త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Basmati Rice | ఇరాన్‌కు భార‌త్ బాస్మ‌తి బియ్యం ఎగుమ‌తుల‌పై తీవ్ర ప్ర‌భావం.. ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయిన కంటెయిన‌ర్లు..

Basmati Rice | ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తుండ‌డంతో ఆ ప్ర‌భావం అన్ని రంగాల‌పైనా ప‌డింది. ఇప్ప‌టికే ఇరాన్ త‌మ పొరుగు దేశాలైన సౌదీ, యూఏఈ, కువైట్‌ల‌పై కూడా బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. మ‌రోవైపు ఆయా గ‌ల్ఫ్ దేశాలు ఇరాన్ దాడుల‌ను తిప్పికొడుతున్నాయి.

S

Business | Published On Mar 3, 2026, 1.51 pm IST

Basmati Rice | ఇరాన్‌కు భార‌త్ బాస్మ‌తి బియ్యం ఎగుమ‌తుల‌పై తీవ్ర ప్ర‌భావం.. ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయిన కంటెయిన‌ర్లు..
Advertisement

Basmati Rice | ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తుండ‌డంతో ఆ ప్ర‌భావం అన్ని రంగాల‌పైనా ప‌డింది. ఇప్ప‌టికే ఇరాన్ త‌మ పొరుగు దేశాలైన సౌదీ, యూఏఈ, కువైట్‌ల‌పై కూడా బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. మ‌రోవైపు ఆయా గ‌ల్ఫ్ దేశాలు ఇరాన్ దాడుల‌ను తిప్పికొడుతున్నాయి. హోర్ముజ్ జ‌ల‌సంధి మూసివేత‌తో చ‌మురు స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డ‌గా ప్ర‌స్తుతం ఇరాన్‌కు భార‌త్ ఎగుమ‌తి చేస్తున్న బాస్మతి బియ్యం స‌ర‌ఫ‌రాపై కూడా యుద్ధం తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తోంది. సుమారుగా 1.50 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బాస్మతి బియ్యం ఇరాన్‌కు ర‌వాణా అవ‌నుండగా ఇప్పుడా బియ్యం ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. దీంతో రైతులు, ఎగుమ‌తిదారులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

హ‌ర్యానా నుంచి అధికంగా ఎగుమ‌తి..

యుద్ధం కార‌ణంగా బాస్మ‌తి బియ్యం ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గాయి. ట‌న్నుకు రూ.400 నుంచి రూ.500 మేర ధ‌ర‌లు ప‌త‌నం అయ్యాయి. ఇటీవ‌ల ఇరాన్‌కు చెందిన గ‌వ‌ర్న‌మెంట్ ట్రేడింగ్ కార్పొరేష‌న్ (జీటీసీ)తో బాస్మ‌తి బియ్యాన్ని ఎగుమ‌తి చేసేందుకు భార‌త్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని కార‌ణంగా 1.50 ల‌క్ష‌ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని భార‌త్ ఇరాన్‌కు ఎగుమ‌తి చేయాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే బాస్మ‌తి బియ్యం ధ‌ర‌లు కేజీకి రూ.4 నుంచి రూ.5 వ‌ర‌కు పెరిగాయి కూడా. అయితే ప్ర‌స్తుతం నెల‌కొన్న యుద్ధ వాతావ‌ర‌ణం కార‌ణంగా ప‌రిస్థితి రివ‌ర్స్ అయింది. బాస్మ‌తి బియ్యం ధ‌ర‌లు ప‌త‌నం అయ్యాయి. భార‌త్ నుంచి ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి అవుతున్న బాస్మ‌తి బియ్యంలో హ‌ర్యానా వాటా 40 శాతంగా ఉంది. ఈ రాష్ట్రంలోని కైతాల్‌, క‌ర్నాల్‌, కురుక్షేత్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రీమియం క్వాలిటీ బాస్మ‌తి బియ్యం ర‌కాలు ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి అవుతున్నాయి.

ఇరాన్‌కు ఎక్కువ‌గా స‌ర‌ఫ‌రా..

హ‌ర్యానా బాస్మ‌తి రైస్‌ను కొంటున్న దేశాల్లో ఇరాన్ మొద‌టి స్థానంలో ఉండ‌గా, ఇరాక్‌, సౌదీ అరేబియా ఆ త‌రువాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే యూరోపియ‌న్ దేశాల‌కు కూడా భారీ ఎత్తున భార‌త్ నుంచి బాస్మ‌తి బియ్యం స‌ర‌ఫ‌రా అవుతోంది. అయితే ఈ బియ్యాన్ని మాత్రం ఇరాన్ అధికంగా కొంటుండడం విశేషం. ఈ క్ర‌మంలోనే యుద్ధం కార‌ణంగా బాస్మ‌తి బియ్యం ఎగుమ‌తులు నిలిచిపోయాయి. హోర్ముజ్ జ‌ల‌సంధిని మూసివేయ‌డంతో అక్క‌డి నుంచి బియ్యం కూడా ర‌వాణా అవ‌డం లేదు. ఎక్క‌డిక్క‌డ బియ్యం కంటెయిన‌ర్లు నిలిచిపోయాయి. ఇదే విష‌యంపై భార‌త్‌కు చెందిన బియ్యం ఎగుమ‌తిదారు న‌రేంద‌ర్ మిగ్లాని మాట్లాడుతూ భార‌త్ నుంచి సుమారుగా 2 ల‌క్ష‌ల నుంచి 2.50 ల‌క్ష‌ల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమ‌తి చేయాల్సి ఉంద‌ని తెలిపారు. అందులో ఇరాన్‌కు ఎగుమతి చేయాల్సిన బియ్యం 1.50 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు ఉంద‌ని అన్నారు.

ఎగుమ‌తిదారులు, రైతుల‌కు భారీ ఎత్తున న‌ష్టం..?

చాలా వ‌ర‌కు బియ్యం ప్ర‌స్తుతం పోర్టుల్లోనే ఉంద‌ని, క్లియ‌రెన్స్ కోసం వేచి చూస్తున్నామ‌ని న‌రేంద‌ర్ మిగ్లాని తెలిపారు. కంటెయిన‌ర్లు ముందుకు క‌ద‌ల‌డం లేద‌ని, ఇరాన్‌లో ఉన్న డిమాండ్ దృష్ట్యా బియ్యాన్ని వేగంగా పంపించాల్సి ఉంద‌ని, కానీ నౌక‌లు ఎక్క‌డికక్క‌డ నిలిచిపోయాయ‌ని తెలిపారు. అయితే బియ్యం ఉన్న అనేక నౌక‌లు ఇప్పుడు అక్క‌డి పోర్టుల్లోనే నిలిచిపోయినందున యుద్ధం కార‌ణంగా ఏదైనా న‌ష్టం జ‌రిగితే దానికి ఇన్సూరెన్స్ క‌వ‌రేజి కూడా ఉండ‌ద‌ని తెలిపారు. ఆ మొత్తం న‌ష్టాన్ని ఎగుమ‌తిదారులే భ‌రించాల్సి ఉంటుంద‌ని, అదే జ‌రిగితే త‌మ‌కు తీవ్ర‌మైన న‌ష్టం వాటిల్లుతుంద‌ని, దీంతో రైతులు కూడా భారీ ఎత్తున న‌ష్ట‌పోతార‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంలో త‌మకు అండ‌గా నిల‌బ‌డాల‌ని, పోర్టుల్లో నిలిచిపోయిన కంటెయిన‌ర్లు ముందుకు క‌దిలేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

అయితే ప‌రిస్థితుల్లో మార్పు లేక‌పోతే భార‌త్‌లో బాస్మ‌తి బియ్యం మాత్ర‌మే కాకుండా ఇత‌ర బియ్యం ర‌కాల‌కు కూడా డిమాండ్ బాగా త‌గ్గి ధ‌ర‌లు భారీగా ప‌త‌నం అయ్యే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రించారు. దీర్ఘ‌కాలం యుద్ధం కొన‌సాగితే అది మ‌రింత ప్ర‌భావం చూపిస్తుంద‌ని, ధ‌ర‌లు ఇంకా ప‌డిపోయే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. కంటెయిన‌ర్ల‌కు న‌ష్టం వాటిల్లితే ఎగుమ‌తిదారులు, రైతులు తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement