త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG Crisis | చ‌మురు కంపెనీల‌పై భారం.. వినియోగ‌దారుల‌కు పెట్రోవాత త‌ప్ప‌దా..?

LPG Crisis | భౌగోళిక రాజ‌కీయ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో చ‌మురు ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర‌లు ఏకంగా రూ.993 పెరిగాయి. అయితే, డొమెస్టిక్ సిలిండ‌ర్ ధ‌ర‌తో పాటు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు వినియోగ‌దారుల‌కు ఊర‌ట‌నిచ్చాయి.

P

Business | Published On May 2, 2026, 7.34 pm IST

LPG Crisis | చ‌మురు కంపెనీల‌పై భారం.. వినియోగ‌దారుల‌కు పెట్రోవాత త‌ప్ప‌దా..?
Advertisement

LPG Crisis | భౌగోళిక రాజ‌కీయ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో చ‌మురు ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర‌లు ఏకంగా రూ.993 పెరిగాయి. అయితే, డొమెస్టిక్ సిలిండ‌ర్ ధ‌ర‌తో పాటు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు వినియోగ‌దారుల‌కు ఊర‌ట‌నిచ్చాయి. అయితే, వాస్త‌వ ప‌రిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. మార్కెట్‌లో పెట్రోలియం ఉత్పత్తుల వ్యయం పెరుగుతుండగా.. ఆయిల్ కంపెనీలపై భారం పెరుగుతూ వ‌స్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దేశీయ ధరల మధ్య వ్యత్యాసం పెరుగుతోంది.

ఆకాశాన్నంటుతున్న క్రూడాయిల్ ధ‌ర‌లు..

రేటింగ్ సంస్థ ఐసీఆర్‌ఏ (ICRA) అంచనాల ప్రకారం.. క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 120–125 డాల‌ర్ల మ‌ధ్య కొన‌సాగితే పెట్రోల్‌పై ఆయిల్ మార్కెటింగ్ మార్జిన్ సుమారు రూ.14, డీజిల్‌పై రూ.18 వ‌ర‌కు న‌ష్ట‌మ‌ని పేర్కొంది. అదే సమయంలో దేశీయ ఎల్పీజీపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న అండర్-రీకవరీ ఇదే స్థాయిలో కొనసాగితే.. 2026–27 ఆర్థిక సంవత్సరానికి దేశీయ ఎల్పీజీపై ఆయిల్ కంపెనీల న‌ష్టం సుమారు రూ.80వేల‌కోట్ల‌కు చేర‌వ‌చ్చ‌ని అంచ‌నా. ఇది ప్ర‌భుత్వానికి స‌వాల్‌గా మారుతోంద‌ని పేర్కొంది. 2026–27 బడ్జెట్‌లో ఎల్పీజీ సబ్సిడీకి కేవలం రూ.11,085 కోట్లు మాత్ర‌మే కేంద్రం కేటాయించింది. వంటగ్యాస్ కనెక్షన్ల కోసం రూ.9,200 కోట్లు, డీబీటీ కోసం రూ.1500కోట్లు కేటాయింపులు చేసింది.

కేంద్రంపై స‌బ్సిడీల భారం..

అండ‌ర్‌-రిక‌వ‌రీలు రూ.80వేల కోట్ల‌కు చేరితే.. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుతో పోలిస్తే భారం భారీగా పెరుగ‌నుంది. వినియోగ‌దారుల‌పై భారం ప‌డ‌కుండా ఉండేందుకు గ‌తంలో కేంద్రం ఆయిల్ కంపెనీల న‌ష్టాల‌ను భ‌ర్తీ చేసింది. గ‌తేడాది ఆగ‌స్టులో ఇండియ‌న్ ఆయిల్‌, భార‌త్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం సంస్థ‌ల‌కు క‌లిపి రూ.30వేల‌కోట్ల ప‌రిహారాన్ని కేంద్ర‌మంత్రి వ‌ర్గం ఆమోదించింది. ఐసీఆర్‌ఏ అంచనాల ప్రకారం.. 2026–27లో ఎరువుల సబ్సిడీలు రూ.2.05 లక్షల కోట్ల నుంచి రూ.2.25 లక్షల కోట్ల వరకు చేరవచ్చని భావిస్తున్నారు. బడ్జెట్‌లో మాత్రం రూ.1.71 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు. దాంతో ప్రభుత్వ వ్యయం, కంపెనీల లాభాలు, ప్రజలపై ధరల భారం అన్నీ ప్ర‌భావిత‌మ‌వుతున్నాయి.

కేంద్రానికి ఉన్న మార్గాలు..

మొన్న‌టి వ‌ర‌కు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌బోతున్నాయంటూ వ‌చ్చిన వార్త‌ల‌ను కేంద్రం తిర‌స్క‌రించింది. అయితే, అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్రం వైఖ‌రిలో మార్పులు వ‌చ్చాయి. అలాగే, ఎన్నిక‌ల నేప‌థ్యంలోనూ కేంద్రం ధ‌ర‌ల పెంపు వార్త‌ల‌ను తిర‌స్క‌రిస్తూ వ‌చ్చింది. తాజాగా ధ‌ర‌ల పెంపు అవ‌కాశాన్ని తోసిపుచ్చ‌లేమ‌ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. 2022 ఏప్రిల్ నుంచి రిటైల్ ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. అయితే, క్రూడ్ ఆయిల్ ధరలు ఇటీవల బ్యారెల్‌కు 126 వరకు చేరి చేరాయి. ప్ర‌స్తుతం కాస్త డిమాండ్ త‌గ్గిన 110 డాల‌ర్ల‌కుపైగానే కొన‌సాగుతోంది. ఢిల్లీలో పెట్రోల్ రూ.94.77, డీజిల్ రూ.87.67 వ‌ద్ద కొన‌సాగుతున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కేంద్రానికి మూడు ఆప్ష‌న్స్ ఉన్నాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో ఆయిల్ కంపెనీలు న‌ష్టాన్ని తామే భ‌రించ‌డం, బ‌డ్జెట్‌లో ప‌రిహారం ఇవ్వ‌డం, ధ‌ర‌ల‌ను ద‌శ‌ల‌వారీగా పెంచ‌డం. మొద‌టి ఆప్ష‌న్ కంపెనీల ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత బ‌ల‌హీన‌మ‌య్యే అవ‌కాశం ఉండ‌గా.. రెండోదాంతో ప్రభుత్వ ఆర్థిక భారాన్ని పెరుగ‌నుంది. మూడోదానితో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుల‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలున్నాయి.

Advertisement
Advertisement