త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీ లాభాల్లో ఆసియా మార్కెట్లు.. దేశీయ మార్కెట్ల‌కు నేడు సెల‌వు..

Stock Markets | ఆసియా మార్కెట్లు మంగ‌ళ‌వారం ట్రేడింగ్ సెష‌న్‌లో లాభాల‌తో కొన‌సాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మ‌ధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు మెరుగు ప‌డ‌డంతో మార్కెట్ల‌లో పాజిటివ్ వాతావ‌ర‌ణం క‌నిపించింది. అయితే హోర్ముజ్ జ‌ల‌సంధి గుండా ఇరాన్‌కు సంబంధించిన ర‌వాణాను అమెరికా అడ్డుకుంటోంది.

S

Business | Published On Apr 14, 2026, 10.07 am IST

Stock Markets | భారీ లాభాల్లో ఆసియా మార్కెట్లు.. దేశీయ మార్కెట్ల‌కు నేడు సెల‌వు..
Advertisement

Stock Markets | ఆసియా మార్కెట్లు మంగ‌ళ‌వారం ట్రేడింగ్ సెష‌న్‌లో లాభాల‌తో కొన‌సాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మ‌ధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు మెరుగు ప‌డ‌డంతో మార్కెట్ల‌లో పాజిటివ్ వాతావ‌ర‌ణం క‌నిపించింది. అయితే హోర్ముజ్ జ‌ల‌సంధి గుండా ఇరాన్‌కు సంబంధించిన ర‌వాణాను అమెరికా అడ్డుకుంటోంది. అయిన‌ప్ప‌టికీ ఇరాన్ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని పెట్టుబ‌డిదారులు ఆశావ‌హ దృక్ఫ‌థంతో ఉన్నారు. దీంతో మార్కెట్లు లాభాల్లో కొన‌సాగుతున్నాయి. అయితే మంగ‌ళ‌వారం ఏప్రిల్ 14న అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా భార‌త స్టాక్ మార్కెట్ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. కానీ సాయంత్రం 5 గంట‌ల‌కు క‌మోడిటీ మార్కెట్లు య‌థాప్ర‌కారం ప్రారంభం కానున్నాయి.

భారీ లాభాల్లో ట్రేడ‌వుతున్న ఆసియా మార్కెట్లు..

అమెరికా-ఇరాన్ ఒప్పందంపై ఆశ‌లు చిగురిస్తున్న నేప‌థ్యంలో జ‌పాన్ నిక్కీ225 సూచీ, ద‌క్షిణ కొరియా కోస్పి సూచీ 2 శాతం క‌న్నా ఎక్కువ‌గా పైకి ఎగ‌బాకాయి. ఆసియా-ప‌సిఫిక్ షేర్ల‌కు సంబంధించిన MSCI విస్తృత సూచీ 1 శాతం పెరుగుద‌ల‌ను న‌మోదు చేసింది. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ, ఏఎస్ఎక్స్‌200 సూచీ 0.88 శాతం పెర‌గ్గా, హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ ఇండెక్స్ ఫ్యూచ‌ర్స్ భారీగా లాభ‌ప‌డ్డాయి. క్రితం సెష‌న్ ముగింపులో ఈ ఫ్యూచ‌ర్స్ 25,660 వ‌ద్ద స్థిర‌ప‌డ‌గా ప్ర‌స్తుతం 25,924కి పైన ట్రేడ్ అవుతున్నాయి.

యుద్ధం ముగుస్తుంద‌ని పెట్టుబ‌డిదారుల ఆశ‌లు..

అమెరికా-ఇరాన్ యుద్ధ విర‌మ‌ణ చ‌ర్చ‌లు విఫ‌లం అయిన‌ప్ప‌టికీ ఇరు దేశాలు యుద్ధానికి ముగింపు ప‌లికే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని పెట్టుబ‌డిదారులు భావిస్తున్నారు. దీంతో అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ర్యాలీ చోటు చేసుకుంది. ఇరాన్ శాంతి చ‌ర్చ‌ల కోసం త‌మ‌ను సంప్ర‌దించింద‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోమారు ప్ర‌క‌టించారు. ఇది కూడా మార్కెట్ల పెరుగుద‌ల‌కు కార‌ణ‌మైంది. అయితే ట్రంప్ ఆ ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టికీ అమెరికా మాత్రం హోర్ముజ్ జ‌ల‌సంధిపై నౌకాద‌ళ నిర్బంధాన్ని కొన‌సాగిస్తోంది. ట్రంప్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై ఇరాన్ ఇంకా స్పందించ‌క‌పోయినా పెట్టుబ‌డిదారులు ఈ విష‌యం ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉన్నారు. అయితే ఒక‌టి రెండు రోజుల్లో ఈ విష‌యాల‌పై స్ప‌ష్ట‌త రాక‌పోతే మాత్రం పెట్టుబ‌డిదారుల్లో మ‌ళ్లీ ఆందోళ‌న పెర‌గ‌డం ఖాయ‌మ‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

నౌక‌ల‌ను అడ్డుకుంటే ఎక్కువ ధ‌ర‌ల‌ను అనుభ‌వించండి: ఇరాన్‌

ఇరాన్ పోర్టుల‌కు వెళ్లే లేదా అక్క‌డి నుంచి బ‌య‌లుదేరే నౌక‌ల‌ను హోర్ముజ్ జ‌ల‌సంధిలో అడ్డుకుంటున్న‌ట్లు సోమ‌వారం అమెరికా ప్ర‌క‌టించింది. వారాంతంలో పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లో నిర్వ‌హించిన యుద్ధ విర‌మ‌ణ చ‌ర్చ‌లు విఫ‌లం కావ‌డంతో ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని తెలుస్తోంది. అందులో భాగంగానే హోర్ముజ్‌లో నౌక‌ల‌ను అడ్డుకుంటున్న‌ట్లు స‌మాచారం. అయితే అమెరికా చ‌ర్య‌ల‌పై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఇరాన్ పార్ల‌మెంట్ స్పీక‌ర్ మొహ‌మ్మ‌ద్ బ‌ఘేర్ ఘాలిబాఫ్ స్పందిస్తూ ప్ర‌స్తుతం ప్ర‌పంచం అనుభ‌విస్తున్న అధిక ఇంధ‌న ధ‌ర‌ల‌ను ఆస్వాదించాల‌ని, దీని వ‌ల్ల ఇంధన ధ‌ర‌లు మ‌రింత పెరుగుతాయ‌ని, అప్పుడు ప్ర‌జ‌లు ఈ విష‌యాన్ని గుర్తు చేసుకుంటార‌ని అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు.

అమెరికా స్టాక్ మార్కెట్ల‌లో మిశ్ర‌మ ఫ‌లితాలు..

సోమ‌వారం అమెరికా స్టాక్ మార్కెట్ల‌లో మిశ్ర‌మ స్పంద‌న క‌నిపించింది. వాల్ స్ట్రీట్ లో ఫ్యూచ‌ర్స్‌లో పెద్ద‌గా మార్పులు క‌నిపించ‌లేదు. ఎస్ అండ్ పీ 500 ఫ్యూచ‌ర్స్ కేవ‌లం 0.06 శాతం పెర‌గ్గా, డౌ జోన్స్ ఇండ‌స్ట్రియల్ యావరేజ్ ఫ్యూచ‌ర్స్ కేవ‌లం 10 పాయింట్ల మేర పెరిగాయి. నాస్ డాక్100 ఫ్యూచ‌ర్స్ 0.2 శాతం మేర లాభ‌ప‌డ్డాయి. అయితే ఎస్ అండ్ పీ 500 సూచీ మాత్రం భారీగా పెరుగుద‌ల‌ను న‌మోదు చేసింది. ఈ సూచీ 1.02 శాతం పెరిగి 6,886.24 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నాస్‌డాక్ కంపోజిట్ సూచీ 1.23 శాతం మేర పెరిగి 23,183.74 వ‌ద్ద ముగిసింది. డౌ జోన్స్ ఇండ‌స్ట్రియ‌ల్ యావ‌రేజ్ 301.68 పాయింట్లు (0.63 శాతం) పెరిగి 48,218.25 వ‌ద్ద ముగిసింది.

బ‌ల‌ప‌డ్డ భార‌త రూపాయి..

ఫారెక్స్ మార్కెట్‌లో మంగ‌ళ‌వారం డాల‌ర్ విలువ కాస్త త‌గ్గింది. డాల‌ర్ ఇండెక్స్ ఒక‌టిన్న‌ర నెల క‌నిష్ట స్థాయి 98.328ని తాకింది. పెట్టుబ‌డిదారులు రిస్క్ తీసుకునేందుకు య‌త్నించ‌క‌పోవ‌డం, సేఫ్ హావెన్ ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో డాల‌ర్ విలువ స్వ‌ల్పంగా క్షీణించింది. మ‌రో వైపు అమెరికా డాల‌ర్ తో పోలిస్తే భార‌త రూపాయి కాస్త బ‌ల‌ప‌డింది. మంగ‌ళ‌వారం నాటి సెష‌న్‌లో 0.09 పైస‌లు పెరిగిన రూపాయి 93.27 వ‌ద్ద కొన‌సాగుతోంది. అలాగే డాల‌ర్‌తో పోలిస్తే యూరో విలువ 0.05 శాతం మేర పెరిగి 1.1764 డాల‌ర్ల‌కు చేరుకోగా, బ్రిటిష్ పౌండ్ 6 వారాల గ‌రిష్ట స్థాయి 1.3514 డాల‌ర్ల‌ను న‌మోదు చేసింది.

Advertisement
Advertisement