త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Life Insurance | రూ.1 కోటి బీమా తీసుకున్నాక వ్య‌క్తి మృతి.. చెల్లింపున‌కు సంస్థ నిరాక‌ర‌ణ‌.. త‌రువాత ఏమైంది..?

Life Insurance | ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన పవన్ పించా అనే వ్యక్తి రూ.కోటి జీవిత బీమా పాలసీ తీసుకున్న 15 నెలలకే గుండెపోటుతో మరణించాడు. ఇతర బీమా పాలసీల వివరాలు వెల్లడించలేదంటూ బీమా సంస్థ అత‌ని భార్యకు క్లెయిమ్ చెల్లించేందుకు నిరాకరించింది. అయితే వినియోగదారుల ఫోరం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టి, రూ.కోటి బీమా మొత్తంతోపాటు పరిహారం, న్యాయ ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది.

S

Business | Published On Nov 21, 2026, 3.11 pm IST

Life Insurance | రూ.1 కోటి బీమా తీసుకున్నాక వ్య‌క్తి మృతి.. చెల్లింపున‌కు సంస్థ నిరాక‌ర‌ణ‌.. త‌రువాత ఏమైంది..?
Advertisement

Life Insurance | ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన పవన్ పించా అనే వ్యక్తి రూ.కోటి జీవిత బీమా పాలసీ తీసుకున్న 15 నెలలకే గుండెపోటుతో మరణించాడు. ఇతర బీమా పాలసీల వివరాలు వెల్లడించలేదంటూ బీమా సంస్థ అత‌ని భార్యకు క్లెయిమ్ చెల్లించేందుకు నిరాకరించింది. అయితే వినియోగదారుల ఫోరం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టి, రూ.కోటి బీమా మొత్తంతోపాటు పరిహారం, న్యాయ ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది.

బీమా తీసుకున్న 15 నెల‌ల‌కు మృతి..

జీవిత బీమా తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని చాలామంది భావిస్తారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో బీమా సంస్థ క్లెయిమ్ తిరస్కరించడంతో బాధిత కుటుంబం న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేసిన పవన్ పించా 2018 సెప్టెంబర్ 10న 39 ఏళ్ల కాలపరిమితితో రూ.కోటి జీవిత బీమా పాలసీ తీసుకున్నాడు. దీనికి ఏడాదికి రూ.36,969.40 ప్రీమియం చెల్లించాల్సి ఉండగా, పాలసీ ప్రకారం పవన్‌కు రూ.కోటి, ఆయన భార్యకు అదనంగా రూ.50 లక్షల బీమా రక్షణ కల్పించారు. అయితే 2019 డిసెంబర్ 21న, పాలసీ తీసుకున్న 15 నెలలకే పవన్ ఆకస్మిక గుండెపోటుతో మరణించాడు.

వినియోగ‌దారుల ఫోరం ఏం చెప్పింది..?

భర్త మరణానంతరం నామినీగా ఉన్న అత‌ని భార్య చందా పించా బీమా క్లెయిమ్ కోసం సంస్థను సంప్రదించింది. అయితే పవన్ ఇతర బీమా సంస్థల వద్ద కూడా గణనీయమైన మొత్తాలకు జీవిత బీమా పాలసీలు తీసుకున్న విషయాన్ని వెల్లడించలేదని పేర్కొంటూ 2020 మార్చి 17న క్లెయిమ్‌ను తిరస్కరించింది. అలాగే వినియోగదారుల కమిషన్‌కు ఈ కేసును విచారించే పరిధి లేదని, బీమా ఏజెంట్‌ను కూడా కేసులో భాగస్వామిగా చేర్చాలని సంస్థ వాదించింది. ఈ నేపథ్యంలో అఫిడవిట్లు, వైద్య నివేదికలు, పాలసీ పత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అదనపు బెంచ్ ఈ వాదనలను తోసిపుచ్చింది. పాలసీ జారీ చేసే ముందే ఇతర బీమా వివరాలను పరిశీలించే అవకాశం సంస్థకు ఉన్నప్పటికీ, ప్రీమియం స్వీకరించి పాలసీ జారీ చేసిన తర్వాత క్లెయిమ్‌ను తిరస్కరించడం అన్యాయమని పేర్కొంది. ఇతర బీమా సంస్థలు పవన్‌కు సంబంధించిన కొన్ని పాలసీల క్లెయిమ్‌లను ఇప్పటికే చెల్లించిన విషయాన్ని కూడా కమిషన్ పరిగణనలోకి తీసుకుంది.

నవంబర్ 3న కమిషన్ అధ్యక్షుడు ప్రశాంత్ కుండు, సభ్యుడు ఆనంద్ వెర్గీస్‌లతో కూడిన బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. బీమా సంస్థ చందా పించాకు రూ.కోటి మరణ ప్రయోజనాన్ని చెల్లించడంతోపాటు, శారీరక, మానసిక ఇబ్బందులకు పరిహారంగా రూ.లక్ష, న్యాయ ఖర్చుల కింద మరో రూ.15 వేలు చెల్లించాలని ఆదేశించింది. మొత్తం చెల్లింపును 45 రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. గడువులోగా చెల్లించకపోతే మొత్తం బకాయి మొత్తంపై ఏడాదికి 7 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది.

Advertisement
Advertisement