త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijayasai Reddy New Party | ఏపీ రాజకీయాల్లో సంచలనం: కొత్త పార్టీ ప్రకటించిన విజయసాయిరెడ్డి.. సీఎం అభ్యర్థిపై బిగ్ ట్విస్ట్!

ఏపీ రాజకీయాల్లో సంచలనం. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. తాను సీఎం రేసులో ఉండనని కీలక వ్యాఖ్యలు చేశారు.

J

Andhra pradesh | Published On Sep 7, 2026, 3.00 pm IST

Vijayasai Reddy New Party | ఏపీ రాజకీయాల్లో సంచలనం: కొత్త పార్టీ ప్రకటించిన విజయసాయిరెడ్డి.. సీఎం అభ్యర్థిపై బిగ్ ట్విస్ట్!
Advertisement
  • ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు విజయవాడ వేదికగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అధికారిక ప్రకటన
  • టీడీపీ, వైసీపీలను కుటుంబ, ఫ్యాక్షన్ పార్టీలుగా అభివర్ణిస్తూ.. 15 ఏళ్లుగా రెండు కులాలే రాష్ట్రాన్ని ఏలడంపై తీవ్ర విమర్శలు
  • తన పార్టీలో యువతకు 66 శాతం ప్రాధాన్యం ఇస్తామని, బాల్ థాకరే తరహాలో తాను పార్టీకి కేవలం మెంటర్‌గా (Mentor) ఉంటానని స్పష్టీకరణ
  • రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు (BC) చెందిన సమర్థుడైన నాయకుడినే తమ పార్టీ సీఎం అభ్యర్థిగా నిలబెడతామని సాయిరెడ్డి వెల్లడి

Vijayasai Reddy New Party | త్రినేత్ర.న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఉందంటూ మాజీ ఎంపీ, సీనియర్ ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్ వేదికగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన కొత్త పార్టీ స్థాపనపై కీలక వివరాలు వెల్లడించారు. రెండేళ్ల క్రితమే వైసీపీని వీడి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. మూడో ప్రత్యామ్నాయ పార్టీగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

రెండూ ఫ్యాక్షన్ పార్టీలే..

గత 15 ఏళ్లుగా ఏపీలో టీడీపీ (TDP), వైసీపీ (YCP) చుట్టూనే రాజకీయం తిరుగుతోందని, ఈ రెండు పార్టీల మధ్య సామాన్య ప్రజలు నలిగిపోతున్నారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీని ‘రెడ్ బుక్ పార్టీ’గా, వైసీపీని ‘రప్పా రప్పా పార్టీ’గా ఆయన అభివర్ణించారు. ఈ రెండూ దందాలు, సెటిల్‌మెంట్లు చేసే ఫ్యాక్షన్, కుటుంబ పార్టీలేనని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికార యావ, సంపాదన యావ తప్ప ఈ పార్టీలకు ప్రజా సంక్షేమం పట్టదన్నారు.

బాల్ థాకరే తరహాలో నా పాత్ర.. బీసీలే సీఎం

రాష్ట్రంలో అనేక సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ కేవలం కమ్మ, రెడ్డి కులాలే ఎందుకు అధికారం చెలాయించాలని సాయిరెడ్డి ప్రశ్నించారు. 80 శాతం ఓటు బ్యాంకు ఉన్న ఇతర కులాల్లో సమర్థులు లేరా అని నిలదీశారు. తాను పెట్టబోయే పార్టీలో బీసీ వర్గాలకు చెందిన బలమైన, సమర్థుడైన నాయకుడికే ముఖ్యమంత్రి (CM) అయ్యే అవకాశం కల్పిస్తానని మాటిచ్చారు. తాను మహారాష్ట్రలో బాల్ థాకరే తరహాలో పార్టీని నడిపించే మెంటర్‌గా (Mentor) మాత్రమే ఉంటానని, సీఎం రేసులో ఉండబోనని స్పష్టం చేశారు. పార్టీలో పోటీ చేసే అవకాశాల్లో 66 శాతం యువతకే కేటాయిస్తామన్నారు.

అమరావతికి మద్దతు.. సోలార్ విద్యుత్‌పై ఫోకస్

కోస్తాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అమరావతి రాజధానిని తాము వ్యతిరేకించడం లేదని, దానికి పూర్తి మద్దతు ఇస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి, గృహ వినియోగానికి ఉచిత కరెంటు అందిస్తామని, ఇందుకోసం సోలార్ (Solar) విద్యుత్‌ను భారీగా ప్రోత్సహిస్తామని తమ తొలి ఎన్నికల వాగ్దానాన్ని ప్రకటించారు.

తాను రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ ఏడాది కాలంలో ‘రెడ్డి సామాజికవర్గం ఎలా ఆవిర్భవించింది?’ అనే అంశంపై లోతైన పరిశోధన చేసి 350 పేజీల పుస్తకాన్ని రచించినట్లు సాయిరెడ్డి వెల్లడించారు. అతి త్వరలోనే తన కొత్త పార్టీ పేరు, విధివిధానాలు, ఎన్నికల మానిఫెస్టోను (Manifesto) అధికారికంగా ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement