త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EPF | పెరిగిన పీఎఫ్ పరిమితితో ఖాతాపై ప్ర‌భావం.. లాభ‌మా, న‌ష్ట‌మా..?

EPF | ఉద్యోగుల భవిష్య నిధి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు రూ.15వేలుగా ఉన్న తప్పనిసరి పీఎఫ్ వేతన పరిమితిని రూ.25వేల‌కు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ 16న ఆమోదం తెలిపింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

S

Business | Published On Sep 26, 2026, 3.44 pm IST

EPF | పెరిగిన పీఎఫ్ పరిమితితో ఖాతాపై ప్ర‌భావం.. లాభ‌మా, న‌ష్ట‌మా..?
Advertisement

EPF | ఉద్యోగుల భవిష్య నిధి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు రూ.15వేలుగా ఉన్న తప్పనిసరి పీఎఫ్ వేతన పరిమితిని రూ.25వేల‌కు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ 16న ఆమోదం తెలిపింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2014 సెప్టెంబర్ తర్వాత పీఎఫ్ వేతన పరిమితిలో జరిగిన తొలి సవరణ ఇదే. సెప్టెంబర్ 17న కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పెంచిన పరిమితి అధికారికంగా అమల్లోకి వచ్చింది. దీంతో కొత్త పరిమితి వర్తించే ఉద్యోగుల పీఎఫ్ చందాలను లెక్కించే సమయంలో యజమానులు రూ.25వేల వేతన పరిమితిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పు వల్ల వ్య‌క్తిగ‌త పీఎఫ్ నిధిలో ఎంత పెరుగుదల వస్తుందో తెలుసుకోవాలంటే ప్రస్తుత వేతన నిర్మాణం, అలాగే పీఎఫ్‌కు ఎంత మొత్తంలో చందా చెల్లిస్తున్నారనే అంశాలను పరిశీలించాలి.

ఎవ‌రికి ప్ర‌యోజ‌నం..

గతంలో అమల్లో ఉన్న ఈపీఎఫ్ పరిమితి ప్రకారం ఉద్యోగి, యజమాని ఇద్దరి తప్పనిసరి నెలవారీ పీఎఫ్ చందా గరిష్ఠంగా రూ.1,800గా ఉండేది. రూ.15వేల వేతన పరిమితిలో 12 శాతం చొప్పున ఈ మొత్తం నిర్ణయిస్తారు. ఇప్పుడు ఈ పరిమితిని రూ.25వేలకు పెంచడంతో ఉద్యోగి, యజమాని ఇద్దరి గరిష్ఠ చట్టబద్ధ పీఎఫ్ చందా నెలకు రూ.3వేల‌కు చేరుతుంది. రూ.15వేల నుంచి రూ.25వేల మధ్య ప్రాథమిక వేతనం, డీఏ ఉన్న ఉద్యోగులకు పాత పరిమితికి బదులుగా అర్హత కలిగిన వాస్తవ వేతనంపై 12 శాతం చొప్పున చందా లెక్కిస్తారు. యజమానులతో కలిసి తమ పూర్తి ప్రాథమిక వేతనంపై ఈపీఎఫ్ చందాలు చెల్లించేందుకు ఇప్పటికే ఎంపిక చేసుకున్న ఉద్యోగులపై కొత్త పరిమితి పెద్దగా ప్రభావం చూపదు. ఉదాహరణకు ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ.40వేలుగా ఉండి, ఇప్పటికే మొత్తం అర్హత కలిగిన వేతనంపై 12 శాతం చొప్పున పీఎఫ్ చెల్లిస్తున్నట్లయితే, ఈ మార్పుతో ఆ ఉద్యోగి ఈపీఎఫ్ నిధి కూడబెట్టే వేగంలో పెద్దగా మార్పు ఉండదు. అయితే యజమాని చెల్లించే పీఎఫ్ చందా ఎలా విభజించబడుతుందనే విషయంలో మార్పు కనిపిస్తుంది.

లాభ‌మా, న‌ష్ట‌మా..

ఉద్యోగుల పెన్షన్ పథకం కింద యజమాని చెల్లించే పెన్షన్ వాటా గతంలో నెలకు రూ.1,250కు పరిమితమై ఉండేది. రూ.15వేల వేతన పరిమితిపై 8.33 శాతం ఆధారంగా ఈ మొత్తాన్ని నిర్ణయించారు. ఇప్పుడు వేతన పరిమితి రూ.25వేల‌కు పెరగడంతో నెలవారీ ఈపీఎస్ కేటాయింపు రూ.2,083 వరకు పెరుగుతుంది. అదే సమయంలో యజమాని చెల్లించే 12 శాతం పీఎఫ్ చందా విభజనలో కూడా మార్పు వస్తుంది. అందులో ఎక్కువ మొత్తం పెన్షన్ విభాగానికి కేటాయిస్తారు. మిగిలిన మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. ఆ మొత్తానికి వడ్డీ లభిస్తుంది. దీంతో పదవీ విరమణ కోసం కేటాయించే మొత్తం పెరిగే అవకాశం ఉంటుంది. అధిక ప్రాథమిక వేతనం పొందుతున్నప్పటికీ ఇప్పటివరకు నెలకు కేవలం రూ.1,800 పీఎఫ్ చందా మాత్రమే చెల్లిస్తున్న ఉద్యోగులకు కొత్త పరిమితి కింద పదవీ విరమణ నిధికి వెళ్లే మొత్తం పెరుగుతుంది. ఉద్యోగి చెల్లించే నెలవారీ పీఎఫ్ చందా రూ.1,200 వరకు పెరుగుతుంది. అదే సమయంలో యజమాని తరఫున కూడా సంబంధిత పెరుగుదల ఉంటుంది. అనేక సంవత్సరాల పాటు ఈ అదనపు చందాలు కొనసాగితే, ఈపీఎఫ్‌ఓ ప్రకటించే వడ్డీ పెరుగుతున్న నిల్వపై సమకూరుతూ ఉండడం వల్ల పదవీ విరమణ సమయంలో కూడే నిధి గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement