త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HRA Tax Exemption | తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారా? వారికి అద్దె చెల్లించి పన్ను ఆదా చేసుకోవచ్చు!

HRA Tax Exemption | ఉద్యోగం చేస్తున్న నగరంలోనే తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నవారు వారికి నెలనెలా అద్దె చెల్లించడం ద్వారా హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే ఇందుకు ఆదాయపు పన్ను నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. కేవలం తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసినంత మాత్రాన పన్ను మినహాయింపు లభించదు.

S

Business | Published On Oct 31, 2026, 5.42 pm IST

HRA Tax Exemption | తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారా? వారికి అద్దె చెల్లించి పన్ను ఆదా చేసుకోవచ్చు!
Advertisement

HRA Tax Exemption | ఉద్యోగం చేస్తున్న నగరంలోనే తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నవారు వారికి నెలనెలా అద్దె చెల్లించడం ద్వారా హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే ఇందుకు ఆదాయపు పన్ను నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. కేవలం తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసినంత మాత్రాన పన్ను మినహాయింపు లభించదు.

అద్దె చెల్లిస్తూ ప‌న్ను ఆదా చేయ‌వ‌చ్చా..?

దేశంలో చాలామంది ఉద్యోగులు తాము పనిచేస్తున్న నగరంలోనే తల్లిదండ్రులతో కలిసి నివసిస్తుంటారు. అయితే తల్లిదండ్రులకు అద్దె చెల్లించడం ద్వారా పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉందనే విషయం చాలామందికి తెలియదు. కొన్ని నిర్దిష్ట నిబంధనలకు లోబడి తల్లిదండ్రుల సొంత ఇంట్లో నివసిస్తున్నప్పటికీ, వారికి అద్దె చెల్లించి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(13ఎ) ప్రకారం హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పొందవచ్చు. ఉదాహరణకు ఒక ఉద్యోగికి నెలకు రూ.15వేల జీతంతోపాటు హెచ్‌ఆర్‌ఏ వస్తోందని అనుకుందాం. అతను తన తండ్రికి చెందిన ఇంట్లో నివసిస్తూ నెలకు రూ.10వేలు అద్దె చెల్లిస్తుంటే, నిబంధనల ప్రకారం హెచ్‌ఆర్‌ఏ మినహాయింపును లెక్కించుకోవచ్చు. అయితే ఈ అద్దె చెల్లింపులు నిజమైనవై ఉండాలి. కేవలం పన్ను ఆదా కోసం తల్లిదండ్రులకు డబ్బులు బదిలీ చేసి దానిని అద్దెగా పేర్కొంటే సరిపోదు.

ఎలా చేయాలి..?

తల్లిదండ్రులకు అద్దె చెల్లించేటప్పుడు బ్యాంకు బదిలీ లేదా ఇతర ఆధారాలు ఉండే విధంగా చెల్లింపులు చేయాలి. ప్రతి నెలా అద్దె రసీదులు తీసుకోవాలి. వీలైతే చెల్లుబాటు అయ్యే అద్దె ఒప్పందాన్ని కూడా చేసుకోవాలి. అద్దెకు సంబంధించిన ఇల్లు నిజంగా తల్లిదండ్రుల యాజమాన్యంలో ఉండాలి. అలాగే తల్లిదండ్రులు పొందిన అద్దె ఆదాయాన్ని అవసరమైన మేరకు తమ ఆదాయపు పన్ను రిటర్నుల్లో వెల్లడించాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని (న్యూ ట్యాక్స్ రెజీమ్) ఎంచుకున్న ఉద్యోగులు హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పొందలేరు.

పన్ను ఆదా నిజంగా లాభదాయకమేనా?

తల్లిదండ్రులు తక్కువ పన్ను పరిధిలో ఉన్నప్పుడు ఈ విధానం ద్వారా కుటుంబం మొత్తం చెల్లించాల్సిన పన్ను భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఉద్యోగి చెల్లించిన అద్దె తల్లిదండ్రులకు ఆదాయంగా పరిగణించబడుతుంది. దానిపై వర్తించే నిబంధనల ప్రకారం వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప‌న్ను ప‌రిధిలోకి రాక‌పోతే ఐటీ రిట‌ర్న్‌లు దాఖ‌లు చేసినా ఎలాంటి ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఇలా ప‌న్ను ఆదా చేయ‌వ‌చ్చు. తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తూ వారికి నిజమైన అద్దె చెల్లించడం చట్టవిరుద్ధమైన పన్ను మినహాయింపు మార్గం కాదు. సరైన రికార్డులు నిర్వహిస్తూ, ఆదాయపు పన్ను నిబంధనలను పాటిస్తే కుటుంబ ఆర్థిక ప్రణాళికలో భాగంగా పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు.

ట్యాగ్స్:

House Rent AllowanceHRA Tax ExemptionIncome Tax IndiaRent To ParentsSection 10(13A)
Advertisement
Advertisement