త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SpaceX IPO | స్పేస్‌ఎక్స్ మాజీ వెల్డర్ దశ తిరిగింది.. రాత్రికి రాత్రే రూ.10 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడంటే!

కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓతో నాస్‌డాక్‌లో అడుగుపెట్టిన స్పేస్‌ఎక్స్ (SpaceX) తన ఉద్యోగులను కోటీశ్వరులను చేసింది. ఓ మాజీ వెల్డర్ దశ ఎలా తిరిగిందో చూడండి.

J

Business | Published On Jun 15, 2026, 1.00 am IST

SpaceX IPO | స్పేస్‌ఎక్స్ మాజీ వెల్డర్ దశ తిరిగింది.. రాత్రికి రాత్రే రూ.10 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడంటే!
Advertisement
  • 2015లో స్పేస్‌ఎక్స్‌ (SpaceX) లో చేరిన జువాన్ హెర్నాండెజ్ అనే వెల్డర్ ఐపీఓ పుణ్యమా అని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు
  • ఉద్యోగంలో చేరినప్పుడు కంపెనీ అతనికి సుమారు $10,000 (రూ.9.5 లక్షలు) విలువైన షేర్లను గ్రాంట్‌గా ఇచ్చింది
  • స్పేస్‌ఎక్స్ చరిత్రాత్మక ఐపీఓ (IPO) తర్వాత ఆయన వద్ద ఉన్న 6,500 షేర్ల విలువ ఇప్పుడు దాదాపు $1 మిలియన్ (రూ.9.95 కోట్లు) దాటింది
  • ఈ భారీ స్టాక్ మార్కెట్ డెబ్యూతో ఎలాన్ మస్క్ సంపదతో పాటు, సంస్థలోని వేలాది మంది ఉద్యోగులు కోటీశ్వరులుగా మారారు

SpaceX IPO | త్రినేత్ర.న్యూస్ : ఎలాన్ మస్క్ (Elon Musk) కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) కంపెనీ ఐపీఓ (IPO) మార్కెట్‌లో సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఇది కేవలం మస్క్ సంపదను మాత్రమే పెంచలేదు, ఆ కంపెనీ నమ్ముకున్న ఎంతోమంది సామాన్య ఉద్యోగుల జీవితాలను పూర్తిగా మార్చేసింది. 2015లో ఆ కంపెనీలో ఒక సాధారణ వెల్డర్‌గా చేరిన జువాన్ హెర్నాండెజ్ (Juan Hernandez) అనే వ్యక్తి.. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ (ESOPs) పుణ్యమా అని ఇప్పుడు ఏకంగా పది కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. ఈ స్ఫూర్తిదాయక కథనం కార్పొరేట్ ప్రపంచంలో 'స్టాక్ ఓనర్‌షిప్' (Stock ownership) సృష్టించే అద్భుతాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

సాధారణ కాంట్రాక్ట్ జాబ్ అనుకుంటే

సీబీఎస్ న్యూస్ (CBS News) కథనం ప్రకారం.. జువాన్ హెర్నాండెజ్ 2015లో తన స్నేహితుడి ద్వారా స్పేస్‌ఎక్స్‌లో వెల్డర్ ఉద్యోగం సంపాదించాడు. అప్పట్లో ఆ కంపెనీ భవిష్యత్తుపై అతనికి పెద్దగా అవగాహన లేదు. దీన్ని ఏదో ఒక సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగంగానే భావించాడు. చేరిన కొత్తలో కంపెనీ అతనికి దాదాపు $10,000 (సుమారు రూ. 9.5 లక్షలు) విలువైన స్టాక్ ఆప్షన్స్ (Stock options) ఇచ్చింది. గతంలో తాను చేసిన ఏ ఉద్యోగంలోనూ ఇలా షేర్లు ఇచ్చే అలవాటు లేకపోవడంతో, మొదట్లో ఆ ఆఫర్‌ను అతను పెద్దగా పట్టించుకోలేదు.

రూ.7.13 లక్షల కోట్ల ఐపీఓ సంచలనం

స్పేస్‌ఎక్స్ ఇటీవలే రికార్డు స్థాయిలో $75 బిలియన్ల (దాదాపు రూ. 7.13 లక్షల కోట్లు) ఐపీఓతో నాస్‌డాక్ (Nasdaq) మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో హెర్నాండెజ్ తలరాత ఒక్కసారిగా మారిపోయింది. దాదాపు పదేళ్ల పాటు స్పేస్‌ఎక్స్‌లో పనిచేసి, లాంచ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో సూపర్‌వైజర్ స్థాయికి ఎదిగిన ఆయన, ప్రస్తుతం బ్లూ ఆరిజిన్ (Blue Origin) సంస్థలో పనిచేస్తున్నాడు. కానీ, అతడి వద్ద ఇంకా 6,500 స్పేస్‌ఎక్స్ షేర్లు భద్రంగా ఉన్నాయి. మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కో షేరు ధర $160.95 (సుమారు రూ. 15,308) కు చేరుకోవడంతో, అతని షేర్ల మొత్తం విలువ ఇప్పుడు $1 మిలియన్‌ (రూ. 9.95 కోట్లు) కు చేరింది.

ఉద్యోగులకు షేర్లు ఇస్తే ఆ బాధ్యతే వేరు

కంపెనీ షేర్లు కలిగి ఉండటం వల్ల ఉద్యోగుల్లో విపరీతమైన బాధ్యత (Responsibility) పెరుగుతుందని, కంపెనీ విజయంతో వారు ప్రత్యక్షంగా మమేకమవుతారని హెర్నాండెజ్ తన అనుభవాన్ని పంచుకున్నాడు. అయితే, తనకు ఇంత భారీ సంపద వచ్చినా పని చేయడం ఆపనని ఆయన స్పష్టం చేశాడు. ఈ డబ్బుతో తన పిల్లలకు లాంగ్-టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ (Financial planning), ఇన్వెస్ట్‌మెంట్ (Investment) గురించి నేర్పిస్తానని చెప్పాడు. తన టీనేజ్ కూతురిని ఇప్పటికే స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తున్నాడు.

ఒక్క ఐపీఓ.. వేలాది మిలియనీర్లు

చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచిన ఈ స్పేస్‌ఎక్స్ డెబ్యూ ద్వారా.. సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే మిలియనీర్లుగా (Millionaires) మారారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సామాన్య కార్మికులు, వారి కుటుంబాలకు ఆర్థికంగా ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన కంపెనీకి హెర్నాండెజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

Advertisement
Advertisement