందని విక్రమ్ కసాత్ వివరించారు. అయితే, స్మాల్‌క్యాప్ షేర్లలో బలహీనత కొనసాగడం పెట్టుబడిదారుల రిస్క్ తీసుకునే సామర్థ్యం అన్ని విభాగాల్లో ఒకేలా లేదని తెలియజేస్తోందన్నారు. అధిక స్థాయిలో కొనసాగుతున్న ముడి చమురు ధరలు, సెప్టెంబర్‌లో 5.54 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం విధానపరమైన నిర్ణయాలకు ఉన్న వెసులుబాటును, కంపెనీల లాభాల మార్జిన్లను పరిమితం చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. రానున్న రోజుల్లో మార్కెట్ ర్యాలీ కొనసాగాలంటే కంపెనీల ఆదాయాల్లో స్థిరమైన వృద్ధితోపాటు మరిన్ని రంగాల నుంచి కొనుగోళ్ల మద్దతు అవసరమని చెప్పారు.

భారీగా ప‌త‌న‌మైన చ‌మురు ధ‌ర‌లు..

ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌డం కూడా మార్కెట్ల‌లో భారీ ర్యాలీకి కార‌ణ‌మైంది. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.24 శాతం ప‌త‌న‌మై బ్యారెల్‌కు 102 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.56 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 92 డాల‌ర్ల‌కు దిగి వ‌చ్చింది. ఫారెక్స్ మార్కెట్‌లోనూ అనుకూల సంకేతాలే క‌నిపించాయి. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి విలువ పెరిగింది. డాల‌ర్‌కు 95.27 వ‌ద్ద ఉన్న రూపాయి ఈ సెష‌న్‌లోనే 0.51 శాతం లాభం పొందింది.

Advertisement
Advertisement