త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mutual Funds | యుద్ధం ఉన్నా.. మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబ‌డులు..

Mutual Funds | ప‌శ్చిమ ఆసియాలో యుద్ధం ప్ర‌భావం కార‌ణంగా గ‌త 40 రోజుల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా ప‌త‌నం అవుతున్నా మ్యుచువ‌ల్ ఫండ్‌లలో పెట్టుబ‌డులు మాత్రం ఆగ‌లేదు. మార్చి నెల‌లో ఈక్విటీ మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో ప్ర‌వాహాలు 8 నెల‌ల గ‌రిష్ట స్థాయికి చేరుకున్నాయి.

S

Business | Published On Apr 11, 2026, 2.13 pm IST

Mutual Funds | యుద్ధం ఉన్నా.. మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబ‌డులు..
Advertisement

Mutual Funds | ప‌శ్చిమ ఆసియాలో యుద్ధం ప్ర‌భావం కార‌ణంగా గ‌త 40 రోజుల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా ప‌త‌నం అవుతున్నా మ్యుచువ‌ల్ ఫండ్‌లలో పెట్టుబ‌డులు మాత్రం ఆగ‌లేదు. మార్చి నెల‌లో ఈక్విటీ మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో ప్ర‌వాహాలు 8 నెల‌ల గ‌రిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంత‌ర్జాతీయంగా ఉద్రిక్త‌త‌లు ఉన్న‌ప్ప‌టికీ మ్యుచువ‌ల్ ఫండ్స్ పెట్టుబ‌డిదారుల్లో మాత్రం దేశీయ స్టాక్ మార్కెట్ల ప‌ట్ల ఆశావ‌హ దృక్ప‌థం ఉంద‌ని ఆ ప్ర‌వాహాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. విదేశీ సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్లు (ఎఫ్ఐఐ)లు భారీ ఎత్తున నిధుల‌ను ఉప‌సంహరించుకుంటున్న నేపథ్యంలో మ్యుచువ‌ల్ ఫండ్స్ పెట్టుబ‌డులు ఆ ఉప‌సంహ‌ర‌ణ‌ల‌ను స‌మ‌తుల్యం చేస్తున్నాయి. కాగా సిస్ట‌మాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల (SIPs) ద్వారా వ‌చ్చే పెట్టుబ‌డులు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ మేర‌కు ఎక‌నామిక్ టైమ్స్ ఒక నివేదిక‌లో వెల్ల‌డించింది.

56 శాతం మేర పెరిగిన పెట్టుబ‌డులు..

మార్చిలో ఈక్విటీ మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో నిక‌రంగా పెట్టుబ‌డుల ప్ర‌వాహాలు 56 శాతం మేర పెరిగి 8 నెల‌ల గ‌రిష్ట స్థాయిని తాకాయి. గ‌త 5 ఏళ్ల‌లో అత్యంత భారీ స్థాయిలో స్టాక్ మార్కెట్ల‌లో నెల‌వారీ ప‌త‌నం చోటు చేసుకున్న‌ప్ప‌టికీ పెట్టుబ‌డిదారులు మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో త‌మ పెట్టుబ‌డులను య‌థాప్ర‌కారం కొన‌సాగించారు. గ‌డిచిన ఆర్థిక సంవ‌త్స‌రంలో విదేశీ పెట్టుబ‌డిదారులు భారీ ఎత్తున త‌మ నిధుల‌ను దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి వెన‌క్కి తీసుకున్నారు. అయితే మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు భారీ స్థాయిలో వ‌చ్చిన కార‌ణంగా విదేశీ పెట్టుబ‌డిదారుల నిధుల ఉప‌సంహ‌ర‌ణ‌ల ప్ర‌భావం మార్కెట్ల‌పై చాలా వ‌ర‌కు త‌గ్గింది. గ‌డిచిన 4 సంవ‌త్స‌రాల్లో విదేశీ పెట్టుబ‌డిదారులు మొత్తం 16 బిలియ‌న్ డాల‌ర్ల‌ను భార‌త స్టాక్ మార్కెట్ల నుంచి ఉప‌సంహ‌రించుకున్నారు.

గ‌ణాంకాల ప్ర‌కారం ఫిబ్ర‌వరిలో ఈక్విటీ మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో రూ.25,978 కోట్ల పెట్టుబ‌డులు రాగా మార్చిలో అవి రూ.40,450 కోట్ల‌కు పెరిగాయి. SIPల ద్వారా వ‌చ్చిన నిధులు ఫిబ్ర‌వ‌రిలో రూ.29,845 కోట్లు ఉండ‌గా, మార్చిలో ఇవి రూ.32,807 కోట్ల‌కు పెరిగి కొత్త రికార్డును సృష్టించాయి. మార్చి నెల‌తో క‌లిపి గ‌త 61 నెల‌ల నుంచి ఈక్విటీ మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డుల ప్ర‌వాహాలు కొన‌సాగుతూనే ఉన్నాయి.

గ‌తేడాది క‌న్నా 42 శాతం ఎక్కువ‌..

హెచ్‌డీఎఫ్‌సీ మ్యుచువల్ ఫండ్ సీఈవో నవ్‌నీత్ మునోత్ మాట్లాడుతూ భౌగోళిక‌ పరిణామాల వల్ల అస్థిరత పెరిగినా దేశీయ పెట్టుబడిదారులు తమ నమ్మకాన్ని కోల్పోకుండా పెట్టుబడులను కొనసాగిస్తున్నార‌ని తెలిపారు. శామ్‌కో మ్యూచువల్ ఫండ్ అధ్యయనం ప్రకారం మార్చిలో ఈక్విటీ ఆధారిత ఫండ్లలో ప్రవాహాలు గత ఏడాది సగటుతో పోలిస్తే 42 శాతం ఎక్కువగా ఉన్న‌ట్లు తేలింది. నికర ప్రవాహాలు రూ.28,586 కోట్లుగా నమోదయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 5 శాతం పడిపోవడంతో మార్కెట్ విలువలు తగ్గాయి. దీంతో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ మొత్తం AUM 10.4 శాతం తగ్గి రూ.73.48 లక్షల కోట్లకు చేరిందని పరిశ్రమ సంస్థ AMFI తెలిపింది.

ఫ్లెక్సీ-క్యాప్ విభాగంలో అధికంగా పెట్టుబ‌డులు..

ఈక్విటీ పథకాలలో ఫ్లెక్సీ-క్యాప్ విభాగం అత్యధికంగా రూ.10,052 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఇది ఫిబ్రవరిలో రూ.6,925 కోట్లతో పోలిస్తే గణనీయంగా పెర‌గ‌డం విశేషం. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌ కూడా వరుసగా రూ.6,064 కోట్లు, రూ.6,253 కోట్ల‌ను ఆకర్షించాయి. ఫిబ్రవరిలో ఇవి రూ.4,003 కోట్లు, రూ.3,881 కోట్లుగా ఉన్నాయి. డెట్‌ పథకాలలో మాత్రం నిధుల ఉపసంహరణలు నమోదయ్యాయి. కంపెనీలు తమ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల కోసం లిక్విడ్, ఓవర్‌నైట్, అల్ట్రా షార్ట్ ఫండ్ల నుంచి నిధులను తీసుకున్నాయి. వెల్త్ కంపెనీ మ్యుచువల్ ఫండ్ డెట్‌ విభాగం సీఏఐవో ఉమేష్ శర్మ మాట్లాడుతూ మార్చి నెలలో క్వార్టర్ ఎండ్, ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా ఈ తరహా ఉపసంహరణలు ప్రతి సంవత్సరం జరుగుతుంటాయ‌ని తెలిపారు.

జనవరి, ఫిబ్రవరిలో పెట్టుబడిదారుల ఆకర్షణగా నిలిచిన విలువైన లోహాల ధరలు తగ్గడంతో గోల్డ్ ETFలలో ప్రవాహాలు కూడా తగ్గాయి. ఫిబ్రవరిలో రూ.5,255 కోట్లుగా ఉన్న ప్రవాహాలు మార్చిలో రూ.2,266 కోట్లకు పడిపోయాయి. ఫ్యూచర్స్, ఆప్షన్స్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) పెంపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం, అలాగే డెట్‌ పెట్టుబడులపై పరిమితులు ఉండడం వల్ల ఈ ఉపసంహరణలు జరిగాయని భావిస్తున్నారు.

Advertisement
Advertisement