త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో భారీ జోష్.. 990 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 990 పాయింట్లు పెరగ్గా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 25,500 మార్కును దాటింది. ఆటో, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు బలాన్నిచ్చాయి. అయితే ఐటీ షేర్లు మాత్రం నష్టాలను చవిచూశాయి.

S

Business | Published On Nov 19, 2026, 3.55 pm IST

Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో భారీ జోష్.. 990 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 990 పాయింట్లు పెరగ్గా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 25,500 మార్కును దాటింది. ఆటో, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు బలాన్నిచ్చాయి. అయితే ఐటీ షేర్లు మాత్రం నష్టాలను చవిచూశాయి.

భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో దూసుకెళ్లాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 989.94 పాయింట్లు (1.21 శాతం) పెరిగి 83,021.75 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 286.35 పాయింట్లు (1.14 శాతం) లాభపడి 25,514.30 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో మారుతీ సుజుకీ షేరు 7.58 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. మహీంద్రా అండ్ మహీంద్రా 4.78 శాతం, యాక్సిస్ బ్యాంక్ 4.38 శాతం, హిందుస్థాన్ యూనిలీవర్ 4.22 శాతం, ఎస్‌బీఐ 2.11 శాతం లాభపడ్డాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. మరోవైపు ఇన్ఫోసిస్ 1.66 శాతం, టీసీఎస్ 1.41 శాతం, టెక్ మహీంద్రా 1.38 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.10 శాతం నష్టపోయాయి.

అత్య‌ధికంగా లాభ‌ప‌డ్డ ఆటో సూచీ..

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో సూచీ అత్యధికంగా 4.40 శాతం లాభపడింది. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 3.64 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 2.29 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 2.09 శాతం, నిఫ్టీ సిమెంట్ 1.97 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 1.39 శాతం, నిఫ్టీ ఫార్మా 0.61 శాతం పెరిగాయి. అయితే నిఫ్టీ ఐటీ సూచీ 1.10 శాతం నష్టపోయి అత్యధికంగా నష్టపోయిన రంగంగా నిలిచింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) వరుసగా కొనుగోళ్లు కొనసాగించడం మార్కెట్‌కు ప్రధానంగా కలిసొచ్చింది. బుధవారం ఒక్కరోజే భారత ఈక్విటీ మార్కెట్లలో రూ.5,866 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ముడి చమురు ధరలు స్థిరంగా ఉండడం, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కూడా ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచాయి.

గ్లోబల్ మార్కెట్ల‌లో సానుకూల వాతావ‌ర‌ణం..

అంతర్జాతీయంగా అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ బలపడడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంథ్రోపిక్ భారీ ఐపీఓకు సంబంధించిన ధరల నిర్ణయం నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లలో సానుకూల వాతావరణం ఏర్పడింది. పండుగల సీజన్ అనంతరం కూడా వాహనాలకు డిమాండ్ కొనసాగుతుందనే అంచనాలు, ముడిసరుకుల ధరలు తగ్గడం ఆటో షేర్లకు మద్దతునిచ్చాయి. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరి, వడ్డీ రేట్లపై ఆందోళనలు, టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల వ్యయంపై సందేహాలు ఐటీ షేర్లపై ఒత్తిడి పెంచాయి. బుధవారం నాటి మార్కెట్ నష్టాల తర్వాత గురువారం ఆటో, బ్యాంకింగ్, వినియోగ ఆధారిత రంగాల్లో విస్తృతంగా కొనుగోళ్లు జరగడంతో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి.

Advertisement
Advertisement