త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Crude oil | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన క్రూడాయిల్‌ ధరలు

Crude oil | పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధిలో అనిశ్చితి కొనసాగుతుండటంతో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 2 శాతం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 107 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యూటీఐ 97.6 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సరఫరా భయాల నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

P

Business | Published On Apr 24, 2026, 1.30 pm IST

Crude oil | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన క్రూడాయిల్‌ ధరలు
Advertisement

Crude oil | పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. హార్ముజ్‌ జలసంధి విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు శుక్రవారం గణనీయంగా పెరిగాయి. ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు దాదాపు 2శాతం మేర ఎగబాకాయి. అమెరికా కాల్పుల విరమణను ప్రకటించినప్పటికీ పెట్టుబడిదారుల్లో ఆందోళనలు తగ్గకపోవడంతో మార్కెట్‌లో అస్థిరత కొనసాగుతోంది. దాంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 2శాతం పెరిగి 107 డాలర్లకు చేరుకుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) సైతం దాదాపు 2 శాతం ఎగబాకి బ్యారెల్‌కు 97.6 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో మాత్రం ఒత్తిడి కనిపించింది.

అక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు ఒకశాతం తగ్గి బ్యారెల్‌కు రూ.9,077 వద్దకు చేరాయి. దాదాపు రూ.100 వరకు పడిపోయింది. దీన్ని బట్టి చూస్తే చమురు ధరలు గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. గత వారం నుంచి బ్రెంట్ క్రూడ్ దాదాపు 18.83 శాతం పెరిగింది. అదే సమయంలో డబ్ల్యూటీఐ కూడా సుమారు 17 శాతం లాభపడింది. కమోడిటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం హార్ముజ్ ప్రాంతంలో సైనిక కార్యకలాపాలు, నౌకల రాకపోకలకు అంతరాయం కలుగుతుండడంతో చమురు సరఫరాపై ఆందోళన పెరుగుతోంది. ప్రపంచ చమురు వ్యాపారంలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుండడడంతో ఇక్కడి పరిస్థితులు నేరుగా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రస్తుతం చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. బ్రెంట్ ధరలు 110 డాలర్ల వరకు వెళ్లే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు. మరోవైపు ధరలు తగ్గితే 95 డాలర్ల వద్ద మద్దతు లభించవచ్చని, అది కూడా దాటితే 90 నుంచి 88.50 డాలర్లకు చేరవచ్చని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ఇరాన్‌తో యుద్ధం జరిగినా అణ్వాయుధాలను వినియోగించబోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సాధారణ సైనిక శక్తితోనే తాము గణనీయమైన నష్టం కలిగించగలమని స్పష్టం చేశారు. అయితే, హార్ముజ్‌ జలసంధి సమీపంలో ఇరాన్‌కు చెందిన చిన్న నౌకలను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్యలను మరింత తీవ్రతరం చేయాలని ఆయన ఆదేశించినట్లు పలు నివేదిక వెల్లడంచాయి. ఇక ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య కాల్పుల విరమణను మరో మూడు వారాలు పొడిగించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ప్రాంతీయ ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గాయన్న పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఈ పరిణామాల ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పైనా పడుతోంది. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు ఒకశాతం మేరకు పతనమయ్యాయి. ఐటీ, ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

Advertisement
Advertisement