త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Induction Cook Tops | ఎల్‌పీజీ స‌ర‌ఫ‌రా కొర‌త.. ఇండ‌క్ష‌న్ కుక్ టాప్ ల ఉత్ప‌త్తి భారీగా పెంపు..

Induction Cook Tops | మ‌ధ్య‌ప్రాచ్యంలో కొన‌సాగుతున్న యుద్ధం కార‌ణంగా భార‌త్‌లో ఎల్‌పీజీ స‌ర‌ఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఇప్ప‌టికే వాణిజ్య ఎల్‌పీజీ స‌ర‌ఫ‌రాలో చాలా వ‌ర‌కు కోత పెట్ట‌డంతో చిరు వ్యాపారులు, స్ట్రీట్ ఫుడ్స్‌, టిఫిన్ సెంట‌ర్ల‌తోపాటు పెద్ద హోట‌ల్స్, రెస్టారెంట్స్ కూడా త‌మ వ్యాపారాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి.

S

Business | Published On Apr 10, 2026, 5.07 pm IST

Induction Cook Tops | ఎల్‌పీజీ స‌ర‌ఫ‌రా కొర‌త.. ఇండ‌క్ష‌న్ కుక్ టాప్ ల ఉత్ప‌త్తి భారీగా పెంపు..
Advertisement

Induction Cook Tops | మ‌ధ్య‌ప్రాచ్యంలో కొన‌సాగుతున్న యుద్ధం కార‌ణంగా భార‌త్‌లో ఎల్‌పీజీ స‌ర‌ఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఇప్ప‌టికే వాణిజ్య ఎల్‌పీజీ స‌ర‌ఫ‌రాలో చాలా వ‌ర‌కు కోత పెట్ట‌డంతో చిరు వ్యాపారులు, స్ట్రీట్ ఫుడ్స్‌, టిఫిన్ సెంట‌ర్ల‌తోపాటు పెద్ద హోట‌ల్స్, రెస్టారెంట్స్ కూడా త‌మ వ్యాపారాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. ప్ర‌జ‌ల‌కు కూడా ఎల్‌పీజీ సిలిండ‌ర్లు చాలా ఆల‌స్యంగా డెలివ‌రీ అవుతున్న‌ట్లు ఫిర్యాదు చేస్తున్నారు. బుకింగ్ అవ‌ని వారు గ్యాస్ ఏజెన్సీల ఎదుట గంట‌ల త‌ర‌బ‌డి భారీ క్యూలలో సిలిండ‌ర్ల కోసం ప‌డిగాపులు కాస్తున్నారు. అయితే ఈ ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది. విద్యుత్ ద్వారా న‌డిచే ఇండ‌క్ష‌న్ స్ట‌వ్‌ల‌కు ఇప్ప‌టికే డిమాండ్ పెర‌గ్గా, వాటిపై వంట చేసుకునేందుకు ఉప‌యోగించే ఇండ‌క్ష‌న్ కుక్ టాప్‌ల‌తోపాటు విద్యుత్‌తో న‌డిచే ఎల‌క్ట్రిక్ కుక్క‌ర్‌లకు 30 నుంచి 40 శాతం మేర డిమాండ్ పెర‌గ‌నుంద‌ని అంచ‌నా వేస్తోంది. దీంతో అద‌నంగా 13 నుంచి 27 గిగావాట్ల విద్యుత్ అవ‌స‌రం అవుతుంద‌ని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

ఏడాదికి 1 కోటి అమ్మ‌కాలు..

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ మంత్రిత్వ‌శాఖ‌, విదేశీ వాణిజ్య డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ (DGFT), ప‌రిశ్ర‌మలు, అంత‌ర్జాతీయ వాణిజ్య ప్రోత్సాహ‌క శాఖ (DPIIT) ఇండక్ష‌న్ కుక్ టాప్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు కొన‌సాగిస్తున్నాయి. ఉత్పత్తి పెంపులో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌పై ఈ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. డిమాండ్ పెరుగుద‌ల నేప‌థ్యంలో ఇండ‌క్ష‌న్ కుక్ టాప్‌ల‌కు త‌ప్ప‌నిస‌రి స్టార్ లేబిలింగ్ అమ‌లును ప్ర‌భుత్వం ఈ ఏడాది జూలై 1 నుంచి 2027 జ‌న‌వ‌రి 1 వ‌ర‌కు వాయిదా వేసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు స‌మాచారం. దేశంలో ప్ర‌తి సంవ‌త్స‌రం సుమారుగా 1 కోటి ఇండ‌క్ష‌న్ కుక్ టాప్‌లు అమ్ముడ‌వుతున్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. కాగా వాటి ఉత్ప‌త్తిని ప్ర‌స్తుతం భారీగా పెంచనున్నార‌ని స‌మాచారం.

గృహాస‌రాల‌కు 100 శాతం పంపిణీ..

అమెరికా-ఇరాన్ యుద్ధం నేప‌థ్యంలో దేశంలో ఎల్‌పీజీ సంక్షోభం నెల‌కొంది. పెట్రోలియం, స‌హ‌జ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి సుజాత శ‌ర్మ ఇటీవ‌ల నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ప్ర‌స్తుత భౌగోళిక రాజ‌కీయ ప‌రిస్థితుల కార‌ణంగా ఎల్‌పీజీ స‌ర‌ఫ‌రాపై ఒత్తిడి పెరిగింద‌ని తెలిపారు. దేశ అవ‌స‌రాల్లో సుమారు 60 శాతం ఎల్‌పీజీ దిగుమ‌తుల‌పై ఆధార ప‌డుతుంద‌ని తెలిపారు. అయితే గృహ వినియోగ‌దారుల‌కే అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నామ‌ని, సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఎల్‌పీజీ 100 శాతం స‌ర‌ఫ‌రా అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. కాగా గృహావ‌స‌రాల‌కు ఎల్‌పీజీ స‌ర‌ఫ‌రాకు ఆటంకం లేకుండా ఉండేందుకు కేంద్ర ప్ర‌భుత్వం పంపిణీని ఇప్ప‌టికే పెంచింది. మార్చి 23 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 10 ల‌క్ష‌ల మేర 5 కిలోల ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌ను విక్ర‌యించిన‌ట్లు సుజాత శ‌ర్మ తెలిపారు. గృహాలు, చిరు వ్యాపారుల నుంచి స్థిర‌మైన డిమాండ్ కొన‌సాగుతుంద‌ని తెలిపారు.

గ్యాస్ స‌ర‌ఫ‌రా ఆగిపోలేదు..

దేశంలో ఏ గ్యాస్ ఏజెన్సీ నుంచి కూడా స‌ర‌ఫ‌రా పూర్తిగా ఆగిపోయింద‌ని స‌మాచారం రాలేద‌ని, అంతా స‌వ్యంగానే ఉంద‌ని సుజాత శ‌ర్మ తెలిపారు. ఇటీవ‌ల రోజువారీ ఎల్‌పీజీ స‌ర‌ఫ‌రాలో భాగంగా ఒక్క రోజే 51 ల‌క్ష‌లకు పైగా గృహాల‌కు ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌ను స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు వివ‌రించారు. సేవల సామర్థ్యం విషయంలో కూడా మెరుగుదల కొనసాగుతోందని ఆమె చెప్పారు. ఆన్‌లైన్ బుకింగ్ 98 శాతానికి చేరుకుంద‌ని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 92 శాతం స్థాయిలో ఉన్నాయ‌ని అన్నారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ పంపిణీ వ్యవస్థ పూర్తిగా కార్యాచరణలో ఉందని, డిమాండ్‌కు సమర్థవంతంగా స్పందిస్తోందని తెలిపారు.

Advertisement
Advertisement