త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Investing In Overseas | విదేశీ మార్కెట్ల వైపు పెట్టుబ‌డిదారుల చూపులు.. భారీగా రాబ‌డులు వ‌స్తుండ‌డ‌మే కార‌ణం..

Investing In Overseas | దేశీయ స్టాక్ మార్కెట్లతో పోలిస్తే గ్లోబల్ మార్కెట్లలో వస్తున్న‌ అధిక రాబడులు ఇప్పుడు పెట్టుబడిదారులను కొత్త మార్గాల‌ వైపు మళ్లిస్తున్నాయి. దేశీయ పెట్టుబడులు ఇప్పటికే పెట్టి ఉన్న‌వారు అద‌నంగా పెట్టుబ‌డులు పెట్టేందుకు విదేశీ మార్కెట్ల వైపు చూస్తున్నారు. అమెరికా, చైనా, యూరప్, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఎలా పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తున్నారు.

S

Business | Published On Apr 20, 2026, 3.40 pm IST

Investing In Overseas | విదేశీ మార్కెట్ల వైపు పెట్టుబ‌డిదారుల చూపులు.. భారీగా రాబ‌డులు వ‌స్తుండ‌డ‌మే కార‌ణం..
Advertisement

Investing In Overseas | దేశీయ స్టాక్ మార్కెట్లతో పోలిస్తే గ్లోబల్ మార్కెట్లలో వస్తున్న‌ అధిక రాబడులు ఇప్పుడు పెట్టుబడిదారులను కొత్త మార్గాల‌ వైపు మళ్లిస్తున్నాయి. దేశీయ పెట్టుబడులు ఇప్పటికే పెట్టి ఉన్న‌వారు అద‌నంగా పెట్టుబ‌డులు పెట్టేందుకు విదేశీ మార్కెట్ల వైపు చూస్తున్నారు. అమెరికా, చైనా, యూరప్, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఎలా పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. గతేడాది కాలంలో భారత ఈక్విటీ మార్కెట్లు గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే తక్కువ ప్ర‌ద‌ర్శ‌న‌ చూపించాయి. ఏప్రిల్ 9, 2026 వరకు అమెరికా ఎస్ అండ్ పీ 500 సూచీ 29.55 శాతం రాబడిని ఇవ్వగా, హాంగ్ సెంగ్ ఇండెక్స్ 25.27 శాతం పెరిగింది. అలాగే అమెరికా డౌ జోన్స్ ఇండ‌స్ట్రియ‌ల్ యావ‌రేజ్ 21.70 శాతం మేర‌ లాభాలను నమోదు చేసింది. కానీ దేశీయ సూచీ నిఫ్టీ50 మాత్రం కేవలం 4.86 శాతం రాబడిని మాత్ర‌మే ఇచ్చింది. అలాగే నిఫ్టీ500 విస్తృత సూచీ కేవ‌లం 6.98 శాతం లాభం మాత్రమే అందించింది.

పోర్ట్ ఫోలియోలో 25 శాతం వ‌ర‌కు..

ఈ పరిస్థితుల్లో డైవర్సిఫికేషన్ (వివిధ మార్కెట్లలో పెట్టుబడి) మరింత కీలకమవుతోంది. స్టాట్‌లేన్ ఫౌండర్ కునాల్ వాలియా ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్ డైవర్సిఫికేషన్ ఒక అవసరంగా మారింద‌న్నారు. అధిక చమురు ధరలు, స్థిరమైన ద్రవ్యోల్బణం, భారత మార్కెట్లలో ఉన్న అధిక విలువలు ఈ అవసరాన్ని మరింత బలపరుస్తున్నాయని తెలిపారు. భారత్‌ దీర్ఘకాలికంగా మంచి వృద్ధి కలిగి ఉన్న‌ప్పటికీ, మొత్తం పెట్టుబడిని ఒకే మార్కెట్‌లో కేంద్రీకరించడం సరైన వ్యూహం కాదని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. వెల్తీ.ఇన్ సహ వ్యవస్థాపకుడు ఆదిత్య అగర్వాల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 5 శాతం నుంచి 25 శాతం వరకు గ్లోబల్ అసెట్స్ ఉండాలన్నారు. తక్కువ రిస్క్ తీసుకునే వారు 5-10 శాతం వరకు, మధ్యస్థ పెట్టుబడిదారులు 10-15 శాతం వరకు, అధిక రిస్క్ తీసుకునే వారు 15-25 శాతం వరకు విదేశీ పెట్టుబడులను పెట్ట‌వ‌చ్చ‌ని సూచించారు.

అమెరికాలో 40 శాతం..

విదేశీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఒకే దేశంపై ఆధారపడకుండా, విభిన్న ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలో 40 శాతం, యూరప్‌లో 25 శాతం, జపాన్‌లో 15 శాతం, భార‌త్ ను మినహాయించి ఇతర ఎమర్జింగ్ మార్కెట్లలో 20-25 శాతం పెట్టుబ‌డులు పెడితే మంచి రాబడులు వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అమెరికా మార్కెట్ ఇంకా చాలా మందికి ప్రధాన ఆకర్షణగా ఉంది. అధునాతన టెక్నాలజీ, బలమైన కంపెనీలు, భారీ క్యాపిటల్ మార్కెట్లు వంటి అంశాలు దీనికి కారణంగా చెప్ప‌వ‌చ్చు. అయితే అధిక విలువలు క‌లిగి ఉండ‌డం, టెక్ కంపెనీలపై అధికంగా ఆధారపడడం వంటి రిస్క్‌లు కూడా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా మార్కెట్ విషయంలో అవకాశాలు ఉన్నప్పటికీ, ఇది హై రిస్క్ మార్కెట్‌గా మారింది. తక్కువ విలువలు ఆకర్షణీయంగా ఉన్నా, ఆర్థిక సమస్యలు, పాలసీ అనిశ్చితి పెట్టుబడిదారులకు సవాళ్లుగా మారే అవ‌కాశాలు ఉంటాయి. యూరప్ మాత్రం తక్కువ విలువలు, రికవరీ అవకాశాల వల్ల ఆకర్షణీయంగా మారింది.

అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల‌లో..

ఇండియా, చైనాను మినహాయించి ఇతర ఎమర్జింగ్ మార్కెట్లలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. బ్రెజిల్, సౌదీ అరేబియా, ఆసియన్ దేశాల‌ వంటి మార్కెట్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయ‌ని, 2026లో అభివృద్ధి చెందుతున్న దేశాలు సుమారు 4.2 శాతం వృద్ధి సాధించే అవకాశముండగా, అభివృద్ధి చెందిన దేశాలు కేవలం 1.8 శాతం మాత్రమే వృద్ధి సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విదేశీ పెట్టుబడుల్లో పెట్టుబడిదారులు చేసే పెద్ద తప్పు దాన్ని తక్కువకాల ట్రేడింగ్‌గా చూడటం. నిపుణుల ప్రకారం, దీన్ని దీర్ఘకాలిక డైవర్సిఫికేషన్ టూల్‌గా చూడాలి. అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్ ఫీడర్ ఫండ్స్ లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్ట‌డం సులభమైన మార్గంగా ఉంటుంది. ఒకేసారి మొత్తాన్ని పెట్టుబ‌డి పెట్టకుండా, కొంతకాలం పాటు దశలవారీగా పెట్టుబడి పెట్ట‌డం ఉత్తమం.

డైవ‌ర్సిఫికేష‌న్ పెరగాలి..

విదేశీ మార్కెట్ల‌లో పెట్టుబడి పెట్టాల‌నుకుంటే, ఇటీవల ఎక్కువ రాబడి ఇచ్చిన మార్కెట్‌ల‌ను వెంటాడటం సరైన వ్యూహం కాదు. అలాగే భారత మార్కెట్లను పూర్తిగా వదిలేయడం కూడా క‌రెక్ట్ కాదు. భారత్ పెట్టుబ‌డిదారుల పోర్ట్‌ఫోలియోలో ప్రధానంగా ఉండాలి. అయితే 10-25 శాతం వరకు విదేశీ పెట్టుబడులను చేర్చడం ద్వారా డైవర్సిఫికేషన్ పెరిగి, దీర్ఘకాలికంగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఫండ్ ఆఫ్ ఫండ్స్‌లో భారీగా రాబడులు..

విదేశీ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు భార‌త పౌరుల‌కు ప‌లు బ్రోక‌రేజ్ సంస్థ‌లు అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. ఇండ్‌మ‌నీ వంటి ప్లాట్‌ఫామ్‌ల‌లో పెట్టుబ‌డిదారులు విదేశీ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు కొన‌సాగించ‌వ‌చ్చు. అయితే దేశీయంగా సెక్యూరిటీస్ సంస్థ‌లు కూడా ప‌లు విదేశీ ఫండ్స్‌ను నిర్వ‌హిస్తున్నాయి. వీటిని ఫండ్ ఆఫ్ ఫండ్స్ (FOFs)గా పిలుస్తారు. అంటే ఈ ఫండ్స్‌ను మేనేజ్ చేసే వారు నేరుగా స్టాక్స్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌రు. ఇత‌ర మ్యుచువ‌ల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌ల‌లో పెట్టుబ‌డులు పెడ‌తారు. ఇలా ఫండ్ ఆఫ్ ఫండ్స్ ప‌నిచేస్తాయి. అయితే విదేశీ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటే ప‌లు దేశీయ సెక్యూరిటీ సంస్థ‌లు ఇలాంటి ఫండ్స్‌నే పెట్టుబ‌డిదారుల‌కు ఆఫ‌ర్ చేస్తున్నాయి. వాటిల్లో చాలా వ‌ర‌కు ఫండ్స్‌లో ఏడాదికి స‌గ‌టు రాబ‌డి 40 శాతానికి పైగా ఉండ‌డం విశేషం. అందుక‌నే చాలా మంది విదేశీ పెట్టుబ‌డుల‌కు ఆక‌ర్షితుల‌వుతున్నారు.

ఉదాహ‌ర‌ణ‌లు..

యాక్సిస్ గ్రేట‌ర్ చైనా ఈక్విటీ ఎఫ్‌వోఎఫ్, ఈడిల్‌వెయిస్ ఎమ‌ర్జింగ్ మార్కెట్స్ అప్పార్చునిటీస్ ఈక్విటీ ఆఫ్‌షోర్ ఫండ్‌, కోట‌క్ గ్లోబ‌ల్ ఎమ‌ర్జింగ్ మార్కెట్ ఓవ‌ర్సీస్ ఈక్విటీ ఓమ్ని ఎఫ్‌వోఎఫ్, నిపాన్ ఇండియా జ‌పాన్ ఈక్విటీ ఫండ్‌, ఫ్రాంక్లిన్ ఏషియ‌న్ ఈక్విటీ ఫండ్‌, ఫ్రాంక్లిన్ యూఎస్ అప్పార్చునిటీస్ ఈక్విటీ యాక్టివ్ ఎఫ్‌వోఎఫ్ వంటివి ప‌లు ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్ప‌వ‌చ్చు. వీటిని బాగా ప‌రిశీలించి, పూర్తి వివ‌రాలు తెలుసుకుని లేదా ఆర్థిక నిపుణులను సంప్ర‌దంచి పెట్టుబ‌డులు పెడితే మంచి రాబ‌డుల‌ను పొంద‌వ‌చ్చు.

Advertisement
Advertisement