త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబ‌డిదారుల‌పై అమ్మ‌కాల ఒత్తిడి..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. భారీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 510 పాయింట్లు, నిఫ్టీ 147 పాయింట్లు పెరిగాయి. అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మరోవైపు ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లు రాణించగా, ఫార్మా, మెటల్, ఆటో రంగాలు నష్టాలను చవిచూశాయి.

S

Business | Published On Nov 16, 2026, 4.34 pm IST

Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబ‌డిదారుల‌పై అమ్మ‌కాల ఒత్తిడి..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. భారీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 510 పాయింట్లు, నిఫ్టీ 147 పాయింట్లు పెరిగాయి. అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మరోవైపు ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లు రాణించగా, ఫార్మా, మెటల్, ఆటో రంగాలు నష్టాలను చవిచూశాయి.

విస్తృత సూచీల్లో అమ్మ‌కాలు..

భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 510.40 పాయింట్లు (0.63 శాతం) పెరిగి 82,104.85 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 146.80 పాయింట్లు (0.58 శాతం) లాభపడి 25,291.10 వద్ద ముగిసింది. ప్రధాన సూచీలు లాభాల్లో ముగిసినప్పటికీ, విస్తృత మార్కెట్లో మాత్రం అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ ఒక శాతానికి పైగా పడిపోగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.7 శాతం నష్టపోయింది. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ.. మార్కెట్లు యుద్ధానికి ముందు స్థాయిలకు చేరువవుతున్న నేపథ్యంలో అధిక బాండ్ ఈల్డ్స్, డిసెంబరులో ప్రధాన కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను మరింత పెంచుతాయ‌న్న అంచనాలు సమీప కాలంలో మార్కెట్ పురోగతికి అడ్డంకిగా మారుతాయ‌ని తెలిపారు. అయితే ముడి చమురు ధరలు తగ్గడం కొంత ఊరటనిస్తోందని పేర్కొన్నారు. భారీ షేర్లు, బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్లు కొనసాగగా, లాభాల స్వీకరణ కారణంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు వెనుకబడ్డాయని వివరించారు.

భారీగా లాభ‌ప‌డ్డ ఎఫ్ఎంసీజీ షేర్లు..

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సూచీ 1.6 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలిచింది. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 0.56 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 0.37 శాతం, నిఫ్టీ మీడియా 0.38 శాతం లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఫార్మా 1.7 శాతం, నిఫ్టీ మెటల్ 1.6 శాతం, నిఫ్టీ ఆటో 1.53 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీ కూడా 0.3 శాతం తగ్గింది. పీఎల్ క్యాపిటల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్, అడ్వైజరీ అండ్ డీలింగ్ విక్రమ్ కసత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్లో అన్ని షేర్లలో కొనుగోళ్లు జరగడం లేదని, ఎంపిక చేసిన షేర్లలో మాత్రమే పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లు ప్రధాన సూచీలకు మద్దతునిస్తున్నప్పటికీ, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో కొనసాగుతున్న ఒత్తిడి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారనే సంకేతమని పేర్కొన్నారు.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 95 డాలర్ల సమీపంలో స్వల్పంగా తగ్గుముఖ ధోరణితో కొనసాగింది. కమోడిటీ మార్కెట్లో బంగారం ధరలు మరింత తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర 1.5 శాతం పడిపోయి 10 గ్రాములకు రూ.1,34,650కు చేరింది. వెండి ధర 3.72 శాతం క్షీణించి కిలోకు రూ.1,69,750కు తగ్గింది. ఆసియా మార్కెట్లలోనూ బలహీన ధోరణి కనిపించింది. జపాన్ నిక్కీ 225 సూచీ 2.47 శాతం నష్టపోయి 59,670 వద్ద ముగిసింది. సింగపూర్ స్ట్రెయిట్స్ టైమ్స్ 0.93 శాతం తగ్గి 5,183 వద్ద స్థిరపడింది. తైవాన్ వెయిటెడ్ సూచీ 6 శాతానికి పైగా పడిపోయి 41,040 వద్ద ముగియగా, దక్షిణ కొరియా కోస్పీ సూచీ 3.73 శాతం నష్టపోయింది.

Advertisement
Advertisement