త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | రూ.6 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి.. స్టాక్ మార్కెట్ల‌లో వాట‌ర్ ఫాల్‌.. భారీగా అమ్మ‌కాలు..

Stock Markets | ప‌శ్చిమ ఆసియాలో రోజు రోజుకీ పెరుగుతున్న యుద్ధ తీవ్ర‌త‌కు తోడు పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌లు, అమెరికా ట్రెజ‌రీ బాండ్ ఈల్డ్స్ రాబ‌డి అధికంగా ఉండ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో ప్ర‌పంచ ఈక్విటీ మార్కెట్ల‌పై తీవ్ర ఒత్తిడి నెల‌కొంది. దీంతో సోమ‌వారం దాదాపు అన్ని దేశాల మార్కెట్లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి.

S

Business | Published On Sep 28, 2026, 3.56 pm IST

Stock Markets | రూ.6 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి.. స్టాక్ మార్కెట్ల‌లో వాట‌ర్ ఫాల్‌.. భారీగా అమ్మ‌కాలు..
Advertisement

Stock Markets | ప‌శ్చిమ ఆసియాలో రోజు రోజుకీ పెరుగుతున్న యుద్ధ తీవ్ర‌త‌కు తోడు పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌లు, అమెరికా ట్రెజ‌రీ బాండ్ ఈల్డ్స్ రాబ‌డి అధికంగా ఉండ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో ప్ర‌పంచ ఈక్విటీ మార్కెట్ల‌పై తీవ్ర ఒత్తిడి నెల‌కొంది. దీంతో సోమ‌వారం దాదాపు అన్ని దేశాల మార్కెట్లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. భార‌త ప్ర‌ధాన బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 ఒక్కోటి 1 శాతానికి పైగా న‌ష్ట‌పోయాయి. బ్యాంకింగ్ రంగం సూచీ నిఫ్టీ బ్యాంక్ ఏకంగా 2 శాతం ప‌త‌న‌మైంది. అన్ని రంగాల‌కు చెందిన సూచీలు భారీ న‌ష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1124.02 పాయింట్లు (1.52 శాతం) త‌గ్గి 72,771.72 వ‌ద్ద ముగియ‌గా, నిఫ్టీ 50 సూచీ 360.25 పాయింట్లు (1.56 శాతం) త‌గ్గి 22,780.25 వ‌ద్ద స్థిర‌ప‌డింది. మార్కెట్‌లో అస్థిర‌త‌ను సూచించే ఇండియా విక్స్ ఒక్క సెష‌న్‌లోనే ఏకంగా 11.84 శాతం మేర పెరిగింది. దీంతో పెట్టుబ‌డిదారుల‌పై తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంద‌ని, వారు ఆందోళ‌న‌కర స్థాయిలో అమ్మ‌కాల‌ను కొన‌సాగిస్తున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

ముడి చ‌మురు ధ‌ర‌లు పెరుగుతుండ‌డం మార్కెట్ల ప‌త‌నానికి ప్ర‌ధాన కార‌ణంగా నిలిచింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు సోమ‌వారం భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 3.18 శాతం వ‌ర‌కు పెరిగి బ్యారెల్‌కు 100 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 3.73 శాతం పెరిగి బ్యారెల్‌కు 99 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. ప‌శ్చిమ ఆసియాలో నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా చమురు స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంద‌నే ఆందోళ‌న రోజు రోజుకీ అధిక‌మ‌వుతోంది. దీంతో చ‌మురు ధ‌ర‌లు గ‌త కొన్ని వారాల నుంచి గ‌రిష్ట స్థాయిల్లోనే కొన‌సాగుతున్నాయి. ఇరాన్ తాజాగా ప్ర‌తిపాదించిన శాంతి చ‌ర్చ‌ల‌కు అమెరికా అంగీక‌రించ‌క‌పోవ‌డం ఆందోళ‌న‌ల‌ను మ‌రింత పెంచింది. మ‌రోవైపు అమెరికా ట్రెజ‌రీ బాండ్ ఈల్డ్స్ రాబ‌డులు పెరుగుతుండ‌డంతో ఆ దేశ క‌రెన్సీ బ‌ల‌ప‌డుతోంది. దీంతో ఇత‌ర దేశాల మార్కెట్ల‌పై తీవ్ర‌మైన ఒత్తిడి నెల‌కొంది. సోమ‌వారం ఆసియా దేశాల‌కు చెందిన సూచీలు సైతం భారీగా ప‌త‌న‌మ‌య్యాయి.

ప్ర‌పంచ మార్కెట్ల‌పై అమెరికా బాండ్ ఈల్డ్స్ ప్ర‌భావం..

జ‌పాన్ నిక్కీ225 సూచీ 1373 పాయింట్లు ప‌త‌న‌మ‌వ్వ‌గా, ద‌క్షిణ కొరియా కోస్పి సూచీ 191 పాయింట్లు న‌ష్ట‌పోయింది. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్‌200 సూచీ స్వ‌ల్పంగా త‌గ్గింది. యూకే 100, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ దేశాల‌కు చెందిన సూచీలు సైతం స్వ‌ల్ప న‌ష్టాల్లో కొన‌సాగాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మార్కెట్ల‌పై అమెరికా ట్రెజ‌రీ బాండ్ ఈల్డ్స్ అధికంగా ప్ర‌భావం చూపుతున్నాయి. వాటిల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్ట‌ర్లు ఆస‌క్తి చూపిస్తుండడంతో ఇత‌ర దేశాల మార్కెట్ల‌పై గ‌ణ‌నీయ‌మైన ప్ర‌భావం ప‌డుతోంది. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి మ‌రోమారు ప‌త‌నమైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.98 వ‌ద్ద ఉన్న రూపాయి ఈ సెష‌న్‌లో 0.19 శాతం న‌ష్ట‌పోయింది.

పెట్టుబ‌డిదారుల‌కు అల‌ర్ట్‌..

నిఫ్టీకి చెందిన అన్ని సూచీలు భారీ న‌ష్టాల్లోనే ముగిశాయి. ప్రారంభంలో నిఫ్టీ మీడియా కాస్త లాభాల్లో కొన‌సాగినా త‌రువాత అందులోనూ అమ్మ‌కాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి చెందిన నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీ ఏకంగా 3.24 శాతం మేర క్షీణించింది. అలాగే నిఫ్టీ రియాల్టీ 2.12 శాతం, నెక్ట్స్ 50 సూచీ 2.04 శాతం, ఎన‌ర్జీ 2 శాతం, నిఫ్టీ బ్యాంక్ 1.89 శాతం మేర ప‌త‌న‌మ‌య్యాయి. నిఫ్టీ ఐటీ సూచీ న‌ష్టాల్లో ముగిసిన‌ప్ప‌టికీ ఇత‌ర సూచీల‌తో పోలిస్తే అమ్మ‌కాలు కాస్త త‌క్కువ‌గా న‌మోద‌య్యాయి. అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య చోటు చేసుకుంటున్న తాజా ప‌రిణామాల‌తోపాటు, అమెరికా బాండ్ ఈల్డ్స్ ప్ర‌భావం వ‌ల్ల మార్కెట్లు ఇంత‌టి స్థాయిలో భారీగా ప‌త‌న‌మ‌వుతున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే సూచీలు కొత్త గ‌రిష్ట స్థాయిల‌ను న‌మోదు చేస్తూ స్థిరంగా ఉంటే త‌ప్ప పెట్టుబ‌డిదారులు ఇప్పుడ‌ప్పుడే పెట్టుబ‌డులు పెట్ట‌వ‌ద్ద‌ని హెచ్చ‌రిస్తున్నారు. కాగా సోమ‌వారం చోటు చేసుకున్న భారీ అమ్మ‌కాల నేప‌థ్యంలో ఇన్వెస్టర్లు ఒక్క రోజులోనే సుమారు రూ.6 ల‌క్ష‌ల కోట్లు న‌ష్ట‌పోయారు. మార్కెట్లలో తీవ్ర‌మైన అమ్మ‌కాల ఒత్తిడి నెలకొన్న నేప‌థ్యంలో పెట్టుబడిదారులు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement