త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Digital Gold | డిజిట‌ల్ గోల్డ్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చా..? సుర‌క్షిత‌మేనా..?

Digital Gold | డిజిటల్ యుగంలో పెట్టుబడుల రూపం కూడా వేగంగా మారుతోంది. ఒకప్పుడు బంగారం కొనాలంటే ఆభరణాల దుకాణాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, ఒక్క క్లిక్‌తో బంగారం కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. అదే డిజిటల్ గోల్డ్. రూ.10, రూ.100 లేదా రూ.1తో కూడా పెట్టుబడి పెట్టొచ్చని ప్రచారం చేస్తున్నారు.

S

Business | Published On Feb 15, 2026, 9.16 am IST

Digital Gold | డిజిట‌ల్ గోల్డ్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చా..? సుర‌క్షిత‌మేనా..?
Advertisement

Digital Gold | డిజిటల్ యుగంలో పెట్టుబడుల రూపం కూడా వేగంగా మారుతోంది. ఒకప్పుడు బంగారం కొనాలంటే ఆభరణాల దుకాణాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, ఒక్క క్లిక్‌తో బంగారం కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. అదే డిజిటల్ గోల్డ్. రూ.10, రూ.100 లేదా రూ.1తో కూడా పెట్టుబడి పెట్టొచ్చని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సౌలభ్యం వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటి? డిజిటల్ గోల్డ్ నిజంగా సురక్షితమైన పెట్టుబడేనా? ముఖ్యంగా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయడం ఎంతవరకు మంచిదనే ప్రశ్నలు ఇప్పుడు పెట్టుబడిదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. డిజిటల్ గోల్డ్ అంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల ద్వారా 24 క్యారెట్ల (99.9 శాతం స్వచ్ఛత) బంగారాన్ని కొనుగోలు చేయడమే. మీరు కొనుగోలు చేసిన బంగారం మీ పేరుపై భద్రత కలిగిన వాల్ట్‌లో నిల్వ ఉంటుంది. యాప్‌లో 0.5 గ్రాములు, 1 గ్రాము లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో కూడా కొనుగోలు చేసిన వివరాలు కనిపిస్తాయి. అవసరమైతే మార్కెట్ ధరకు విక్రయించుకోవచ్చు లేదా నాణేలు, బిస్కెట్ల రూపంలో భౌతికంగా డెలివరీ తీసుకోవచ్చు. దొంగతనం భయం లేకపోవడం, ఇంట్లో నిల్వ చేసుకునే తంటా లేకపోవడం వల్ల ఇది సులభమైన మార్గంగా కనిపిస్తోంది.

ప్ల‌స్ పాయింట్లు ఇవే..

డిజిటల్ గోల్డ్ వైపు చాలా మంది మొగ్గు చూపడానికి ప్రధాన కారణం తక్కువ మొత్తంతో ప్రారంభించగలగడం. ఒక్కసారిగా రూ.10వేలు లేదా రూ.20వేల‌ పెట్టుబడి పెట్టలేని వారు చిన్న మొత్తాలతో బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. అంతేకాదు ఎక్కువ ప్లాట్‌ఫాంలు 99.9 శాతం స్వచ్ఛతకు హామీ ఇస్తున్నాయి. భౌతిక బంగారంలో ఉండే కల్తీ భయం ఇక్కడ తక్కువనే భావన ఉంది. బంగారం ఇంట్లో కాకుండా ఇన్సూరెన్స్ ఉన్న వాల్ట్‌లో నిల్వ ఉండటం వల్ల భద్రతా ఆందోళన కూడా ఉండదు. అవసరం వచ్చిన వెంటనే యాప్‌లోనే విక్రయించి డబ్బును నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పొందే సౌలభ్యం కూడా దీనికి ప్లస్ పాయింట్ గా మారింది. అయితే డిజిటల్ గోల్డ్ అంత సులభంగా కనిపించినా, దానికి సంబంధించిన కొన్ని కీలక ప్రమాదాలను విస్మరించలేం. ముఖ్యంగా నియంత్రణ అంశం పెద్ద ప్రశ్నగా మారింది.

ఆర్‌బీఐ, సెబీ నియంత్ర‌ణ లేదు..

డిజిటల్ గోల్డ్‌ను ఇప్పటికీ పూర్తిగా ఆర్బీఐ లేదా సెబీ నియంత్రించడం లేదు. మీరు కొనుగోలు చేసే బంగారం ప్లాట్‌ఫాం, ట్రస్టీ సంస్థపై ఆధారపడి ఉంటుంది. ఆ సంస్థకు ఏదైనా సమస్య వస్తే, పెట్టుబడిదారుడికి చట్టపరమైన రక్షణ ఎంతవరకు ఉంటుందనే సందేహం ఉంది. మరొక ముఖ్యమైన అంశం స్ప్రెడ్. డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసి వెంటనే విక్రయిస్తే కొనుగోలు ధర, విక్రయ ధర మధ్య 3 నుంచి 6 శాతం వరకు తేడా ఉండొచ్చు. అంటే కొనగానే నష్టం మొదలయ్యే అవకాశం ఉంది. అలాగే డిజిటల్ గోల్డ్‌ను భౌతిక బంగారంగా మార్చాలంటే మేకింగ్ ఛార్జీలు, డెలివరీ ఛార్జీలు, పన్నులు వేరుగా చెల్లించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. అంతేకాదు, కొన్ని ప్లాట్‌ఫాంలు ఒక నిర్దిష్ట కాలం (ఉదాహరణకు 5 సంవత్సరాలు) తర్వాత డిజిటల్ రూపంలో ఉంచడానికి అనుమతించవు. అప్పటికి విక్రయించాలి లేదా భౌతికంగా తీసుకోవాల్సిందే.

క్రెడిట్ కార్డుతో డిజిట‌ల్ గోల్డ్ వ‌ద్దు..

క్రెడిట్ కార్డుతో డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయడం మరో ప్రమాదకర అంశం. రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ ఆశలో చాలా మంది ఇలా చేస్తున్నారు. కానీ కొన్ని బ్యాంకులు దీన్ని క్యాష్ అడ్వాన్స్ లావాదేవీగా పరిగణించే అవకాశం ఉంది. అలా అయితే అధిక వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజులు కూడా పడతాయి. బిల్లు పూర్తిగా, సమయానికి చెల్లించకపోతే ఏటా 30 నుంచి 40 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. అప్పుడు బంగారం పెట్టుబడితో వచ్చే లాభం మొత్తం వడ్డీలోనే కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. డిజిటల్ గోల్డ్ విషయంలో ఆర్బీఐ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. బ్యాంకులు, నియంత్రిత సంస్థలు డిజిటల్ గోల్డ్ విక్రయాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ ఆదేశించింది. కస్టమర్ల డబ్బు భద్రత, తప్పుదారి పట్టించే అమ్మకాలు జరగకుండా చూడడమే ఆర్బీఐ ఉద్దేశం.

సుర‌క్షిత‌మైన మార్గాలు ఇవే..

అయితే డిజిటల్ గోల్డ్‌ను పూర్తిగా తప్పించాల్సిందేనా అంటే.. అందుకు అవును లేదా కాదు అని స్ప‌ష్టంగా స‌మాధానం చెప్ప‌లేం. కానీ చిన్న మొత్తాల సేవింగ్స్ లేదా తక్కువ కాలపు ట్రేడింగ్ కోసం ఆలోచిస్తున్న వారు స్ప్రెడ్‌లు, ఛార్జీలను ముందే తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్లాట్‌ఫాం నమ్మకాన్ని పరిశీలించాలి. క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే ముందు నిబంధనలు పూర్తిగా చదవాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం మాత్రం సావ‌రిన్ గోల్డ్ బాండ్లు (SGBలు), గోల్డ్ ఈటీఎఫ్‌లు వంటి నియంత్రిత మార్గాలను పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక డిజిటల్ గోల్డ్ సౌకర్యవంతమైనదే అయినా, ప్రతి ఫీచర్ పెట్టుబడికి అనుకూలమని చెప్పలేం. రివార్డ్ పాయింట్ల కోసం అధిక వడ్డీ చెల్లించడం తెలివైన నిర్ణయం కాదు. బంగారం సాంప్రదాయంగా సురక్షిత పెట్టుబడిగా భావించబడినా, ఏ రూపంలో పెట్టుబడి పెట్టాలన్నది జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సురక్షిత మార్గం కావాలంటే ఎస్‌జీబీలు లేదా గోల్డ్ ఈటీఎఫ్‌లు మంచివ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement