త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Crude Oil | భార‌త్ వ‌ద్ద మ‌రో 2 వారాల‌కే చ‌మురు నిల్వ‌లు..? ర‌ష్యా నుంచి భారీ ఎత్తున కొనుగోళ్లు..?

Crude Oil | మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్ర‌పంచ‌ చమురు మార్కెట్లలో అస్థిరత తీవ్రరూపం దాల్చింది. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఘర్షణలు ఉధృతమవడం, హోర్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భారత్ అత్యవసర చమురు సరఫరా వ్యూహాన్ని అమలులోకి తీసుకువ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది.

S

Business | Published On Mar 3, 2026, 1.14 pm IST

Crude Oil | భార‌త్ వ‌ద్ద మ‌రో 2 వారాల‌కే చ‌మురు నిల్వ‌లు..? ర‌ష్యా నుంచి భారీ ఎత్తున కొనుగోళ్లు..?
Advertisement

Crude Oil | మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్ర‌పంచ‌ చమురు మార్కెట్లలో అస్థిరత తీవ్రరూపం దాల్చింది. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఘర్షణలు ఉధృతమవడం, హోర్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భారత్ అత్యవసర చమురు సరఫరా వ్యూహాన్ని అమలులోకి తీసుకువ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యన్ క్రూడ్ కొనుగోళ్లను తగ్గిస్తామని కేవలం నెల రోజుల క్రితం ప్రకటించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా నుంచి మరింత చమురు దిగుమతులను పరిగణన‌లోకి తీసుకునే అవకాశాన్ని భారత్ పరిశీలిస్తోంద‌ని స‌మాచారం.

కేంద్రం అత్య‌వ‌స‌ర చ‌ర్య‌లు..?

ఇరాన్ అధికారికంగా హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించ‌డంతోపాటు అక్కడ వెళ్లే విదేశీ నౌకలను పేల్చేస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గం మూసివేతతో గ్లోబల్ మార్కెట్లలో కలకలం రేగింది. కెప్ల‌ర్ డేటా ప్రకారం ప్రతిరోజూ సుమారు 2.5 నుంచి 2.7 మిలియన్ బారెల్స్ భారతదేశానికి వచ్చే చమురు హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అవుతోంది. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దేశంగా ఉంది. అయితే ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలను సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించే అవకాశం ఉంద‌ని తెలుస్తుండగా, ఎల్పీజీ సరఫరాలో రేషన్ విధానాన్ని కఠినతరం చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. అలాగే ప్రత్యామ్నాయ నౌకాశ్రయ మార్గాలను పరిశీలనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఓఎంసీల‌తో స‌మావేశాలు..

ముఖ్యంగా భవిష్యత్తు ఇంధన భద్రత కోసం రష్యా నుంచి మరింత‌గా క్రూడ్ కొనుగోళ్లు చేయడం ఒక ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భావిస్తున్న‌ట్లు తెలిసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో ఘర్షణలు మరింత ముదిరిన నేపథ్యంలో ఈ చర్యలు వేగవంతం కానున్నాయ‌ని స‌మాచారం. ఈ చర్యలను త్వరితగతిన అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మధ్యప్రాచ్య పరిస్థితులను సమీక్షిస్తూ సరఫరా-డిమాండ్ సమతుల్యత, ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలు, రష్యన్ క్రూడ్ కొనుగోళ్ల పెంపు వంటి అంశాలను విశ్లేషిస్తున్నాయి.

2 వారాల‌కే నిల్వ‌లు..

బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న వాణిజ్య, వ్యూహాత్మక చమురు నిల్వలు కేవలం రెండు వారాల వినియోగాన్ని మాత్రమే కవర్ చేయగలవని అంచనా. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే ప్రత్యామ్నాయ సరఫరా వనరులు అత్యవసరంగా అవసరం అవుతాయి. ప్రస్తుత పరిణామాలు భారత్ ఇంధన భద్రతకు కీలక పరీక్షగా మారాయి. పరిస్థితి ఎటువైపు దారితీస్తుందన్న విష‌యంపై ప్రభుత్వ చర్యలు ఆధారపడి ఉంటాయి. అయితే ప్ర‌స్తుతానికి ర‌ష్య‌న్ చ‌మురు కొనుగోళ్ల‌ను భారీ ఎత్తున పెంచే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement