త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్‌ల‌కు భారీ షాక్.. 700 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్..

Stock Markets | దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 24,000 మార్క్‌కు దిగువన ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్షియల్ షేర్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగడం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలపై ఆందోళనలు ఇన్వెస్టర్లను అప్రమత్తంగా ఉంచాయి.

S

Business | Published On Jul 22, 2026, 4.06 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్‌ల‌కు భారీ షాక్.. 700 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్..
Advertisement

Stock Markets | దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 24,000 మార్క్‌కు దిగువన ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్షియల్ షేర్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగడం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలపై ఆందోళనలు ఇన్వెస్టర్లను అప్రమత్తంగా ఉంచాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆటో షేర్లలో కొనుగోళ్లు కనిపించినప్పటికీ మార్కెట్ పతనాన్ని పూర్తిగా అడ్డుకోలేకపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 715.06 పాయింట్లు (0.92 శాతం) క్షీణించి 76,755.05 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో సూచీ గరిష్టంగా 77,384.95, కనిష్టంగా 76,641.19ను తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 191.45 పాయింట్లు (0.79 శాతం) పడిపోయి 23,996.25 వద్ద ముగిసింది. సెషన్‌లో ఒక దశలో నిఫ్టీ 23,961.40 వరకు పడిపోయి, చివరి గంటలో కొంత మేర నష్టాలను తగ్గించుకుంది.

బ్యాంకింగ్‌, ఫైనాన్షియ‌ల్ రంగాలపై ఒత్తిడి..

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల షేర్లు మార్కెట్‌ల‌పై అత్యధిక ఒత్తిడిని తీసుకొచ్చాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 1.29 శాతం, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1.23 శాతం క్షీణించాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 1.39 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.84 శాతం నష్టపోయాయి. ఐటీ షేర్లలో కూడా భారీ అమ్మకాలు నమోదయ్యాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.50 శాతం పడిపోయింది. మీడియా రంగంలో ఒత్తిడి కొనసాగడంతో నిఫ్టీ మీడియా ఇండెక్స్ 2.68 శాతం క్షీణించి రోజులో అత్యధికంగా నష్టపోయిన రంగంగా నిలిచింది. రియల్ ఎస్టేట్ రంగం బలహీనంగానే కొనసాగింది. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 2.63 శాతం పడిపోయింది. అమెరికా దిగుమతి చేసే జనరిక్ ఔషధాలపై టారిఫ్ రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన ఆందోళనలతో ఫార్మా షేర్లు కూడా ఒత్తిడిలోనే కొనసాగాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 1.31 శాతం, నిఫ్టీ హెల్త్‌కేర్ ఇండెక్స్ 1.19 శాతం క్షీణించాయి. అయితే వినియోగ వస్తు కంపెనీల్లో రక్షణాత్మక కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.65 శాతం లాభపడి రోజులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రంగంగా నిలిచింది. ప్రముఖ వినియోగ వస్తు కంపెనీల్లో కొనుగోళ్లు దీనికి మద్దతుగా నిలిచాయి.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

ఆటో రంగంలో కూడా స్వల్ప సానుకూలత కనిపించింది. వాహన తయారీ సంస్థల జూన్ త్రైమాసిక వ్యాపార అప్‌డేట్లపై ఆశావాదంతో నిఫ్టీ ఆటో ఇండెక్స్ 0.18 శాతం లాభపడింది. విస్తృత మార్కెట్ కూడా ఒత్తిడిని ఎదుర్కొంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.09 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.54 శాతం క్షీణించాయి. నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్ 400 ఇండెక్స్ 1.14 శాతం పడిపోవడం వల్ల బ్లూచిప్ షేర్లకే పరిమితం కాకుండా మార్కెట్ అంతటా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌ల‌లో చమురు ధ‌ర‌లు సైతం భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.30 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 90 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 3 శాతం మేర ఎగ‌బాకి బ్యారెల్‌కు 88 డాల‌ర్ల‌కు చేరుకుంది. ఫారెక్స్ మార్కెట్‌లోనూ ప్ర‌తికూల ఫ‌లితాలే వ‌చ్చాయి. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 96.56 వద్ద ఉన్న భార‌త రూపాయి సెష‌న్‌లో 34 పైస‌ల మేర న‌ష్ట‌పోయింది.

Advertisement
Advertisement