Bhatti Vikramarka | పార్టీలో విభేదాలేం లేవ్.. ఊహాజనిత ప్రచారాలను పట్టిచ్చుకోం
Bhatti Vikramarka | కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఏమీ లేవని.. ఊహాజనిత ప్రచారాలను తాము పట్టిచ్చుకోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు.
- ప్రచార కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సందీప్‌కుమార్‌తో మాట్లాడినం
- ప్రజా సంపదను ప్రజలకే పంచుతున్నం
- కృష్ణా, గోదావరి జలాల వినియోగం కాంగ్రెస్ ప్రభుత్వాల ఘనతే
- బీఆర్ఎస్ అప్పులు చేసి పోయింది
- మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | త్రినేత్ర న్యూస్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఏమీ లేవని.. ఊహాజనిత ప్రచారాలను తాము పట్టిచ్చుకోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ప్రచార కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ బీఎం సందీప్‌కుమార్(Sandip Kumar)తో మాట్లాడామని చెప్పారు. ప్రజా సంపదను ప్రజలకే పంచుతున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాలను తెలంగాణకు వినియోగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలే కృషి చేశాయని నొక్కి చెప్పారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోమవారం సందీప్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఆదాయాన్ని, వనరులను దుర్వినియోగం చేయడంతో పాటు రాష్ట్రాన్ని రూ.8.20 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయాన్ని తిరిగి ప్రజలకే చేరవేస్తూ, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో సంపద, వనరులు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైతే, ప్రస్తుతం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు.
పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ ప్రచార కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సందీప్ కుమార్‌తో చర్చించినట్లు తెలిపారు. సంస్థాగత వ్యవహారాల్లో, యువజన కాంగ్రెస్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న సందీప్ కుమార్ సేవలు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడతాయని భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్గత విభేదాలపై ఊహాజనిత ప్రచారాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ పటిష్టంగా ఉందని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యాచరణతో ముందుకు సాగుతోందని చెప్పారు. ఏ సంస్థకైనా క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, అది కాంగ్రెస్ పార్టీకి సహజమైన అంతర్భాగమని పేర్కొన్నారు.
కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై బీఆర్‌ఎస్ నాయకత్వం కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని భట్టి మండిపడ్డారు. తెలంగాణకు నదీ జలాల ద్వారా అత్యధిక ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకున్నవి కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.
గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని విమర్శించారు.
స్వేచ్ఛ లేని జీవితం చూశారు
గత పదేళ్లలో తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, స్వేచ్ఛలేని జీవితాన్ని అనుభవించారని భట్టి అన్నారు. రాష్ట్రంలోని వనరులు దోపిడీకి గురికావడం, వ్యవస్థలు దెబ్బతినడం, ఆస్తులు ధ్వంసం కావడం వంటి పరిణామాలను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని పేర్కొన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశం ఇక్కడి వనరులు, ఆస్తులు, సంస్థలు తెలంగాణ ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలన్నదేనని వివరించారు. అయితే పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆదాయంతో పాటు భారీగా అప్పులు తెచ్చి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని విమర్శించారు.
ప్రతి గడపకు సంక్షేమ పథకం
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వివరించారు. రైతులకు రైతు భరోసా, కోటి ఆరు లక్షల కుటుంబాలకు వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ, 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 46 లక్షల కుటుంబాలకు చేయూత పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నామని, రోజువారీ అల్పాహారంతో పాటు వారంలో ఆరు రోజుల్లో రోజు విడిచి రోజు పాలు, రాగిజావ అందిస్తున్నామని చెప్పారు. 12 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు.
పేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఎనిమిది లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఏడాదికి రూ.10 లక్షల వరకు వైద్య సేవలు పొందేలా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
విద్య, మహిళా సాధికారతకు పెద్దపీట
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని భట్టి తెలిపారు. ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల వ్యయంతో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనాలు, విద్యా సదుపాయాలు, క్రీడలు, ఇతర పాఠ్యేతర కార్యకలాపాలకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 106 పాఠశాలలను మంజూరు చేశామని, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేలా మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నామని, ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా ఏటా రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందించడంతో పాటు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ కుటుంబ బీమా, చేయూత పింఛన్లు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఆరోగ్యశ్రీ, విద్య, గృహ నిర్మాణం వంటి పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజలు అందుకు సిద్ధంగా లేరు
రాష్ట్రానికి వచ్చే ఆదాయం, ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా సమకూరే నిధులను తిరిగి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో ఇంతకంటే ఎక్కువ ఆదాయం, అప్పులు ఉన్నప్పటికీ ప్రజలకు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచుతూ, పేద కుటుంబాల జీవన ప్రమాణాలను పెంచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత పదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పారు. ప్రజలు గత పాలనను, ప్రస్తుత ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకుంటున్నారని, గతంలో మాదిరిగా మళ్లీ రాష్ట్రాన్ని దోపిడీ పాలనలోకి నెట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Telangana Gold Man IT Raid | తెలంగాణ ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ కొరడా: రాయదుర్గంలో రూ.3.2 లక్షల అద్దె వచ్చే బినామీ భవనం అటాచ్
నవంబర్ 23, 2026

Etala Rajendar | రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు అమ్మనివ్వం.. అవి ప్రజావసరాలకే ఉండాలి
నవంబర్ 23, 2026

Review on Global Summit | గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చే ప్రతినిధులకు పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలి
నవంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Bandi Sanjay | మోదీ నిప్పులాంటోడు.. టచ్ చేస్తే మాడి మసైపోతావ్..
- ●Ayodhya To Janakpur | ఇక అయోధ్య నుంచి జనక్పూర్కి నేరుగా రైలు సర్వీసు.. కీలక వివరాలు ఇవే
- ●Shubman Gill | సలైవా వాడకంపై బ్యాన్ ఎత్తేయండి.. ఐసీసీకి గిల్ రిక్వెస్ట్..!
- ●Telangana Gold Man IT Raid | తెలంగాణ 'గోల్డ్ మ్యాన్' కేసులో ఐటీ శాఖ కొరడా: రాయదుర్గంలో రూ.3.2 లక్షల అద్దె వచ్చే బినామీ భవనం అటాచ్
- ●Motkupalli Narasimhulu | రేవంత్ రెడ్డికి దళితులంటే చులకన భావం : మోత్కుపల్లి నర్సింహులు
- ●Etala Rajendar | రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు అమ్మనివ్వం.. అవి ప్రజావసరాలకే ఉండాలి

Bandi Sanjay | మోదీ నిప్పులాంటోడు.. టచ్ చేస్తే మాడి మసైపోతావ్..

Ayodhya To Janakpur | ఇక అయోధ్య నుంచి జనక్పూర్కి నేరుగా రైలు సర్వీసు.. కీలక వివరాలు ఇవే

Shubman Gill | సలైవా వాడకంపై బ్యాన్ ఎత్తేయండి.. ఐసీసీకి గిల్ రిక్వెస్ట్..!

Telangana Gold Man IT Raid | తెలంగాణ 'గోల్డ్ మ్యాన్' కేసులో ఐటీ శాఖ కొరడా: రాయదుర్గంలో రూ.3.2 లక్షల అద్దె వచ్చే బినామీ భవనం అటాచ్



