త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీ.. 1,533 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్లు, తక్కువ ధరల వద్ద విలువైన షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం, కీలక కంపెనీల షేర్లలో ర్యాలీ మార్కెట్లకు ప్రధానంగా అండగా నిలిచాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు గణనీయమైన లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 1,533.72 పాయింట్లు (2.11 శాతం) పెరిగి 74,315.61 వద్ద ముగిసింది.

S

Business | Published On Oct 15, 2026, 4.14 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీ.. 1,533 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
Advertisement

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్లు, తక్కువ ధరల వద్ద విలువైన షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం, కీలక కంపెనీల షేర్లలో ర్యాలీ మార్కెట్లకు ప్రధానంగా అండగా నిలిచాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు గణనీయమైన లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 1,533.72 పాయింట్లు (2.11 శాతం) పెరిగి 74,315.61 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 374.65 పాయింట్లు (1.66 శాతం) లాభంతో 22,997.35 వద్ద స్థిరపడింది. అయితే మార్కెట్లో మొత్తం 1,494 షేర్లు లాభాల్లో ముగియగా, 2,538 షేర్లు నష్టాలను చవిచూశాయి. మరో 149 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు. మార్కెట్‌లో ఎక్కువ షేర్లు నష్టాల్లో ఉన్నప్పటికీ, భారీ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు సూచీలకు బలాన్నిచ్చాయి.

ఐటీ షేర్లలో కొనుగోళ్ల జోరు..

స్టాక్ మార్కెట్ ర్యాలీలో ఐటీ షేర్లు కీలక పాత్ర పోషించాయి. ఐటీ సూచీ ఒక్కరోజులో 1.5 శాతం పెరిగింది. దీంతో గత మూడు ట్రేడింగ్ సెషన్లలో ఐటీ సూచీ మొత్తం లాభం సుమారు 7.5 శాతానికి చేరింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్ షేర్లు ఒక్కొక్కటి సుమారు 3 శాతం చొప్పున పెరిగాయి. టెక్ మహీంద్రా 3.5 శాతం, విప్రో 1.7 శాతం లాభపడ్డాయి. ఈ రెండు కంపెనీల త్రైమాసిక ఫలితాలు అదే రోజు తర్వాత వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ హెచ్‌సీఎల్‌టెక్ ఫలితాల అనంతరం ఐటీ షేర్లలో కనిపిస్తున్న బలం, వాటిపై నెలకొన్న సానుకూల అంచనాలు ఐటీ సూచీకి మరింత మద్దతునిస్తాయని పేర్కొన్నారు.

ఆసియా మార్కెట్‌ల‌లో భిన్న ప‌రిస్థితి..

అయితే ఆసియా మార్కెట్లలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన షేర్లలో అమ్మకాలు పెరగడంతో పలు ఆసియా సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికాలో అంచనాలకు మించి ద్రవ్యోల్బణం పెరగడం ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు మరింత కఠినంగా మారుతాయ‌నే ఆందోళనలకు దారితీసింది. ముఖ్యంగా వడ్డీ రేట్ల అంచనాలకు అనుగుణంగా విలువలు మారే అధిక వృద్ధి కంపెనీల షేర్లపై ఈ పరిణామం ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికాలో ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.4 శాతం నుంచి సెప్టెంబరులో 3.7 శాతానికి పెరగడంతో ఫెడరల్ రిజర్వ్ అక్టోబరులో మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే అంచనాలు బలపడ్డాయి. ఈ ఆందోళనలతో అమెరికా మార్కెట్లలో భారీ అమ్మకాలు జరిగాయి.

ఎఫ్ఐఐలు మ‌ళ్లీ వ‌చ్చేనా..

టెక్నాలజీ షేర్లకు ప్రాధాన్యమున్న నాస్‌డాక్ సూచీ 1.88 శాతం పడిపోయింది. ముఖ్యంగా ఏఐ ఆధారిత కంపెనీల షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఈ ప్రభావం దక్షిణ కొరియా, జపాన్ మార్కెట్లకూ విస్తరించింది. గురువారం ట్రేడింగ్ సమయంలో జపాన్ నిక్కీ సూచీ 4 శాతానికి పైగా, దక్షిణ కొరియా కోస్పీ సూచీ 7 శాతానికి పైగా పడిపోయాయి. అయితే ఏఐ షేర్లలో కొనసాగుతున్న దిద్దుబాటు భారత మార్కెట్లకు సానుకూలంగా మారే అవకాశం ఉందని విజయకుమార్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు భారత షేర్లను విక్రయించి ఏఐ షేర్లలో పెట్టుబడులు పెడుతున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) తమ వ్యూహాన్ని మార్చుకునే అవకాశం ఉందని తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే భారత మార్కెట్ల నుంచి విదేశీ నిధుల నిరంతర ప్రవాహం తగ్గడంతోపాటు, మళ్లీ పెట్టుబడులు వచ్చే అవకాశమూ ఉందని పేర్కొన్నారు.

ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డం కూడా ఈక్విటీల్లో ర్యాలీకి కార‌ణ‌మైంది. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.52 శాతం మేర ప‌త‌న‌మై బ్యారెల్‌కు 102 డాల‌ర్ల‌కు దిగి రాగా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.07 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 95 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. ఫారెక్స్ మార్కెట్‌లో వ‌రుస‌గా మూడో రోజు కూడా రూపాయి విలువ బ‌ల‌ప‌డింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.05 వద్ద ఉన్న భార‌త రూపాయి ఈ సెషన్‌లో 0.09 శాతం లాభ‌ప‌డింది.

Advertisement
Advertisement