త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | ట్రాఫిక్ నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరో.. విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిరోధానికి కమిటీలు: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy | ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరోను (Traffic Bureau) ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పూర్తి అధ్యయనం అనంతరం ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ బ్యూరో సంస్థాగత నిర్మాణం చేపట్టాలన్నారు.

G

Telangana | Published On Jul 25, 2026, 6.43 am IST

Revanth Reddy | ట్రాఫిక్ నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరో.. విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిరోధానికి కమిటీలు: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరోను (Traffic Bureau) ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పూర్తి అధ్యయనం అనంతరం ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ బ్యూరో సంస్థాగత నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రతీ రెండు, మూడు నెలలకోసారి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించేలా విధి విధానాలు రూపొందించాలని తెలిపారు. ట్రాఫిక్ విషయంలో కేవలం నిబంధనలు విధించడం ఒక్కటే పరిష్కారం కాదని, క్రమబద్ధీకరణపై ఎక్కువ దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భధ్రత, మాదక ద్రవ్యాల నిరోధం, భద్రతపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా.. వాతావరణ మార్పులు, పనివేళలు, రద్దీ సమయాలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ముందే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన అధ్యయనం చేయాలని తెలిపారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు నిలిపి ఉంచడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగతున్నాయ‌ని, నియంత్రణ చర్యలు చేపట్టాలని వెల్ల‌డించారు. ఓఆర్ఆర్‌పై (ORR) ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో దగ్గర దగ్గరగా ఉన్న సిగ్నల్స్ వద్ద వాహనదారులు తరచూ ఆగి వెళ్లాల్సి వస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్న‌దని వెల్ల‌డించారు. నగరంలో సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకు వచ్చేందుకు అవసరమైనచోట అండర్ పాస్, ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాలు క‌దిలేలా చూడాలన్నారు. స్మార్ట్ సిగ్నలింగ్ (Smart Signals) వ్యవస్థను ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

డ్రగ్స్‌పై కఠినంగా

డ్రగ్స్ (Drugs) నిరోధంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిందని, వాటిపై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని చెప్పారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో (Education Institutions) డ్రగ్స్ నియంత్రణకు విద్యార్థుల నుంచి డిక్లరేషన్ తీసుకోవడంతోపాటు విద్యాసంస్థల యాజమాన్యాలను బాధ్యులను చేయాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సంబంధిత పాఠశాల, కళాశాలలకు సంబంధించిన ప్రన్సిపాళ్ల‌ను బాధ్యులను చేయాలని సూచించారు. క్యాంపస్ లోపల డ్రగ్స్‌కు సంబంధించి ఏ ఘటన జరిగినా సంబంధిత యాజమాన్యమే బాధ్యతవహించేలా నిబంధనలు తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. డ్రగ్స్ విషయంలో క్యాంపస్ బయట జరిగే యాక్టివిటీని గుర్తించి సమాచారాన్ని అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

విద్యాసంస్థలకు అధికారంతో పాటు బాధ్యతను కూడా అప్పగించాలన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్‌కు సంబంధించి సమాచారం అందించేందుకు విద్యాసంస్థల ఆవరణలో టోల్ ఫ్రీ నెంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. విద్యాసంస్థల్లో మూడు దశలుగా డ్రగ్స్ నిరోధానికి చర్యలు తీసుకోవాలన్నారు. మొదటగా డ్రగ్స్ తీసుకునే వారిని గుర్తించడం, అలాంటి వారిని గుర్తించి వారి డ్రగ్స్ అలవాటును మాన్పించాలన్నారు.

డ్రగ్స్ సరఫరా చేసేవారిని శిక్షించాలని ఆదేశించారు. మొదటిసారి డ్రగ్స్ తీసుకుని పట్టుబడితే అలాంటి వారిని డీ-అడిక్షన్ సెంటర్ కు తరలించాలని, తరచూ అలాగే పట్టుబడితే కఠినంగా శిక్షించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు అవసరమైతే కొత్త చట్టాన్ని రూపొందించే అంశాన్ని అధ్యయనం చేయాలన్నారు.

Advertisement
Advertisement