త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold | బంగారంపై పెట్టుబ‌డి పెడితే వ‌చ్చే లాభాల‌కి ఎంత ప‌న్ను చెల్లించాలి..?

Gold | బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు (Gold ETF), సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) ప్రధాన పెట్టుబడి మార్గాలుగా ఉన్నాయి. ఈ ఉత్పత్తుల ద్వారా వచ్చే లాభాలపై పన్ను విధానం ఒక్కోటి ఒక్కోలా ఉంటుంది.

S

Business | Published On Mar 15, 2026, 10.28 am IST

Gold | బంగారంపై పెట్టుబ‌డి పెడితే వ‌చ్చే లాభాల‌కి ఎంత ప‌న్ను చెల్లించాలి..?
Advertisement

Gold | బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు (Gold ETF), సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) ప్రధాన పెట్టుబడి మార్గాలుగా ఉన్నాయి. ఈ ఉత్పత్తుల ద్వారా వచ్చే లాభాలపై పన్ను విధానం ఒక్కోటి ఒక్కోలా ఉంటుంది. పన్ను పరంగా చూస్తే ఈ బంగారు పెట్టుబడులను రెండు ప్రధాన వర్గాలుగా విభజించవచ్చు. మొదటి వర్గంలో బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు ఉంటాయి. రెండో వర్గంలో సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) ఉంటాయి. ఈ రెండు వర్గాల బంగారు పెట్టుబడులపై పన్ను ప్రభావాలు ఇలా ఉంటాయి.

భౌతిక బంగారం, గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌..

ఈ వర్గానికి చెందిన బంగారు పెట్టుబడులను ఆదాయపన్ను చట్టాల ప్రకారం క్యాపిటల్ అసెట్ గా పరిగణిస్తారు. కాబట్టి కొనుగోలు ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించినప్పుడు వచ్చే లాభాన్ని క్యాపిటల్ గెయిన్స్ కింద పన్ను విధిస్తారు. అయితే బంగారం వ్యాపారం చేసే జ్యువెలర్లు లేదా బులియన్ వ్యాపారులకు మాత్రం ఈ లాభాలు వ్యాపార లాభాలుగా పరిగణించబడతాయి. అయినప్పటికీ ఈ వ్యాపారులు వ్యక్తిగత పెట్టుబడిగా ఉంచుకున్న బంగారు ఆభరణాలు లేదా గోల్డ్ కాయిన్స్‌ను ఇతర పన్ను చెల్లింపుదారుల మాదిరిగానే క్యాపిటల్ అసెట్‌లుగా పరిగణిస్తారు. బంగారు పెట్టుబడులపై పన్ను రేటు వాటిని ఎంతకాలం ఉంచార‌న్నదానిపై ఆధారపడి ఉంటుంది. 24 నెలల తర్వాత విక్రయిస్తే ఆ లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలు (Long Term Capital Gains)గా పరిగణించి 12.50 శాతం స్థిర రేటుతో పన్ను విధిస్తారు. ఈ సందర్భంలో కొనుగోలు ధరపై ఖర్చు ద్రవ్యోల్బణ సూచిక (Cost Inflation Index) ప్రయోజనం వర్తించదు. అయితే 24 నెలల లోపు విక్రయిస్తే వాటిని స్వల్పకాలిక మూలధన లాభాలు (Short Term Capital Gains)గా పరిగణించి వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు.

చాలా మంది బంగారు ఆభరణాలను బహుమతిగా లేదా వారసత్వంగా పొందుతుంటారు. అలాంటి సందర్భాల్లో మూలధన లాభాలను లెక్కించేటప్పుడు ఆ ఆభరణాలను మొదట కొనుగోలు చేసిన వ్యక్తి చెల్లించిన ధరనే కొనుగోలు ఖర్చుగా పరిగణిస్తారు. వివాహ సందర్భంలో, నిర్దిష్ట బంధువుల నుంచి లేదా వారసత్వంగా పొందిన ఆభరణాల బహుమతులు అందుకున్న సమయంలో పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఇతర వ్యక్తుల నుంచి పొందిన బహుమతుల విషయంలో ఏడాది మొత్తంలో అన్ని రకాలుగా పొందిన బహుమతుల విలువ రూ.50వేల‌ లోపు ఉంటే మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకసారి ఆ మొత్తం రూ.50వేల‌ను మించితే ఆ సంవత్సరంలో అందుకున్న మొత్తం బహుమతుల విలువ పన్నుకు లోబడి ఉంటుంది.

బంధువుల నుంచి, వివాహ సందర్భంలో లేదా వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాలు అందుకున్న సమయంలో పన్ను లేకపోయినా, భవిష్యత్తులో వాటిని విక్రయించినప్పుడు మాత్రం మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక సందర్భాల్లో మూలధన లాభాల గణనలో హోల్డింగ్ పీరియడ్‌ను మొదట‌ కొనుగోలు చేసిన వ్యక్తి కొనుగోలు చేసిన తేదీ నుంచి లెక్కిస్తారు. గోల్డ్ సేవింగ్ ఫండ్‌లలో పెట్టుబడులు 24 నెలల తర్వాత దీర్ఘకాలిక పెట్టుబడులుగా మారుతాయి. అయితే గోల్డ్ ఈటీఎఫ్‌ల విషయంలో 12 నెలల తర్వాతే దీర్ఘకాలికంగా పరిగణిస్తారు. పన్ను రేట్లు, మినహాయింపులు కూడా ముందుగా పేర్కొన్న భౌతిక బంగారానికి వర్తించే విధంగానే ఉంటాయి.

సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB), గోల్డ్ డిపాజిట్ సర్టిఫికెట్లు (GDC)..

సావరిన్ గోల్డ్ బాండ్లపై ప్రభుత్వం చెల్లించే వడ్డీని ఆదాయంలో చేర్చి, అప్పుడు వర్తించే పన్ను స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు. అయితే ఈ బాండ్లను మెచూరిటీ సమయంలో రిడీమ్ చేసినప్పుడు వాటి విలువ పెరుగుదలపై వ్యక్తిగత పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇది మార్కెట్‌లో కొనుగోలు చేసినా లేదా ప్రారంభంగా సబ్‌స్క్రైబ్ చేసినా వర్తిస్తుంది. కానీ ఈ బాండ్లను ఓపెన్ మార్కెట్‌లో విక్రయిస్తే లాభాలు మూలధన లాభాలుగా పరిగణించబడతాయి. 12 నెలలలోపు విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాలు, 24 నెలల తర్వాత విక్రయిస్తే దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పన్ను విధిస్తారు. బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం సావరిన్ గోల్డ్ బాండ్లను ఎనిమిదేళ్ల గడువు పూర్తయ్యే సమయంలో రిడీమ్ చేసిన అసలు పెట్టుబడిదారులకు మాత్రమే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అంటే ఐదేళ్ల తర్వాత కానీ లేదా ఎనిమిదేళ్లకు ముందే రిడీమ్ చేస్తే అసలు సబ్‌స్క్రైబర్‌కు కూడా ఈ మినహాయింపు లభించదు.

పన్ను ఎలా తగ్గించుకోవచ్చు..

పైన పేర్కొన్న బంగారు పెట్టుబడుల్లో ఏదైనా విక్రయించి దీర్ఘకాలిక మూలధన లాభాలు పొందినట్లయితే, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఎఫ్‌ ప్రకారం మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఇందుకోసం విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని నిర్దిష్ట కాలంలో నివాస గృహాన్ని కొనుగోలు చేయడానికి పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ ఆ మొత్తాన్ని పెట్టుబడి పెట్టకపోతే మినహాయింపు కూడా అంతే శాతంగా తగ్గుతుంది. ఈ మినహాయింపు పొందాలంటే బంగారు పెట్టుబడిని విక్రయించిన తేదీ నాటికి వ్య‌క్తుల వ‌ద్ద‌ ఒకటి కంటే ఎక్కువ నివాస గృహాలు ఉండకూడదు.

Advertisement
Advertisement