త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi New EV Policy | ఢిల్లీలో ఇక పెట్రోల్ టూవీల‌ర్లు, త్రీవీల‌ర్ల‌పై నిషేధం.. ఈవీల‌పై 100 శాతం ప‌న్ను మిన‌హాయింపు..

Delhi New EV Policy | ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి 2026-2030 కాలానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీని ప్రజల అభిప్రాయాల కోసం విడుదల చేసింది. ఈ ప్రతిపాదనల్లో 2028 నుంచి కొత్త పెట్రోల్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌ను నిషేధించడం, 2027 నుంచి త్రిచక్ర వాహనాలపై కూడా అదే నిబంధన అమలు చేయడం వంటి కీలక నిర్ణయాలు ఉన్నాయి.

S

Business | Published On Apr 11, 2026, 4.27 pm IST

Delhi New EV Policy | ఢిల్లీలో ఇక పెట్రోల్ టూవీల‌ర్లు, త్రీవీల‌ర్ల‌పై నిషేధం.. ఈవీల‌పై 100 శాతం ప‌న్ను మిన‌హాయింపు..
Advertisement

Delhi New EV Policy | ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి 2026-2030 కాలానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీని ప్రజల అభిప్రాయాల కోసం విడుదల చేసింది. ఈ ప్రతిపాదనల్లో 2028 నుంచి కొత్త పెట్రోల్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌ను నిషేధించడం, 2027 నుంచి త్రిచక్ర వాహనాలపై కూడా అదే నిబంధన అమలు చేయడం వంటి కీలక నిర్ణయాలు ఉన్నాయి. అదనంగా రూ.30 లక్షల వరకు ధర క‌లిగిన‌ ఎలక్ట్రిక్ కార్లకు 100 శాతం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపును కూడా ప్రతిపాదించారు. గాలి కాలుష్యాన్ని తగ్గించడం, స్వచ్ఛమైన రవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పాల‌సీని రూపొందించారు. ఈ డ్రాఫ్ట్ పాలసీని ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసి, 30 రోజుల పాటు ప్రజల అభిప్రాయాల కోసం అందుబాటులో ఉంచారు. ఈ గడువు పూర్తయ్యాక తుది పాలసీ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తారు. పాల‌సీకి అనుమ‌తిస్తే 2030 వరకు అమలు చేయ‌నున్నారు.

గాలి కాలుష్యాన్ని త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా..

డ్రాఫ్ట్ పాల‌సీ ప్రకారం ఢిల్లీలో గాలి కాలుష్యంలో సుమారు 23 శాతం వాహనాల నుంచి ఉద్గారాల వల్లే వస్తోంది. దీనిని తగ్గించడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. అలాగే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద స్వ‌చ్ఛ‌మైన‌ గాలి హక్కును దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా 2028 నుంచి ఢిల్లీలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసే అన్ని ద్విచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలే అయి ఉండాలి. అలాగే 2027 నుంచి త్రిచక్ర వాహనాలకూ ఇదే నిబంధన వర్తిస్తుంది. 2030 నాటికి కనీసం 30 శాతం స్కూల్ బస్సులు ఎలక్ట్రిక్ వాహనాలుగా మారాలని లక్ష్యంగా నిర్ణ‌యించారు. ప్రభుత్వ వాహనాలను కూడా దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రణాళికను ప్రతిపాదించారు.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై స‌బ్సిడీలు..

వినియోగదారులకు ఆకర్షణీయమైన సబ్సిడీలను కూడా ఈ డ్రాఫ్ట్‌లో చేర్చారు. రూ.2.25 లక్షల వరకు ధర ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై బ్యాటరీ సామర్థ్యానికి అనుసంధానంగా ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. మొదటి సంవత్సరంలో ప్రతి kWhకు రూ.10వేలు (గరిష్టంగా రూ.30వేల‌ వరకు), రెండో సంవత్సరంలో రూ.6,600 (గరిష్టంగా రూ.20వేల‌ వరకు), మూడో సంవత్సరంలో రూ.3,300 (గరిష్టంగా రూ.10వేల‌ వరకు) ప్రోత్సాహకాల‌ను ఇచ్చేందుకు ప్ర‌తిపాద‌న‌ల‌ను సిద్ధం చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలకు (ఈ-ఆటోలకు) మొదటి సంవత్సరం రూ.50వేలు, రెండో సంవత్సరం రూ.40వేలు, మూడో సంవత్సరం రూ.30వేల‌ ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఎలక్ట్రిక్ గూడ్స్ వాహనాల‌కు (ఎన్‌1 కేటగిరీ) మొదటి సంవత్సరం రూ.1 లక్ష, రెండో సంవత్సరం రూ.75వేలు, మూడో సంవత్సరం రూ.50వేల ప్రోత్సాహ‌కాల‌ను ఇవ్వ‌నున్నారు.

పాత వాహ‌నాల‌కు స్క్రాపింగ్ ప్రోత్సాహకాలు..

పాత వాహనాలను తొలగించేందుకు స్క్రాపింగ్ ప్రోత్సాహకాల‌ను కూడా ఇవ్వ‌నున్నారు. ద్విచక్ర వాహనాలకు రూ.10వేలు, త్రిచక్ర వాహనాలకు రూ.25వేలు, రూ.30 లక్షల వరకు ధర ఉన్న కార్లకు రూ.1 లక్ష, గూడ్స్ వాహనాలకు రూ.50వేల ప్రోత్సాహకాల‌ను ఇవ్వనున్నారు. రూ.30 లక్షల వరకు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు 2030 మార్చి 31 వరకు 100 శాతం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఈ ధరకు మించిన వాహనాలకు ఈ ప్రయోజనం ఉండదు. అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలకు 50 శాతం మినహాయింపును కూడా ప్రతిపాదించారు. కాగా ఢిల్లీ ప్ర‌జ‌లు ఈ పాల‌సీపై త‌మ అభిప్రాయాలను రెండు మార్గాల్లో తెలియ‌జేయ‌వ‌చ్చు. evpolicy2026@gmail.com అనే ఈ-మెయిల్‌కు మెయిల్ పంపించ‌వ‌చ్చు. లేదా జాయింట్ కమిషనర్ (EV), ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయానికి పోస్టు ద్వారా అభిప్రాయం పంపవచ్చు. ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజలను కార్యాలయాలకు వెళ్లవ‌ద్ద‌ని కోరింది. గుంపులు ఏర్పడే అవకాశాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 30 రోజుల గడువు తర్వాత వచ్చిన అభిప్రాయాల‌ను పరిగణనలోకి తీసుకోరు.

గ‌త ప్ర‌భుత్వం సబ్సిడీల‌ను ఇవ్వ‌లేదు: మంత్రి పంకజ్ కుమార్ సింగ్

ఢిల్లీ చాలా కాలంగా తీవ్రమైన గాలి కాలుష్య సమస్యతో స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఈ డ్రాఫ్ట్ పాలసీ స్వచ్ఛమైన రవాణా వ్యవస్థను ప్రోత్సహించి, శిలాజ‌ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించే పెద్ద ప్రయత్నంలో భాగంగా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా నగరంలో ఎక్కువగా ఉపయోగించే ద్విచ‌క్ర‌, త్రిచక్ర వాహనాలపై కఠిన నియంత్రణలు అమలు చేస్తే గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ గతంలో తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో ఒక లక్షకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయ‌ని తెలిపారు. గత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలు ఇవ్వలేదని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని అందిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ డ్రాఫ్ట్ పాలసీపై 30 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నారు. తుది రూపం దాల్చిన తర్వాత, వచ్చే నాలుగేళ్ల పాటు ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల దిశను ఈ విధానం నిర్దేశించనుంది.

Advertisement
Advertisement