త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Stock Market | దలాల్ స్ట్రీట్‌లో రంకెలేసిన బుల్.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం

సెక్టార్ల పరంగా చూస్తే నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2 శాతం పెరగ్గా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2 శాతానికంటే ఎక్కువ పెరిగింది. రియాల్టీ, ఫార్మాస్యూటికల్స్, మీడియా, హెల్త్ కేర్, కంజ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు 1 శాతం కంటే ఎక్కువ లాభాలను గడించాయి.

J

Business | Published On Mar 5, 2026, 5.39 pm IST

Indian Stock Market | దలాల్ స్ట్రీట్‌లో రంకెలేసిన బుల్.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం
Advertisement

Indian Stock Market | త్రినేత్ర.న్యూస్ : గత వారం నుంచి భారత స్టాక్ మార్కెట్ నష్టాలను చవి చూస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28న ఇరాన్-ఇజ్రాయెల్ వార్ మొదలు కాగా, సోమవారం మార్కెట్లు ఓపెన్ అవ్వడమే భారీ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయ్యాయి. ఆ తర్వాతి రోజు హోలీ సెలవు కావడంతో బుధవారం మళ్లీ గ్యాప్ డౌన్‌తోనే మార్కెట్లు ఓపెన్ అయి నష్టాల్లోనే ముగిశాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ, బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ వందల పాయింట్లు కోల్పోయి బేర్‌మన్నాయి. ఆ రెండు మూడు రోజుల్లోనే ఇన్వెస్టర్లకు చెందిన కనీసం రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇది ఇలాగే కొనసాగితే భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో గురువారం ట్రేడింగ్ కాస్త ఊరటనిచ్చింది. ఓపెనింగే గ్యాప్ అప్ కావడం, ఆ తర్వాత రేంజ్ బౌండ్‌లో మార్కెట్ చిక్కుకున్నా.. సెకండ్ హాఫ్‌లొ షార్ట్ కవరింగ్ రావడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్ల సంపద ఎగబాకింది.

వరుసగా నాలుగు రోజుల నష్టాల తర్వాత

వరుసగా నాలుగు రోజుల నష్టాల తర్వాత గురువారం మార్కెట్లు కాస్త స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు లాభపడి 80,015 వద్ద ముగిసింది. నిఫ్టీ 285 పాయింట్ల లాభంతో 24,765 వద్ద ముగిసింది. దీంతో బీఎస్ఈ ఇండెక్స్‌లో లిస్టు అయిన కంపెనీల వాల్యూ రూ.6 లక్షల కోట్లు పెరిగింది. అంటే ప్రస్తుతం బీఎస్ఈ కంపెనీల మొత్తం వాల్యూ రూ.452.96 లక్షల కోట్లుగా ఉంది.

లాభపడిన స్టాక్స్ ఇవే

అదానీ పోర్ట్స్, ఎల్అండ్‌టీ, ఎన్‌టీపీసీ, రిలయెన్స్, బీఈఎల్, ఇండిగో కంపెనీలు లాభపడ్డాయి. 4.51 శాతం వరకు ఈ కంపెనీల స్టాక్స్ పెరిగాయి. మరోవైపు టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్ కంపెనీలు భారీగా నష్టపోయాయి. 1.30 శాతం వరకు నష్టపోయాయి.

సెక్టార్ల పరంగా చూస్తే నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2 శాతం పెరగ్గా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2 శాతానికంటే ఎక్కువ పెరిగింది. రియాల్టీ, ఫార్మాస్యూటికల్స్, మీడియా, హెల్త్ కేర్, కంజ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు 1 శాతం కంటే ఎక్కువ లాభాలను గడించాయి.

Advertisement
Advertisement