త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Saudi Arabia | భారత్‌-సౌదీ మధ్య సముద్రగర్భ విద్యుత్‌ లైన్‌.. రూ.80 వేల కోట్ల ప్రాజెక్ట్‌..

India Saudi Arabia | భార‌త్, సౌదీ అరేబియా మ‌రో కీల‌క ప్రాజెక్టుకు శ్రీ‌కారం చుట్ట‌నున్నాయి. ఇరు దేశాల మ‌ధ్య దాదాపు 2100 కిలోమీట‌ర్ల పొడ‌వున్న స‌ముద్ర గ‌ర్భ విద్యుత్ పంపిణీ వ్య‌వ‌స్థ‌ను నిర్మించ‌నున్నారు. ఇందుకు గాను సుమారు 9 బిలియ‌న్ డాల‌ర్లు అంటే దాదాపుగా రూ.80వేల కోట్ల‌ను ఖ‌ర్చు చేయ‌నున్నారు.

S

Business | Published On Oct 2, 2026, 12.17 pm IST

India Saudi Arabia | భారత్‌-సౌదీ మధ్య సముద్రగర్భ విద్యుత్‌ లైన్‌.. రూ.80 వేల కోట్ల ప్రాజెక్ట్‌..
Advertisement

India Saudi Arabia | భార‌త్, సౌదీ అరేబియా మ‌రో కీల‌క ప్రాజెక్టుకు శ్రీ‌కారం చుట్ట‌నున్నాయి. ఇరు దేశాల మ‌ధ్య దాదాపు 2100 కిలోమీట‌ర్ల పొడ‌వున్న స‌ముద్ర గ‌ర్భ విద్యుత్ పంపిణీ వ్య‌వ‌స్థ‌ను నిర్మించ‌నున్నారు. ఇందుకు గాను సుమారు 9 బిలియ‌న్ డాల‌ర్లు అంటే దాదాపుగా రూ.80వేల కోట్ల‌ను ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన సీనియ‌ర్ అధికారులు మ‌నీ కంట్రోల్‌కు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ విద్యుత్ అనుసంధాన ప్రాజెక్టుపై అక్టోబ‌ర్ 5న ఇరు దేశాల ప్ర‌తినిధులు ఉన్న‌త స్థాయి స‌మావేశంలో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. భార‌త్ క‌నీసం ఏడాది పాటు నిర్వ‌హించిన సాధ్యాసాధ్యాల అధ్య‌య‌నం ఇటీవ‌లే పూర్త‌యిన నేప‌థ్యంలో ఇరు దేశాలు ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపాయి. కాగా ఈ అధ్య‌య‌నాన్ని జాయింట్ వ‌ర్కింగ్ గ్రూప్ ఆన్ ఎన‌ర్జీ ఎదుట ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

2100 కిలోమీట‌ర్ల పొడ‌వు, 3 గిగావాట్లు..

ప్ర‌స్తుత అధ్య‌య‌నంలో పేర్కొన్న అంచ‌నాల ప్ర‌కారం ప్రాజెక్టు పొడ‌వు సుమారుగా 2,100 కిలోమీట‌ర్లుగా ఉండ‌నుంది. విద్యుత్ ప్ర‌సార సామ‌ర్థ్యం 3 గిగావాట్లు కాగా, హై వోల్టేజ్‌ డైరెక్ట్ క‌రెంట్‌ను వ్య‌వ‌స్థ ద్వారా ప్ర‌సారం చేస్తారు. భారత్‌-సౌదీ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య మండ‌లిలోని ఆర్థిక‌, పెట్టుబ‌డి విభాగం కింద ప‌నిచేసే నాలుగు అధికారిక స్థాయి వ‌ర్కింగ్ గ్రూపుల్లో జాయింట్ వ‌ర్కింగ్ గ్రూప్ ఆన్ ఎన‌ర్జీ ఒక‌టి కాగా, విద్యుత్, గ్రిడ్ అనుసంధానం స‌హా ఇరు దేశాల మ‌ధ్య ఇంధ‌న రంగ స‌హ‌కారాన్ని ఈ బృందం ప‌ర్య‌వేక్షిస్తుంది. భార‌త్‌కు సంబంధించిన స‌రిహ‌ద్దు విద్యుత్ ప్రాజెక్టుల్లో ఇంత వ‌ర‌కు ఈ స్థాయికి చేరుకున్న తొలి ప్రాజెక్టుల్లో ఇది ఒక‌ట‌ని అధికారులు తెలిపారు. ఇరు దేశాల మ‌ధ్య నేరుగా విద్యుత్ అనుసంధానాన్ని ఏర్పాటు చేయ‌డ‌మే ఈ ప్రాజెక్టు వ్యూహాత్మ‌క ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. దీని వ‌ల్ల ఇరు దేశాల మ‌ధ్య వేగంగా విద్యుత్ మార్పిడి సాధ్య‌మ‌వుతుంది. అలాగే ఇంధ‌న భ‌ధ్ర‌త సైతం మ‌రింత బ‌లోపేతం కానుంది. పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల‌ను విద్యుత్ గ్రిడ్‌లో మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా అనుసంధానించేందుకు కూడా ఈ ప్రాజెక్టు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అధికారులు పేర్కొన్నారు.

అక్టోబ‌ర్ 5న కీల‌క చ‌ర్చ‌లు..

ప్ర‌స్తుతం ప్రాజెక్టుకు ఆర్థికంగా ఆచ‌ర‌ణీయ‌మైన వ్యాపార న‌మూనాను రూపొందించ‌డంపై దృష్టి సారిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభ ద‌శ‌లో సుమారు 5 బిలియ‌న్ డాల‌ర్ల‌ను వెచ్చించ‌నున్నారు. త‌రువాత 9 బిలియ‌న్ డాల‌ర్ల‌కు వ్య‌యం చేరుతుంది. ఈ వివ‌రాల‌ను అక్టోబ‌ర్ 5న జ‌ర‌గ‌నున్న స‌మావేశంలో చర్చిస్తారు. అలాగే ప్రాజెక్టు ఆర్థిక సాధ్యాసాధ్యాలను కూడా ప‌రిశీలించ‌నున్నారు. వీలుంటే వ్య‌యాన్ని త‌గ్గించే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు ర‌చించ‌నున్నారు. ఇక కేవ‌లం సౌదీ అరేబియా మాత్ర‌మే కాకుండా ఒమాన్‌, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌, సింగ‌పూర్‌, శ్రీలంక‌, మాల్దీవులు వంటి దేశాల‌తోనూ ఈ త‌ర‌హా ప్రాజెక్టులను సంయుక్తంగా చేప‌ట్టాల‌ని భార‌త్ భావిస్తోంది. అయితే భార‌త్‌, సౌదీ మ‌ధ్య ప్రాజెక్టు మాత్రం దాదాపు పూర్త‌యింద‌ని, ఇత‌ర దేశాల క‌న్నా ఈ ప్రాజెక్టు ముందుగా పూర్త‌వుతుంద‌ని అధికారులు తెలిపారు. దీంతో భార‌త్‌, సౌదీల మ‌ధ్య వాణిజ్య ప‌రంగా కార్య‌క‌లాపాలు మ‌రింత మెరుగుప‌డతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

Advertisement
Advertisement