Türkiye Sinkholes | సింక్హోల్స్తో ఆహార సంక్షోభం : టుర్కీయేలో పొలాలను మింగుతున్న భూమి
టుర్కీయే దేశానికి ‘బ్రెడ్ బాస్కెట్’గా పేరుగాంచిన కోన్యా మైదానం ఇప్పుడు భూగర్భ విపత్తుతో వణికిపోతోంది. కోన్యాలో జరుగుతున్నది కేవలం ఒక దేశ సమస్య కాదు. భూగర్భ జలాల అతివినియోగం, వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయాన్ని ఎలా ప్రమాదంలోకి నెడుతున్నాయో తెలిపే హెచ్చరిక ఇది. ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే, ఈ గుంతలు రేపు మరెన్నో దేశాల పొలాలను మింగే ప్రమాదం ఉంది.
Agriculture | Published On Dec 16, 2025, 5.14 pm IST
How Sinkholes Are Threatening Farmers’ Livelihoods in Türkiye’s Konya Region
(త్రినేత్ర వరల్డ్ డెస్క్), అంకారా, డిసెంబర్ 15, 2025:
Türkiye Sinkholes | టుర్కీయే దేశంలోని మధ్య అనాటోలియా ప్రాంతంలో ఉన్న కోన్యా ప్రావిన్స్, దేశానికి “బ్రెడ్ బాస్కెట్”గా పేరుగాంచిన కీలక వ్యవసాయ ప్రాంతం. అయితే ఇప్పుడు అదే కోన్యా మైదానం, ముఖ్యంగా కరాపినార్ జిల్లా, భారీ సంఖ్యలో ఏర్పడుతున్న సింక్‌హోల్స్ (భూమి కుంగిపోవడంతో ఏర్పడిన భారీ గుంతలు)తో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పొలాలు, పంటలు మాత్రమే కాదు… రైతుల ప్రాణాలకే ఈ గుంతలు ముప్పుగా మారుతున్నాయి.
ప్రస్తుతం కోన్యా మైదానంలో దాదాపు 700 వరకు సింక్‌హోల్స్ ఉన్నట్లు అధికారిక అంచనాలు చెబుతున్నాయి. కొన్ని గుంతలు 100 అడుగులకు పైగా వెడల్పు, వందల అడుగుల లోతు వరకు ఉండి, ఒక్కసారిగా పొలాలను మింగేస్తున్నాయి. “ఎక్కడ భూమి కూలిపోతుందో తెలియదు. లోపల పడితే బయటపడటం అసాధ్యం” అంటూ రైతులు భయంతో పొలాల్లో అడుగులు వేస్తున్నారు.
ఏంటీ సింక్‌హోల్స్? ఎలా ఏర్పడతాయి?

సింక్‌హోల్స్ అనేవి సహజ భూభౌతిక ప్రక్రియలో భాగమే. భూగర్భంలో ఉన్న రాతి పొరలు నీటితో క్రమంగా కరిగి గుహలుగా మారతాయి. ఆ గుహలపై ఉన్న నేల బలహీనంగా మారినప్పుడు అకస్మాత్తుగా కుంగిపోతూ గుంతలు ఏర్పడతాయి. కానీ కోన్యాలో ఈ ప్రక్రియ అసాధారణ వేగంతో జరుగుతోంది. 2000ల ముందు వరకు దశాబ్దానికి కొన్ని మాత్రమే కనిపించిన సింక్‌హోల్స్, ఇప్పుడు ఏటా డజన్ల సంఖ్యలో ఏర్పడుతున్నాయి. 2024 ఒక్క సంవత్సరంలోనే కరాపినార్ జిల్లాలో 20 కొత్త భారీ గుంతలు ఏర్పడ్డాయి. మొత్తం కోన్యా క్లోజ్డ్ బేసిన్‌లో 684 సింక్‌హోల్స్ గుర్తించగా, కోన్యా టెక్నికల్ యూనివర్శిటీ పరిశోధకులు 640కి పైగా, టుర్కీయే విపత్తు నిర్వహణ సంస్థ AFAD 2,700కు పైగా భూమి కుంగుబాట్లు, పగుళ్లను మ్యాప్ చేసింది.
అక్కడే ఎందుకు?

నిపుణుల ప్రకారం ఈ విపత్తుకు ప్రధాన కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా దీర్ఘకాలిక కరువు, వర్షపాతం తీవ్రంగా తగ్గిపోవడం, అదే సమయంలో భూగర్భ జలాల అతివినియోగం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. కోన్యాలో వార్షిక వర్షపాతం సగటు కంటే దాదాపు 40 శాతం తక్కువగా నమోదవుతోంది. భూగర్భ జల మట్టం ఏటా 10 నుంచి 20 మీటర్ల వరకు పడిపోతోంది. మక్క, షుగర్ బీట్ వంటి నీటిని అధికంగా వాడాల్సిన పంటల సాగు కోసం వేలాది చట్టబద్ధ, అక్రమ బోరు బావులు తవ్వడంతో, 1970ల నుంచి కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు 60 మీటర్లకు పైగా తగ్గాయి. నాసా (NASA) డేటా ప్రకారం, 2021 నాటికి టుర్కీయే రిజర్వాయర్లు గత 15 ఏళ్లలో అతి తక్కువ స్థాయికి చేరాయి. ఈ పరిస్థితుల ప్రభావం రైతుల జీవితాలపై తీవ్రంగా పడుతోంది. కరాపినార్‌కు చెందిన రైతు ఫతిహ్ షిక్ పొలంలో ఇప్పటికే రెండు భారీ సింక్‌హోల్స్ ఏర్పడ్డాయి. “ప్రతి రోజు భయంతోనే పొలంలోకి వెళ్తున్నా” అని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. మరో రైతు ఆదెమ్ ఎక్మెక్సీ తన పొలంలో చెట్లను మింగేసిన గుంతను చూసి షాక్‌కు గురయ్యాడు. గొర్రెలు మేపే షెఫర్డ్ ఒమర్ “ఒకటి కూలితే, మిగతావి కూడా వరుసగా కూలిపోతాయేమోనన్న భయం” అంటున్నాడు. పొలాలు, పంటలతో పాటు రోడ్లు, ఇళ్లు, పశువులు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. కొందరు రైతులు కుంగుబాటు ప్రమాదం అధికంగా ఉన్న భూములను పూర్తిగా వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు కలిసి సింక్‌హోల్స్‌ను గుర్తించి మ్యాపింగ్, మానిటరింగ్ చర్యలు చేపడుతున్నాయి. అక్రమ బోరు బావులను అరికట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరు ఈ విపత్తును అవకాశంగా మార్చాలన్న ఉద్దేశంతో, 800 ఏళ్ల సెల్జుక్ కారవాన్‌సరై(రాజుల కాలంనాటి రహదారి సత్రాలు) సమీపంలోని సింక్‌హోల్స్‌ను పర్యాటక ఆకర్షణగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, భూగర్భ జల వినియోగాన్ని కఠినంగా నియంత్రించకపోతే, నీటి దాహక పంటల సాగు తగ్గించకపోతే, కోన్యా మైదానంలో ఈ భూకుప్పకూల్చే విపత్తు మరింత తీవ్ర రూపం దాలుస్తుందని భూగర్భ నిపుణులు మాత్రం స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.

ఈ సమస్య టుర్కీయే వరకే పరిమితం కాదు. అమెరికా, చైనా, భారత్ వంటి దేశాల్లో కూడా ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పులు–భూగర్భ జలాల దోపిడీ ప్రపంచవ్యాప్త ముప్పుగా మారుతోంది. ఇప్పుడే మేల్కొనకపోతే, కోన్యా రైతులు ఎదుర్కొంటున్న భయం, నష్టం, భవిష్యత్‌లో ప్రపంచదేశాలన్నీ ఎదుర్కోవాల్సిఉంటుంది. ఇది ఒక ముందస్తు హెచ్చరిక.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






