త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో క‌రెక్ష‌న్ జ‌రిగింది.. ఇక పెట్టుబ‌డులు పెట్ట‌డ‌మే.. నిపుణుల అభిప్రాయం..

Stock Markets | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధం కార‌ణంగా భార‌త స్టాక్ మార్కెట్లు భారీగా ప‌త‌నం అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికే చాలా వ‌రకు విక్ర‌యాలు చోటు చేసుకున్నాయ‌ని, ఇక ప‌త‌నం అంత‌గా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, పెట్టుబ‌డిదారులు పెట్టుబ‌డి పెట్టేందుకు డ‌బ్బును సిద్ధం చేసుకోవాల‌ని అబాక‌స్ అసెట్ మేనేజ్‌మెంట్ ఎల్ఎల్‌పీ వ్య‌వ‌స్థాప‌కుడు సునీల్ సింఘానియా అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

S

Business | Published On Apr 3, 2026, 4.02 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో క‌రెక్ష‌న్ జ‌రిగింది.. ఇక పెట్టుబ‌డులు పెట్ట‌డ‌మే.. నిపుణుల అభిప్రాయం..
Advertisement

Stock Markets | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధం కార‌ణంగా భార‌త స్టాక్ మార్కెట్లు భారీగా ప‌త‌నం అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికే చాలా వ‌రకు విక్ర‌యాలు చోటు చేసుకున్నాయ‌ని, ఇక ప‌త‌నం అంత‌గా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, పెట్టుబ‌డిదారులు పెట్టుబ‌డి పెట్టేందుకు డ‌బ్బును సిద్ధం చేసుకోవాల‌ని అబాక‌స్ అసెట్ మేనేజ్‌మెంట్ ఎల్ఎల్‌పీ వ్య‌వ‌స్థాప‌కుడు సునీల్ సింఘానియా అభిప్రాయం వ్య‌క్తం చేశారు. విదేశీ పెట్టుబ‌డిదారులు పెట్టుబ‌డులను ఉప‌సంహరించుకోవ‌డంతోపాటు యుద్దం కార‌ణంగా దేశీయ స్టాక్ మార్కెట్ల‌పై తీవ్ర ఒత్తిడి ఉన్న‌ప్ప‌టికీ ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌తనం ఎక్కువ భాగం ఇప్ప‌టికే పూర్త‌యింద‌ని, న‌గ‌దు నిల్వ‌లు ఉన్న పెట్టుబ‌డిదారులు ద‌శ‌లవారిగా పెట్టుబ‌డులు పెట్ట‌డం ప్రారంభించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు.

90 శాతం డిస్కౌంట్‌లో మార్కెట్లు..

యుద్ధ ప‌రిస్థితులు, ముడి చ‌మురులు ధ‌ర‌లు దేశీయ స్టాక్ మార్కెట్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపించాయ‌ని, ప్రధాన నష్టం ఇప్పటికే మార్కెట్‌లో సంభ‌వించింద‌ని తెలిపారు. మార్కెట్ పెయిన్‌లో 90 శాతం ఇప్పటికే ధరల్లో డిస్కౌంట్ అయింద‌ని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుండి ప్రధాన సూచీలు 15 శాతం కంటే ఎక్కువ పతనాన్ని నమోదు చేసి కరెక్షన్ దశలోకి ప్రవేశించాయ‌ని, లావాదేవీ పన్నులు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రూపాయి బలహీనత వంటి అంశాలు పెట్టుబడిదారుల భావోద్వేగాలపై ప్రభావం చూపాయ‌ని అన్నారు. మార్చి నెలలోనే నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ 11 శాతం పడిపోవడం కోవిడ్ తర్వాతి కాలంలో అత్యధిక నెలవారి పతనంగా నిలిచిందన్నారు. ఆర్థిక సంవ‌త్స‌రం 2026 ముగిసే సమయానికి నిఫ్టీ 5 శాతం కంటే ఎక్కువ, సెన్సెక్స్ 7 శాతం నష్టపోయాయని అన్నారు.

వార్త‌ల వ‌ల్లే ఈ ప‌రిస్థితి..

మార్కెట్లలో కనిపిస్తున్న తీవ్ర అనిశ్చితి మౌలిక ధోరణుల్లో మార్పు కారణంగా కాకుండా వార్తల అనిశ్చితి వల్లనేనని సింఘానియా అన్నారు. ఏదైనా యుద్ధ పరిస్థితి వస్తే మార్కెట్లలో ఆందోళన సహజ‌మ‌ని, ప్రస్తుత పరిస్థితుల్లో వార్తలు మార్కెట్ల‌ను ప్రభావితం చేస్తున్నాయ‌ని ఆయన తెలిపారు. ముడి చమురు ధరల అస్థిరత కూడా గతంతో పోలిస్తే తగ్గిందని ఆయన చెప్పారు. ముందు 10-20 శాతం వరకు ధరలు మారేవ‌ని, ఇప్పుడు 3-4 శాతం మార్పులకే పరిమితమవుతున్నాయ‌ని పేర్కొన్నాయి. మార్కెట్లు ఈ పరిణామాలను క్రమంగా జీర్ణించుకుంటున్నాయని అన్నారు. మార్చి నెలలో విదేశీ పెట్టుబడిదారుల భారీ అమ్మకాలు కూడా మార్కెట్‌పై ఒత్తిడిని పెంచాయని ఆయన పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడిదారులు లక్ష కోట్లకు పైగా విక్రయాలు చేశార‌ని, ఇది భారత మార్కెట్లపై ఎక్కువ ప్రభావం చూపింద‌ని అన్నారు.

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లంగానే..

అయితే, దీర్ఘకాలికంగా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా కొనసాగుతుందని సింఘానియా విశ్వాసం వ్యక్తం చేశారు. దేశం 6.5-7 శాతం వృద్ధి దిశలో కొనసాగుతుండటంతో ఈక్విటీ మార్కెట్లకు మద్దతు లభిస్తుందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుదల ఆగిపోతుందనే అనుమానం లేద‌ని, అందువల్ల ఈక్విటీ మార్కెట్లు కూడా వృద్ధి చెందుతాయ‌ని పేర్కొన్నారు. ఇటీవలి పతనంతో మార్కెట్ విలువలు కూడా క‌రెక్ష‌న్ అయ్యాయ‌ని ఆయన చెప్పారు. గతంలో ఇతర మార్కెట్లతో పోలిస్తే అధిక ప్రీమియం వద్ద ట్రేడ్ అవుతున్న భారత మార్కెట్లు ఇప్పుడు సర్దుబాటు అయ్యాయని తెలిపారు. యుద్ధానికి ముందు పన్ను తగ్గింపులు, వడ్డీ రేట్ల తగ్గుదల, లిక్విడిటీ పెరుగుదల, డిమాండ్ పునరుద్ధరణ వంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయని గుర్తుచేశారు.

ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడు..?

పెట్టుబడిదారులకు ప్రస్తుత పరిస్థితి జాగ్రత్తతో పెట్టుబడులు పెట్టాల్సిన దశ అని సింఘానియా సూచించారు. నగదు చేతిలో ఉన్నవారు ఇప్పుడు పెట్టుబడులు పెట్టకపోతే మరెప్పుడు? అని అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధుల్లో 30-50 శాతం వరకు పెట్టుబడులు పెట్టాలని సూచించారు. రంగాల వారీగా చూస్తే ఫార్మా రంగం స్థిరమైన ఆదాయ అవకాశాలు ఇస్తుంద‌ని, రూపాయి బలహీనత వల్ల లాభపడుతుందని ఆయన తెలిపారు. బ్యాంకింగ్ రంగం మాత్రం విదేశీ అమ్మకాలు, బాండ్ ఈల్డ్స్ ప్రభావంతో నష్టపోయిందని, పరిస్థితులు స్థిరపడిన వెంటనే ఇది త్వరగా కోలుకునే అవకాశముందని చెప్పారు. కాగా వినియోగ రంగానికి చెందిన షేర్లు, అలాగే కెమికల్స్, మెటల్స్‌లోని కొన్ని విభాగాల్లో కూడా అవకాశాలు ఉన్నాయని సింఘానియా పేర్కొన్నారు. దేశీయ డిమాండ్ స్థిరంగా కొనసాగుతుండటం ఈ రంగాలకు మద్దతు ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement