త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adani Energy Solutions | అదానీ ఎనర్జీ షేర్ల‌ జోరు.. 5 శాతం జంప్‌..

Adani Energy Solutions | అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ షేరు గురువారం ట్రేడింగ్‌లో దూసుకెళ్లింది. ఇంట్రాడేలో ఏకంగా 5.13 శాతం వరకు పెరిగింది. కేంద్ర కేబినెట్ రూ.1.86 లక్షల కోట్ల విలువైన పీఎం-ధారా పథకానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ ర్యాలీ కనిపించింది. దేశంలో అంతర్‌రాష్ట్ర విద్యుత్ ప్రసార మౌలిక వసతులను బలోపేతం చేయడం, పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్‌లోకి అనుసంధానించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.

S

Business | Published On Oct 1, 2026, 11.57 am IST

Adani Energy Solutions | అదానీ ఎనర్జీ షేర్ల‌ జోరు.. 5 శాతం జంప్‌..
Advertisement

Adani Energy Solutions | అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ షేరు గురువారం ట్రేడింగ్‌లో దూసుకెళ్లింది. ఇంట్రాడేలో ఏకంగా 5.13 శాతం వరకు పెరిగింది. కేంద్ర కేబినెట్ రూ.1.86 లక్షల కోట్ల విలువైన పీఎం-ధారా పథకానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ ర్యాలీ కనిపించింది. దేశంలో అంతర్‌రాష్ట్ర విద్యుత్ ప్రసార మౌలిక వసతులను బలోపేతం చేయడం, పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్‌లోకి అనుసంధానించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా 50 గిగావాట్ అవర్ బ్యాటరీ నిల్వ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయనున్నారు. తద్వారా సుమారు 135 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను గ్రిడ్‌కు తరలించేందుకు వీలు కలుగుతుంది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు ఇంట్రాడేలో రూ.1,382 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అనంతరం కొంత లాభాలను కోల్పోయినప్పటికీ రూ.1,368.20 వద్ద ట్రేడైంది. ఇది సుమారు 4.08 శాతం లాభం. ఈ ఏడాది ఇప్పటివరకు కంపెనీ షేరు ధర 33.38 శాతం పెరిగింది.

ప‌వ‌ర్‌గ్రిడ్ కంపెనీల‌కు భారీ ఊతం..

ప్రభుత్వం విద్యుత్ ప్రసార వ్యవస్థపై దృష్టి పెంచుతున్న నేపథ్యంలో పవర్ గ్రిడ్ రంగంలో పనిచేస్తున్న కంపెనీలకు ఈ పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతున్నందున, దానిని సమర్థంగా గ్రిడ్‌లోకి అనుసంధానించేందుకు భారీ స్థాయిలో ప్రసార మౌలిక వసతులు అవసరం అవుతున్నాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ దేశంలోని ప్రముఖ ప్రైవేట్ విద్యుత్ ప్రసార, పంపిణీ సంస్థల్లో ఒకటిగా ఉంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 16 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సంస్థకు సుమారు 27,949 సర్క్యూట్ కిలోమీటర్ల ప్రసార లైన్లు, 1,23,000 ఎంవీఏకు పైగా ట్రాన్స్‌ఫర్మేషన్ సామర్థ్యం ఉంది.

పోర్ట్‌ఫోలియో విస్త‌ర‌ణ దిశ‌గా..

అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ తన ప్రసార ప్రాజెక్టుల పోర్ట్‌ఫోలియోను కూడా విస్తరిస్తోంది. ఆగస్టులో మహారాష్ట్రలో 4,500 మెగావాట్ల పునరుత్పాదక, నిల్వ విద్యుత్‌ను తరలించేందుకు ఉద్దేశించిన ప్రసార ప్రాజెక్టును కంపెనీ దక్కించుకుంది. ఈ ఆర్డర్ విలువ సుమారు రూ.4,700 కోట్లు. ఈ ప్రాజెక్టు ద్వారా అదనంగా 562 సర్క్యూట్ కిలోమీటర్ల ప్రసార లైన్లు, 9,000 ఎంవీఏ ట్రాన్స్‌ఫర్మేషన్ సామర్థ్యం అందుబాటులోకి రానుంది. విద్యుత్ డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలు, గ్రిడ్ మౌలిక వసతులపై పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం పవర్ రంగానికి కూడా మద్దతు లభిస్తోంది. ఇటీవల జెఫరీస్ సంస్థ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌తోపాటు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎన్‌టీపీసీ సంస్థలను తన ప్రాధాన్య విద్యుత్ షేర్లలో చేర్చింది. విద్యుత్ డిమాండ్ బలపడడం, బొగ్గు నిల్వలు తగ్గుముఖం పట్టడం వంటి అంశాలను ఇందుకు కారణాలుగా పేర్కొంది.

Advertisement
Advertisement