Seeds Bill 2025 | విత్తన బిల్లు 2025: రైతులకు రక్షణా? కార్పొరేట్లకు బహుమతా?
ముసాయిదా విత్తన బిల్లు 2025 దేశవ్యాప్తంగా వివాదానికి దారి తీసింది. రైతుల హక్కులను రక్షిస్తుందా, కార్పొరేట్ సీడ్ కంపెనీలకు లాభం చేకూరుస్తుందా? నాణ్యమైన విత్తనాల పేరుతో కార్పొరేట్ నియంత్రణ పెరుగుతుందా? రైతు సంఘాల ఆందోళనలు, ప్రభుత్వ వాదనలపై పూర్తి విశ్లేషణ.
Agriculture | Published On Dec 15, 2025, 9.11 pm IST
Seeds Bill 2025 Sparks Nationwide Debate: Farmers Fear Corporate Control
హైదరాబాద్, డిసెంబర్ 15, 2025:
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నవంబర్ 12న విడుదల చేసిన విత్తన బిల్లు–2025 ముసాయిదా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. 1966 సీడ్స్ యాక్ట్, 1983 సీడ్స్ కంట్రోల్ ఆర్డర్‌లను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో రూపొందించిన ఈ బిల్ ద్వారా నాణ్యమైన విత్తనాలు, నకిలీల నిరోధం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సాధ్యమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే రైతు సంఘాలు మాత్రం దీన్ని, కార్పొరేట్ ప్రయోజనాల కోసం రూపొందించిన బిల్లుగా అభివర్ణిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
భారత్‌లో ప్రతి ఏడాది సగటున 480–530 లక్షల టన్నుల విత్తనాల అవసరం ఉండగా, దేశీయ విత్తన మార్కెట్ విలువ దాదాపు ₹40,000 కోట్లుగా అంచనా. 2022–2025 మధ్య సేకరించిన సుమారు 6 లక్షల విత్తన నమూనాలలో 43 వేల వరకు నాణ్యత లేనివిగా గుర్తించడం ఈ బిల్లును తీసుకురావడానికి ప్రధాన కారణంగా ప్రభుత్వం పేర్కొంటోంది. ఇదే తరహాలో 2004, 2019లోనూ విత్తన బిల్లు ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, రైతుల నిరసనలతో అప్పట్లో ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు మూడోసారి ఈ ప్రయత్నం జరగడం గమనార్హం.
కేంద్రీకృత నియంత్రణతో కొత్త విత్తన చట్టం

ముసాయిదా బిల్లు ప్రకారం రైతుల సంప్రదాయ రకాల్ని మినహాయించి, దేశంలో విక్రయించే అన్ని విత్తన రకాలు తప్పనిసరిగా నమోదు కావాలి. VCU (Value for Cultivation and Use) పరీక్షలు బహుళ ప్రాంతాల్లో తప్పనిసరి చేయనున్నారు. ప్రతి విత్తన ప్యాకెట్‌పై QR కోడ్ ఆధారిత ట్రేసబిలిటీ, విత్తన డీలర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, డిస్ట్రిబ్యూటర్లకు రాష్ట్రస్థాయి రిజిస్ట్రేషన్ నిబంధనలు విధించారు. ముఖ్యంగా పెద్ద సీడ్ కంపెనీలకు కేంద్రీకృత గుర్తింపు వ్యవస్థ(Central Accriditation System) ద్వారా ఒకే రిజిస్ట్రేషన్‌తో అన్ని రాష్ట్రాల్లో వ్యాపారం చేసే వెసులుబాటు కల్పించారు. నకిలీ లేదా అన్‌రిజిస్టర్డ్ విత్తనాల విక్రయానికి పాల్పడితే ₹30 లక్షల వరకు జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష ప్రతిపాదించారు.
అదే సమయంలో రైతులు తమ విత్తనాలను భద్రపరచడం, మార్పిడి చేయడం, పంచుకోవడం, విక్రయించడం అనుమతించినప్పటికీ—బ్రాండ్ నేమ్‌తో విక్రయాన్ని నిషేధం విధించారు.
రైతుల ఆగ్రహానికి కారణాలేమిటి?

విత్తన పరిశ్రమ ఈ బిల్లును స్వాగతిస్తున్నప్పటికీ, సంయుక్త కిసాన్ మోర్చా, ఆల్ ఇండియా కిసాన్ సభ, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ వంటి రైతు సంఘాలు డిసెంబర్ 8న దేశవ్యాప్తంగా బిల్ కాపీలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశాయి. ఈ బిల్ రైతుల కన్నా కార్పొరేట్ విత్తన కంపెనీలకే ఎక్కువ లాభం చేకూర్చుతుందనేది వారి ప్రధాన ఆరోపణ.
రైతు సంఘాల వాదన ప్రకారం, సెంట్రల్ అక్రెడిటేషన్ విధానం పెద్ద బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా ఉండగా, చిన్న దేశీయ సంస్థలు, సామాజిక విత్తన సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలపై భారీ డిజిటల్ కంప్లయన్స్ భారం పడుతుంది. VCU టెస్టింగ్ ప్రమాణాలు ఎక్కువగా ఒకేరకమైన హైబ్రిడ్ రకాలకే అనుకూలంగా ఉండి, సాంప్రదాయ, వైవిధ్యభరిత, వాతావరణ మార్పులకు తట్టుకునే విత్తనాలు మార్కెట్ నుంచి మాయమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
నాణ్యత లేని విత్తనాల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు నష్టపరిహారం సులభంగా అందే వ్యవస్థ లేదని, కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం చిన్న రైతులకు సాధ్యం కాదని రైతు నాయకులు అంటున్నారు. మరోవైపు, విదేశీ సంస్థలకు VCU టెస్టింగ్ అనుమతి ఇవ్వడం ద్వారా జన్యుమార్పిడి, జీన్-ఎడిటెడ్ విత్తనాలు దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు రైతుల కోసం కాకుండా, విత్తన కంపెనీలు, వ్యవసాయవాణిజ్య ప్రయోజనాల కోసం రాసినట్టుంది. జన్యుమార్పిడి విత్తనాలు నాటితే రైతులు మరింత అప్పుల్లో కూరుకుపోతారు, రైతు ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉందని భారత్ బీజ్ స్వరాజ్ మంచ్‌కు చెందిన నిపుణుడు భరత్ మాన్సటా వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం మాత్రం దీన్ని రైతు సంక్షేమం కోసం తీసుకొచ్చిన సంస్కరణగా అభివర్ణిస్తోంది. కానీ రైతు సంఘాలు దీన్ని విత్తన స్వేచ్ఛను కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నంగా చెబుతున్నాయి. ప్రస్తుతం ముసాయిదా దశలో ఉన్న ఈ బిల్లుపై ప్రజల అభిప్రాయాలను jsseeds-agri@gov.in అనే ఈమెయిల్ ద్వారా తెలపాల్సిందిగా కోరారు.
రైతుల భవిష్యత్తు, దేశ ఆహార భద్రత ఈ బిల్లు దశాదిశలపై ఆధారపడి ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు






