త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్లు వ‌చ్చే వారం ఎలా ఉండ‌నున్నాయి..? విశ్లేష‌కులు ఏమంటున్నారు..?

Stock Markets | ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా ప్ర‌పంచ స్టాక్ మార్కెట్లు కుదేల‌వుతున్నాయి. వ‌రుస ట్రేడింగ్ సెష‌న్‌ల‌లో భారీ న‌ష్టాల‌ను న‌మోదు చేస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా భారీ న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. శుక్ర‌వారం ఒక్క రోజే సెన్సెక్స్‌, నిఫ్టీ50 ఏకంగా 2 శాతం చొప్పున ప‌త‌నం అయ్యాయి.

S

Business | Published On Mar 15, 2026, 11.51 am IST

Stock Markets | స్టాక్ మార్కెట్లు వ‌చ్చే వారం ఎలా ఉండ‌నున్నాయి..? విశ్లేష‌కులు ఏమంటున్నారు..?
Advertisement

Stock Markets | ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా ప్ర‌పంచ స్టాక్ మార్కెట్లు కుదేల‌వుతున్నాయి. వ‌రుస ట్రేడింగ్ సెష‌న్‌ల‌లో భారీ న‌ష్టాల‌ను న‌మోదు చేస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా భారీ న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. శుక్ర‌వారం ఒక్క రోజే సెన్సెక్స్‌, నిఫ్టీ50 ఏకంగా 2 శాతం చొప్పున ప‌త‌నం అయ్యాయి. సెన్సెక్స్ 1471 పాయింట్లు (1.93 శాతం) న‌ష్ట‌పోయి 74,563.92 వ‌ద్ద ముగియ‌గా, నిఫ్టీ50 488 పాయింట్లు (2.06 శాతం) ప‌త‌నం అయి 23,151.10 వ‌ద్ద ముగిసింది. బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.61 శాతం క్షీణించింది. బీఎస్ఈ 250 స్మాల్ క్యాప్ సూచీ 2.67 శాతం మేర ప‌త‌నం అయింది. యుద్ధం కార‌ణంగా మార్కెట్లు వ‌రుస‌గా మూడో వారంలోనూ భారీ న‌ష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఈ వారంలో 4,355 పాయింట్లు (5.5 శాతం) న‌ష్ట‌పోగా, నిఫ్టీ50 1300 పాయింట్లు (5.3 శాతం) ప‌త‌నం అయింది. అయితే వ‌చ్చే వారం కూడా ప‌రిస్థితి ఇలాగే ఉండ‌వ‌చ్చ‌ని మార్కెట్ విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

వ‌చ్చే వారం కూడా ప‌త‌నం అయ్యే చాన్స్‌..?

ఎన్‌రిచ్ మ‌నీ సీఈవో ఆర్‌.పొన్ముది దేశీయ స్టాక్ మార్కెట్ల‌పై నెల‌కొన్న భారీ అమ్మ‌కాల ఒత్తిడి గురించి మాట్లాడుతూ వ‌చ్చే వారం కూడా సూచీలు న‌ష్టాల్లో కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. ముఖ్యంగా వ‌చ్చే వారం ప‌లు ముఖ్య‌మైన నిర్ణ‌యాల‌ను అమెరికా ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్నందున ఆ ప్ర‌భావం దేశీయ మార్కెట్ల‌పై ప‌డుంద‌ని అంచ‌నా వేశారు. డాల‌ర్‌ను బ‌ల‌ప‌రిచే చ‌ర్య‌ల‌ను ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ ప్రారంభిస్తే విదేశీ సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్లు (ఎఫ్ఐఐ) త‌మ పెట్టుబడుల‌ను భార‌త మార్కెట్ల నుంచి మ‌రింత‌గా ఉప‌సంహ‌రించుకుంటార‌ని, దీంతో మార్కెట్లు మ‌రింత ప‌త‌నం అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని అన్నారు. అలాగే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియ‌ని ఆందోళ‌న ప‌రిస్థితి నెల‌కొన‌డం, ముడి చ‌మురులు ధ‌ర‌లు పెరుగుతుండ‌డం వంటి అంశాలు కూడా మార్కెట్‌ల ప‌త‌నానికి కార‌ణం అవుతాయ‌ని పేర్కొన్నారు.

నిఫ్టీ50 మ‌రింత దిగువ‌కు..?

ప్ర‌స్తుతం నిఫ్టీ 23,000 మార్క్‌కు చేరువ‌లో ఉంద‌ని, ఇంకా ప‌త‌నం అయితే 22,700 నుంచి 22,800 మ‌ధ్య మంచి డిమాండ్ జోన్ ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఆర్‌.పొన్ముది తెలిపారు. దీని వ‌ల్ల ఇన్వెస్ట‌ర్ల‌కు పెట్టుబ‌డి పెట్టే చాన్స్ రావ‌చ్చ‌ని అన్నారు. అయితే అది యుద్ధం ముగుస్తుందా, లేదా అన్న విష‌యంపై ఆధార ప‌డి ఉంటుంద‌న్నారు. ఇక నిఫ్టీ 50 మ‌రింత‌గా ప‌త‌నం అయితే 18,600 నుంచి 21,800 మ‌ధ్య ముఖ్య‌మైన స‌పోర్ట్ లెవ‌ల్స్ ఉన్నాయ‌ని, ఆ జోన్ నుంచి మ‌ళ్లీ మార్కెట్ పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ఇక ప్ర‌స్తుతానికి మీది వైపు 23,500 నుంచి 23,800 మ‌ధ్య నిఫ్టీ50 రెసిస్టెన్స్‌ను ఎదుర్కొంటుంద‌ని చెప్పారు. మూమెంట‌మ్ ఇండికేట‌ర్లు సైతం బ‌ల‌హీనంగా ఉన్నాయ‌ని, వ‌చ్చే వారం మార్కెట్ ప‌త‌నం అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అన్నారు.

బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్‌ల‌లో..

బ్యాంక్ నిఫ్టీ ప్ర‌స్తుతం 53,700 జోన్ వ‌ద్ద ఉంద‌ని, మ‌రింత ప‌త‌నం అయి 53,500 దిగువ‌కు చేరితే పెట్టుబ‌డిదారుల‌పై మ‌రింత అమ్మ‌కాల ఒత్తిడి పెరుగుతుంద‌ని పొన్ముది స్ప‌ష్టం చేశారు. 53,000 నుంచి 52,200 మ‌ధ్య స‌పోర్ట్ ఉంద‌ని, 54,700 రెసిస్టెన్స్ లెవ‌ల్ అని తెలిపారు. ఇక సెన్సెక్స్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం సూచీ 74,000 నుంచి 74,500 లెవ‌ల్స్‌ను టెస్ట్ చేస్తుంద‌ని అన్నారు. ఈ లెవ‌ల్‌కు కింద‌కు వెళితే సూచీ 73,500 త‌రువాత 73,000కు ప‌త‌నం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు. 75,600 వ‌ద్ద సెన్సెక్స్‌కు రెసిస్టెన్స్ ఉంద‌ని చెప్పారు.

Advertisement
Advertisement