త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Trade Deficit | ఎగుమతుల్లో రికార్డు.. భారత్ వాణిజ్య లోటు 39.88 బిలియన్ డాలర్లు..

India Trade Deficit | ఈ ఏడాది అక్టోబర్‌లో భారత వస్తు ఎగుమతులు గతేడాదితో పోలిస్తే 45 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 49.47 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే దిగుమతులు కూడా 16.5 శాతం పెరిగి 89.35 బిలియన్ డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు 39.88 బిలియన్ డాలర్లకు విస్తరించింది. ఆర్థికవేత్తలు అంచనా వేసిన 33.3 బిలియన్ డాలర్ల కంటే ఇది అధికం.

S

Business | Published On Nov 13, 2026, 4.50 pm IST

India Trade Deficit | ఎగుమతుల్లో రికార్డు.. భారత్ వాణిజ్య లోటు 39.88 బిలియన్ డాలర్లు..
Advertisement

India Trade Deficit | ఈ ఏడాది అక్టోబర్‌లో భారత వస్తు ఎగుమతులు గతేడాదితో పోలిస్తే 45 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 49.47 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే దిగుమతులు కూడా 16.5 శాతం పెరిగి 89.35 బిలియన్ డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు 39.88 బిలియన్ డాలర్లకు విస్తరించింది. ఆర్థికవేత్తలు అంచనా వేసిన 33.3 బిలియన్ డాలర్ల కంటే ఇది అధికం.

భారత వాణిజ్య రంగంలో అక్టోబర్ నెలలో ఎగుమతులు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వస్తు ఎగుమతులు గతేడాది ఇదే నెలతో పోలిస్తే 45 శాతం వృద్ధి చెంది 49.47 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది ఇప్పటివరకు ఒక నెలలో నమోదైన అత్యధిక ఎగుమతుల విలువ. అయితే దిగుమతులు 16.5 శాతం పెరిగి 89.35 బిలియన్ డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు అంచనాలను మించి 39.88 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వస్తు, సేవల ఎగుమతులు కలిపి మొత్తం 89.9 బిలియన్ డాలర్లకు చేరగా, సేవల ఎగుమతులు 40.51 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.

అనేక రంగాల్లో విస్త‌రించిన వృద్ధి..

ఎగుమతుల వృద్ధి అనేక రంగాలు, అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించిందని రాజేశ్ అగర్వాల్ తెలిపారు. భారత్‌కు చెందిన ప్రధాన 50 ఎగుమతి గమ్యస్థానాల్లో 43 దేశాల్లో సానుకూల వృద్ధి నమోదైంది. స్పెయిన్, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, హాంకాంగ్, మలేషియా, ఘనా, టర్కీ, ఒమన్, యూకే, మెక్సికో దేశాలకు ఎగుమతులు 50 శాతానికి పైగా పెరిగాయి. చైనా, జపాన్, అమెరికా దేశాలకు ఎగుమతులు 39 నుంచి 48 శాతం మధ్య వృద్ధి సాధించాయి. పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, రత్నాలు, ఆభరణాలు, ప్రాసెస్డ్ ఫుడ్, ఇంజినీరింగ్ వస్తువులు ఎగుమతుల పెరుగుదలకు ప్రధానంగా దోహదపడ్డాయి.

మరోవైపు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) కలిగిన దేశాలతోనూ భారత్ వాణిజ్యం మెరుగైన పనితీరు కనబరిచింది. పశ్చిమాసియా సంఘర్షణ కారణంగా మందగించిన మధ్యప్రాచ్య దేశాలతో వాణిజ్యం కూడా క్రమంగా కోలుకుంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్‌లో మధ్యప్రాచ్య ప్రాంతానికి భారత ఎగుమతులు 4 శాతం పెరిగినట్లు వాణిజ్య కార్యదర్శి వెల్లడించారు.

Advertisement
Advertisement