త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Strait of Hormuz Cargo Ship Sinking | హార్మూజ్ జలసంధిలో మునిగిన కార్గో నౌక.. సముద్రంలో తేలియాడుతున్న ఐఫోన్లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు

హార్మూజ్ జలసంధిలో కార్గో నౌక మునిగిపోవడంతో వేలాది ఐఫోన్లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు సముద్రంలో తేలియాడాయి. స్థానికులు వాటిని ఏరుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.

J

Viral news | Published On Oct 15, 2026, 4.11 pm IST

Strait of Hormuz Cargo Ship Sinking | హార్మూజ్ జలసంధిలో మునిగిన కార్గో నౌక.. సముద్రంలో తేలియాడుతున్న ఐఫోన్లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు

సంక్షిప్త సారాంశం

దుబాయ్ నుంచి వస్తువులతో వెళ్తున్న సింగపూర్ ఫ్లాగ్ కలిగిన 'జీఎఫ్‌ఎస్ ప్రైడ్' (GFS Pride) కార్గో నౌక హార్మూజ్ జలసంధిలో ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఈ నౌకలో ఐఫోన్లు, లగ్జరీ పెర్ఫ్యూమ్ బాటిళ్లు ఉన్న దాదాపు 2,500 కంటైనర్లు ఉన్నట్లు సమాచారం. సముద్రంలో ఐఫోన్ బాక్సులు, పెర్ఫ్యూమ్ ప్యాకెట్లు తేలియాడుతుండగా.. చిన్న పడవలపై వచ్చిన స్థానికులు వాటిని ఏరుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నౌక ప్రమాదంలో 21 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రాంతంలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ వాణిజ్య నౌకలపై వరుస దాడి ఘటనలు కలకలం రేపుతున్నాయి.

Advertisement

Strait of Hormuz Cargo Ship Sinking | త్రినేత్ర న్యూస్ : ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో ఊహించని సముద్ర ప్రమాదం చోటుచేసుకుంది. విలువైన వస్తువులు, ఐఫోన్లు (iPhones), లగ్జరీ పెర్ఫ్యూమ్ బాటిళ్లతో వెళ్తున్న ఒక భారీ కార్గో నౌక సముద్రంలో మునిగిపోయింది. దీంతో అందులోని సరుకంతా నీటిపై తేలియాడగా, స్థానికులు వాటిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగింది?

సింగపూర్ ఫ్లాగ్‌తో ప్రయాణిస్తున్న 'జీఎఫ్‌ఎస్ ప్రైడ్' (GFS Pride) కంటైనర్ నౌక దుబాయ్ నుంచి వస్తువులను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ నౌకలో ఐఫోన్లు, ఖరీదైన పెర్ఫ్యూమ్ బాటిళ్లు, ఇతర విలువైన వస్తువులతో కూడిన దాదాపు 2,500 కంటైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నౌక సముద్ర గనిని (Naval mine) ఢీకొట్టడం వల్లే మునిగిపోయిందని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వెల్లడించింది. అయితే, అనధికారిక మార్గంలో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. మరోవైపు, అజ్ఞాత క్షిపణి లేదా ప్రక్షేపకం (Projectile) తగలడం వల్లే నౌక మునిగిపోయిందని మెరీటైమ్ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో నౌకలోని 21 మంది సిబ్బందిని సకాలంలో సురక్షితంగా రక్షించినట్లు సింగపూర్ సముద్ర, ఓడరేవు అధికార వర్గాలు వెల్లడించారు.

నీటిలో తేలియాడుతున్న ఐఫోన్లు.. వీడియో వైరల్

ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఐఫోన్ బాక్సులు, సీల్డ్ పెర్ఫ్యూమ్ ప్యాకెట్లు నీటిపై తేలియాడుతున్న దృశ్యాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. చిన్న పడవలపై (Small boats) సముద్రంలోకి వెళ్లిన స్థానికులు, మత్స్యకారులు ఆ ఖరీదైన వస్తువులను ఏరుకుంటున్న వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

ఉద్రిక్త  ప్రాంతంలో పెరుగుతున్న దాడులు

ఈ కార్గో నౌక మునిగిపోవడం వెనుక అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నట్లు తెలుస్తోంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో అమెరికా బలగాలు ఒక ఇరాన్ అనుబంధ నౌకను ధ్వంసం చేసిన రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్రపంచ చమురు, లిక్విడ్ నాచురల్ గ్యాస్ (LNG) రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మార్గంలో గత కొన్ని రోజులుగా వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులు, ప్రక్షేపకాల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇరాన్ పోర్టులపై అమెరికా ఆంక్షలు, దిగ్బంధానికి ప్రతిగా ఇరాన్ తన దాడులను ఉధృతం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

Advertisement
Advertisement