త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | మహిళా ఎమ్మెల్యేల‌ చీర‌లు లాగుతారా?.. ఇదేం రాజ్యం రేవంత్‌?

Harish Rao | అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌స్తున్న మ‌హిళా శాస‌న స‌భ్యుల చీర‌లు లాగుతారా? ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై పోలీసుల‌ను ప్ర‌యోగిస్తారా? ఎమ్మెల్యేల‌ను మెడ ప‌ట్టి గెంటేస్తారా? ఇదే రాజ్యం రేవంత్‌రెడ్డి? పోలీసు రాజ్యం న‌డుపుతున్న‌వా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ తీవ్ర స్థాయిలో ఫైర‌య్యారు.

S

Telangana | Published On Sep 7, 2026, 1.03 pm IST

Harish Rao | మహిళా ఎమ్మెల్యేల‌ చీర‌లు లాగుతారా?.. ఇదేం రాజ్యం రేవంత్‌?
Advertisement
  • ప్రజాప్రతినిధులపై పోలీసులను ప్రయోగిస్తారా?
  • ఎమ్మెల్యేలను మెడ పట్టి గెంటేస్తారా?
  • ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం లేకుండా చ‌ర్చ పెడితే త‌ప్పు చేసిన‌ట్లే
  • తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే
  • తెలంగాణ భవన్ వద్ద మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్షం ఉప నేత హరీశ్ రావు ధ్వజం

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌స్తున్న మ‌హిళా శాస‌న స‌భ్యుల చీర‌లు లాగుతారా? ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై పోలీసుల‌ను ప్ర‌యోగిస్తారా? ఎమ్మెల్యేల‌ను మెడ ప‌ట్టి గెంటేస్తారా? ఇదే రాజ్యం రేవంత్‌రెడ్డి? పోలీసు రాజ్యం న‌డుపుతున్న‌వా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ తీవ్ర స్థాయిలో ఫైర‌య్యారు. మ‌హిళా స‌భ్యుల చీర‌లు లాగిన పోలీసుల‌ను వ‌దిలిపెట్ట‌మ‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ అసెంబ్లీ చ‌రిత్ర‌లో ఈరోజు బ్లాక్ డే అని అభివ‌ర్ణించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ అంటే ప్ర‌భుత్వం ఎందుకు పారిపోతున్న‌ద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద ఆయ‌న మాట్లాడుతూ.. రేవంత్ ప్ర‌భుత్వంపై రుస‌రుస‌లాడారు.

ఇది శాసన సభనా.. లేక కౌరవ సభనా? ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, పింఛన్లు, ఫీ రియింబర్స్ మెంట్, రైతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల గురించి అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడకుండా గొంతు నొక్కారు. వెయ్యి రోజుల విఫల పాలన వాస్తవాలు బట్టబయలు అవుతాయని భయపడ్డారు. అందుకే మాపై పోలీసులను ప్రయోగించారు. సభ్యుల పట్ల అమానుషంగా, అమానవీయంగా ప్రవర్తించారు. మహిళా శాసనసభా నాయకుల చీర‌లు లాగుతారా? మా పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తారా?

కేటీఆర్‌తో పాటు స‌భ్యులు గాయ‌ప‌డ్డ‌రు..

సునీతమ్మ చీర లాగిన పోలీసులను, సబితమ్మ గొంతు నొక్కిన పోలీసులను, జగదీష్ రెడ్డిని కింద పడేసిన వారినైనా సరే.. సప్త సముద్రాల అవ‌త‌ల‌ ఉన్నా వదిలిపెట్టం. ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా అడ్డుకుంటారా? కేటీఆర్‌కు చేయి గీరుకుపోయింది, ముఖం మీద గీరుకుపోయింది. యాదవ రెడ్డికి కుడి కాలు గోరు పోయింది, రాజశేఖరెడ్డి కాలు కమిలిపోయింది, సంజయ్ చేయికి దెబ్బ తగిలింది. హోంమంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి.. నువ్వు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

బీజేపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సంగ్ చేసుకొని 22ఏ మీద, ఫీజు రియింబ‌ర్స్‌మెంట్‌ మీద నామమాత్రపు చర్చ చేస్తారా?ప్రధాన ప్రతిపక్షం వద్దా? రాహుల్ గాంధీ, ప్రియాంక నల్ల టీ షర్ట్స్ వేసుకొని పార్లమెంట్‌కు వెళ్లారు. ఇక్కడ ఎందుకు అడ్డుకుంటారు. మేం ప్రజల తర‌ఫున నిరసన తెలుపుతుంటే అడ్డుకుంటున్నారు. రేవంత్ రెడ్డిలా మేం బడివే అనలేదు, పైల్వాన్లు ఉన్నరు కొడుతరు అనలేదు. మేం మీ వైఫల్యాల గురించి ప్రజాస్వామ్య పద్ధ‌తిలో నిరసన తెలుపుతున్నాం.

ప్రధాన ప్రతిపక్షం లేకుండా చర్చ జరుపుతాం అంటే ఈ ప్రభుత్వం పారిపోయినట్లే, తప్పు చేసినట్లే. మీరు తప్పు చేయకుంటే ఎందుకు ఎజెండాలో పెట్టడం లేదు. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదు. విద్యార్థులు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. వందలాది మంది వచ్చి వినతులు ఇస్తున్నరు. ఉద్యోగాలు చేయలేక పోతున్నా, ఉన్నత చదవులకు వెళ్ల లేకపోతున్నాం అని ఆవేదన చెందుతున్నారు.

బీజేపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్‌

బీజేపీ, కాంగ్రెస్ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసి, బీఆర్ఎస్ సభలో లేకుండా చేస్తున్నారు. ప‌థకం ప్రకారం ఒక కుట్రతో వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని సస్పెండ్ చేయడానికి ఒక వ్యూహం ప్రకారం నడుచుకున్నారు. ఎన్ని కుట్రలు చేసినా 22ఏ, ఫీజు రీయింబర్స్ మెంట్ వైఫల్యాల గురించి వదిలిపెట్టం. స్కాంలు, వైఫల్యాలు బయట పడుతాయని ఇదంతా చేసారు.

తోక ముడిచి పథకం ప్రకారం కుట్ర పన్నారు. మా చెల్లమ్మ గొంతు నొక్కితే చూస్తూ ఊరుకుంటారా? ఒక అక్క గొంతు పిసికితే చేతులు కట్టుకొని చూస్తూ ఉండారా? ఇదేం ప్రజాస్వామ్యం? ఇది పోలీసు రాజ్యమా రేవంత్ రెడ్డి? ప్రజల సమస్యల మీద చర్చ అంటే ప్రభుత్వం భ‌యపడుతున్నది. మేం లేకుండా చర్చ అంటే ప్రభుత్వానికి ముఖం లేదు. ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని హ‌రీశ్ రావు వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement